రాష్ట్రంలోనే తొలిసారిగా కేటీఆర్ ఇలాకలో..!
దిశ, సిరిసిల్ల: డ్రైవింగ్ ప్రమాణాలు, నైపుణ్యాలను పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధనా సంస్థల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల మేరకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఐడీటీఆర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ఐడీటీఆర్ సెంటర్‌ను 2016 సంవత్సరంలో సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేసింది. సుమారు రూ. 16.48 కోట్లను శిక్షణ […]
దిశ, సిరిసిల్ల: డ్రైవింగ్ ప్రమాణాలు, నైపుణ్యాలను పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ, పరిశోధనా సంస్థల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల మేరకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఐడీటీఆర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలి ఐడీటీఆర్ సెంటర్‌ను 2016 సంవత్సరంలో సిరిసిల్ల జిల్లాకు మంజూరు చేసింది. సుమారు రూ. 16.48 కోట్లను శిక్షణ కేంద్రం కోసం కేటాయించారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి సమీపంలోని 20 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులను మొదలు పెట్టారు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఐడీటీఆర్ నిర్మాణ పనులను పూర్తి చేశారు. త్వరలోనే ఐడీటీఆర్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం
అంతర్జాతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీతో ఐడీటీఆర్‌ను రూపొందించారు. విశాలమైన స్థలంలో భవనాన్ని జీప్లస్2 పద్ధతిలో నిర్మించి, మూడు బ్లాకులుగా విభజించారు. మెయిన్ బ్లాక్‌లో ఆరు క్లాస్‌రూంలు ఏర్పాటు చేశారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌తో పాటు వర్క్‌షాప్ కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో విశాలమైన ట్రాకులు నిర్మించారు.
6,4 లేన్ల ట్రాక్‌లు
ఆధునిక 3.25 కిలోమీటర్ల ట్రాక్‌లో ఆరు, నాలుగు లేన్ల ట్రాక్‌లు ఉన్నాయి. ఐదు వాహనాలతో పాటు, మూడు డ్రైవింగ్ సిమ్యులేటర్లను కూడా ఇండోర్ శిక్షణ కోసం ఏర్పాటు చేశారు. మూడు సిమ్యులేటర్లలో ఒకటి భారీ, రెండు లైట్ సిమ్యులేటర్లు ఉన్నాయి. సిమ్యులేటర్లలో కూర్చున్న విద్యార్థులకు 3డీ స్క్రీన్లు సిమ్యులేటర్లలో స్థిరంగా ఉంటాయి. వాస్తవ రహదారి పరిస్థితులపై వాహనం నడుపుతున్న అనుభూతిని పొందుతారు. డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశారు. శిక్షణకు ఉపయోగించే వాహనాల విడిభాగాలు, రహదారి ప్రయాణంలో ఎదురయ్యే సూచికలు, ఇతర పరికరాలను గదుల్లో అమర్చారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వాహనాలు నడపడంలో మెలకువలు తెలుసుకునేందుకు డిజిటల్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అశోక్ లే లాండ్ సంస్థతో పాటు పలు ప్రైవేట్ సంస్థల నిర్వహణలో ఐడీటీఆర్ కొనసాగనుంది.
వసతితో శిక్షణ
ఐడీటీఆర్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన శిక్షణ అందుతుంది.ఇందులో 180 మందికి వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. వసతి కోసం భవనంలో ప్రత్యేక గదులు నిర్మించారు. కాగా, వసతి గృహంలో ఉండలేని వారికి డే స్కాలర్ కింద కూడా శిక్షణ అందిస్తారు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అశోక్ లేలాండ్ భారీ, తేలికపాటి, మధ్యస్థ వాహనాల డ్రైవింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. సిద్ధాంతం, ఆచరణాత్మక శిక్షణతో పాటు, వాహనాల యొక్క వివిధ భాగాలను వర్క్‌షాపుల్లో ఉంచడం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
డ్రైవర్లకు కూడా..
పాత డ్రైవర్లకు కూడా రిఫ్రెషర్ కోర్సు కింద శిక్షణ ఇవ్వబడుతుంది. 30 మంది అనుభవజ్ఞులైన శిక్షకులతో అన్ని రకాల డ్రైవింగ్‌లో ట్రైనింగ్ ఇస్తారు. భారీ, తేలికపాటి వాహనాల శిక్షణను 31, 21 రోజుల కాలపరిమితితో అందిస్తారు. శిక్షణ తరగతులకు ఒక్కో బ్యాచ్‌కు 30 మందికి అవకాశం ఉంటుంది. ఏటా సగటున నాలుగు వేల మంది డ్రైవింగ్ శిక్షణ పొందే వీలు కల్పించనున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు అశోక్ లేలాండ్ యాజమాన్యం ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది.
విదేశాల్లో మంచి ఉద్యోగాలు: వై.కొండల్ రావు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్
ఆధునిక సౌకర్యాలతో ఐడీటీఆర్ అభివృద్ధి చేయడంతో ప్రజలు అంతర్జాతీయ ప్రామాణిక శిక్షణ పొందుతారు. డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన వారికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. కాబట్టి, ఐడీటీఆర్‌లో శిక్షణ పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, అధిక వేతనాలు లభిస్తాయి. నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఐడీటీఆర్ సిద్ధంగా ఉంది. రాబోయే నెల రోజుల్లో ఈ సంస్థను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.