ఈ క్షమాపణ ఖరీదు 50 ఏళ్ల జైలు జీవితం.. ఈ పోలీస్ బాస్ క్షమాపణల వెనుక గుండెలను పిండేసే కన్నీటి గాధ

మరణ శిక్ష పడిన 50 ఏళ్లకు నిర్దోషిగా విడుదలైన వ్యక్తి ఇంటికెళ్లి పోలీస్ బాస్ క్షమాపణలు చెప్పారు.

Update: 2024-10-21 13:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్ణయాధికారం కలిగిన వ్యక్తులు ఆచితూచి ఆలోచనలు చేయాలి. అలా కాదని ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఆ ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అలాంటి ఓ ఘటనే జపాన్ లోని ఓ వ్యక్తికి జీవితకాపు పీడకలలా మారింది. చేయని నేరానికి 50 ఏళ్ల పాటు జైలు గోడల మధ్య మగ్గిపోవాల్సి వచ్చింది. తీరా అతడు నిర్దోషి అని తేలడంతో ఇటీవలే విడుదలై బయటకు వచ్చాడు. దీంతో అతడి విషయంలో జరిగిన తప్పిదానికి ఏకంగా పోలీసు బాసే స్వయంగా అతడి ఇంటికి వచ్చి క్షమాపణలు కోరారు. ఈ ఘటన జపాన్ లో సోమవారం చోటు చేసుకుంది.

ఇవావో హకమడ అనే వ్యక్తి ఆగష్టు, 1966లో సెంట్రల్ జపాన్‌లోని హమామట్సులో మిసో బీన్ పేస్ట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ని అతని కుటుంబ సభ్యులలో ముగ్గురిని చంపిన కేసులో అరెస్టయ్యాడు. 1968 జిల్లా కోర్టు అతడికి మొదట మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆ తీర్పుపై అప్పీల్ కు వెళ్లడంతో సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతూనే ఉంది. దీంతో ఇవావో హకమడ జైల్లోనే ఉండగా అతడి కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో గత నెలలో అతడిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. దీంతో ఐదు దశాబ్దాలుగా అనుభవిస్తున్న జైలు జీవితం నుంచి విముక్తి పొందాడు. అయితే తప్పుడు అభియోగాల కింద సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడపాల్సి రావడం పట్ల అక్కడి పోలీస్ చీఫ్ స్వయంగా హకమడ ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడం పట్ల నెటిజన్లు హకమడకు జరిగిన అన్యాయంపై స్పందిస్తున్నారు. సారీ చెప్తే సరిపోతుందా? అతడు కోల్పోయిన విలువైన జీవిత కాలపు పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.


Similar News