గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 మంది మృతి

ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికి హమాస్ అంతమే లక్ష్యంగా తన దాడులు కొనసాగిస్తుంది

Update: 2024-06-25 12:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికి హమాస్ అంతమే లక్ష్యంగా తన దాడులు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంపై మూడు వేర్వేరు వైమానిక దాడులు చేయగా 24 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఉదయం దక్షిణాన ఉన్న రఫా పట్టణంలోకి ఇజ్రాయెల్ దళాలు చొరబడి ఇళ్లను పేల్చి వేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నగరంలోని రెండు పాఠశాలలను తాకాయి, దీంతో అక్కడ 14 మంది మరణించారు.

అలాగే, గాజా స్ట్రిప్‌లోని ఎనిమిది చారిత్రాత్మక శరణార్థుల శిబిరాల్లో ఒకటైన అల్-షాతీ శిబిరంలోని ఒక ఇంటిపై దాడి చేయగా, మరో 10 మంది మరణించారు. అయితే ఈ ఇల్లు ఖతార్‌లో ఉన్న హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే కుటుంబానికి చెందినది. దాడిలో అతని సోదరితో పాటు ఇతర బంధువులు కూడా చనిపోయారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మృతదేహాలను గాజా సిటీలోని అల్-అహ్లీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద అనేక మృతదేహాలు ఇంకా ఉన్నాయి. అయితే వాటిని వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు మా వద్ద లేవని ఆ ప్రాంత పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు.

హమాస్ దౌత్యానికి నాయకత్వం వహిస్తున్న హనీయే, అక్టోబరు 7 నుండి ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడుల్లో అతని ముగ్గురు కుమారులతో సహా అతని బంధువులలో చాలా మందిని కోల్పోయారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ నిబంధనలు, విలువలను ధిక్కరిస్తూ అమాయక పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భయంకరమైన హత్యాకాండలకు పాల్పడుతుందని మహమూద్ బసల్ అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఈ దాడిపై స్పందిస్తూ, హమాస్ టెర్రరిస్టులు ఉత్తర గాజా స్ట్రిప్‌లోని షాతి, దరాజ్ తుఫాలో ఉపయోగించిన రెండు నిర్మాణాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులు పాఠశాలలను తమ కార్యకలాపాలకు కవచంగా ఉపయోగించుకున్నారని తెలిపింది.


Similar News