Hasina :షేక్ హసీనాపై మరో నాలుగు మర్డర్ కేసులు

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

Update: 2024-08-25 13:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెపై మరో నాలుగు మర్డర్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆమెపై నమోదైన మొత్తం మర్డర్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. గతంలో హసీనా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిపైనా పెద్దసంఖ్యలో మర్డర్ కేసులు నమోదయ్యాయి. హసీనాపై కొత్తగా నమోదైన మర్డర్ కేసుల విషయానికొస్తే.. బంగ్లాదేశ్ రైఫిల్స్ విభాగం మాజీ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుర్రహీం 2010 సంవత్సరంలో జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీనిపై అబ్దుర్రహీం కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు హసీనా సహా మొత్తం 13 మందిపై హత్య కేసును నమోదు చేశారు.

బంగ్లాదేశ్‌లో జులై 18న జరిగిన నిరసనల్లో మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థి షేక్ అషాబుల్ ఈమిన్ హత్యకు గురయ్యాడు. అతడి అంకుల్ ఫిర్యాదు మేరకు హసీనా సహా మొత్తం 49 మందిపై మర్డర్ కేసును నమోదు చేశారు. గత నెలలో జరిగిన నిరసనల సందర్భంగా ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రోడక్ట్స్‌కు చెందిన సెల్లర్ హత్య జరిగింది. చనిపోయిన వ్యక్తి బంధువు ఫిర్యాదు మేరకు హసీనా సహా మొత్తం 28 మందిపై మర్డర్ కేసును నమోదు చేశారు. ఇవే నిరసనల్లో ఒక ఆటో రిక్షా డ్రైవర్ హత్య జరిగింది. దానికి సంబంధించి నమోదైన కేసులోనూ హసీనా సహా మొత్తం 26 మంది పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి.


Similar News