ఖురాన్‌ను తగులబెట్టడనే నేపంతో వ్యక్తిని హత్య చేసిన కేసులో 27 మంది అరెస్ట్

ఇటీవల వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో స్వాత్ జిల్లాలో పవిత్రమైన ఖురాన్‌‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడనే కోపంతో కొంతమంది ఆకాతీయులు ఒక వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-06-23 09:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో స్వాత్ జిల్లాలో పవిత్రమైన ఖురాన్‌‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడనే కోపంతో కొంతమంది ఆకాతీయులు ఒక వ్యక్తిని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా 27 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. జూన్ 20 న వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో స్వాత్ జిల్లాలో ఒక వ్యక్తి ఖురాన్‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడని గొడవ జరగడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని మద్యన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కాసేపటికి పోలీస్ స్టేషన్ బయట గుమికూడిన గుంపు అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అందుకు పోలీసులు నిరాకరించడంతో వారు కాల్పులు జరపడం ప్రారంభించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

ఆ తరువాత పోలీసు స్టేషన్‌, వాహనానికి నిప్పు పెట్టి, లోపలికి చొరబడి అతడిని మద్యన్ అడ్డాకు ఈడ్చుకెళ్లారు. అక్కడ రోడ్డు మధ్యలో నిందితుల గుంపు ఆ వ్యక్తికి నిప్పు పెట్టారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో తీవ్ర అలజడి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మద్యన్‌లో భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెపికె అలీ అమీన్ గండాపూర్ ఈ ఘటనపై దృష్టి సారించి, నిందితులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీనిలో మరికొందరి పాత్ర కూడా ఉందని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు.


Similar News