మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి.. ఇద్దరు మంత్రులు అరెస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : మాల్దీవుల దేశంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది.

Update: 2024-06-27 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మాల్దీవుల దేశంలో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఏకంగా దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై చేతబడి చేయిస్తున్న ఇద్దరు మంత్రులు షమ్నాజ్ సలీమ్, ఆదం రమీజ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. సీనియర్ మహిళా నేత షమ్నాజ్ సలీమ్ ప్రస్తుతం మాల్దీవుల పర్యావరణ శాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తున్నారు. షమ్నాజ్ సలీమ్ మాజీ భర్తే ఆదం రమీజ్. ఈయన కూడా ప్రస్తుతం మహ్మద్ ముయిజ్జు ప్రభుత్వంలో మంత్రి పదవిలోనే ఉన్నారు. చేతబడి చేస్తుండగా షమ్నాజ్ సలీమ్, మరో ఇద్దరు వ్యక్తులను మాల్దీవుల పోలీసులు గత ఆదివారం రాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తాజాగా గురువారం ఉదయం మంత్రి ఆదం రమీజ్‌ను కూడా అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో షమ్నాజ్ సలీమ్, ఆమె మాజీ భర్త ఆదం రమీజ్‌లను మంత్రి పదవుల నుంచి తొలగించారు. కాగా, దేశ అధ్యక్షుడు కాకముందు మాలే నగర కౌన్సిల్ మేయర్‌గా ముయిజ్జు వ్యవహరించారు. ఆ సమయంలో ముయిజ్జుకు అత్యంత సన్నిహిత వ్యక్తులుగా షమ్నాజ్ సలీమ్, ఆదం రమీజ్‌లకు పేరు ఉండేది. ఆ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు తన ప్రభుత్వంలో వారిద్దరికీ మంత్రి పదవులను ముయిజ్జు కేటాయించారు.


Similar News