డెలి‘వర్రీ’ బాయ్స్ ఇన్ కరోనా టైమ్స్..

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్‌లో ఓ ఐటీ ప్రొఫెషనల్ శ్రీ‌నగర్ కాలనీలో ఓ రూమ్ అద్దెకు తీసుకొని వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. రాత్రి ఫ్లాట్‌లోనే ఏ బ్రెడ్డు ముక్కో తిని పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున నిద్ర లేచేసరికి ఆకలేస్తోంది. ఇంకేముంది పక్కనే ఉన్న మొబైల్ తీసుకొని స్విగ్గీ యాప్ ఓపెన్ చేశాడు. అతను రెగ్యులర్‌గా ఆర్డర్ చేసుకొనే దగ్గరలోని ఏ హోటల్‌లోనూ ఆర్డర్‌లు యాక్సెప్ట్ చేయలేదు. క్లోజ్డ్ అని యాప్ చూపిస్తోంది. ఎక్కడో అయిదారు కిలోమీటర్ల […]

Update: 2020-04-14 19:28 GMT

దిశ, న్యూస్‌బ్యూరో:
హైదరాబాద్‌లో ఓ ఐటీ ప్రొఫెషనల్ శ్రీ‌నగర్ కాలనీలో ఓ రూమ్ అద్దెకు తీసుకొని వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. రాత్రి ఫ్లాట్‌లోనే ఏ బ్రెడ్డు ముక్కో తిని పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున నిద్ర లేచేసరికి ఆకలేస్తోంది. ఇంకేముంది పక్కనే ఉన్న మొబైల్ తీసుకొని స్విగ్గీ యాప్ ఓపెన్ చేశాడు. అతను రెగ్యులర్‌గా ఆర్డర్ చేసుకొనే దగ్గరలోని ఏ హోటల్‌లోనూ ఆర్డర్‌లు యాక్సెప్ట్ చేయలేదు. క్లోజ్డ్ అని యాప్ చూపిస్తోంది. ఎక్కడో అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్‌లో తనకు నచ్చిన టిఫిన్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ అదే ఏరియాలో వేచి చూస్తున్న యూనిఫాంలో లేని ఓ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీకి చెందిన ఓ డెలివర్ బాయ్‌కి చేరింది. ఆర్డర్ పడగానే బైక్ సార్ట్ చేసి రయ్‌మని డెలివరీ బాయ్ హోటల్ వైపు దూసుకెళ్లసాగాడు. ఇంతలో పోలీసులు చెక్‌పోస్టు దగ్గర ఆ డెలివరీ బాయ్‌ని ఆపేశారు. తనిఖీ చేయాలన్నారు. ఎందుకు బయట తిరుగుతున్నావని అడిగారు. సార్.. నాది స్విగ్గీ సార్. కస్టమర్‌కు టిఫిన్ తీసుకురావడానికి హోటల్‌కు వెళ్తున్నానని ఆన్సర్ చెప్పాడు. దీనికి ఆ కానిస్టేబుల్ నీకొక్కడికి ఇక్కడ హోటలెవడు తెరిచిండ్రా పో… అన్నాడు. నాకొక్కడికి కాదు సార్ నాలాంటోళ్లు చాలా మందున్నారు సార్.. అని సమాధానం చెప్పాడు డెలివరీ బాయ్. అయితే నీ నల్లటి డ్రెస్సూ… బ్యాగ్ ఏదిరా అనడిగాడు. సార్ ఇయ్యాలొక్కరోజు అర్జెంటుగా వచ్చి వేస్కోలేదు సార్ అని చెప్పాడు. అయినా ఆ కానిస్టేబుల్ కనికరించలేదు.. దీనికి ఆ డెలివరీ బాయ్ ఆ కానిస్టేబుల్‌ను బతిమిలాడసాగాడు. అక్కడే పక్కన కాస్త చదువుకున్న వాడిలా కనిపిస్తున్న యంగ్ ఎస్ఐ ఉంటే అతనికి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాడు. సార్..సార్… స్విగ్గీ డెలివరీ బాయ్‌ని సార్… ఆర్డర్ పడితే వెళ్తున్నాను.. సార్ వెళ్లొద్దంటున్నాడు.. మాకు పర్మిషన్ ఉంది సార్.. అని వాళ్ల కంపెనీ యాప్‌లో పంపించిన పాస్‌ను చూపించబోయాడు. అది సరిగా చూడకుండానే …వీన్ని పోనియ్… అని ఆ ఎస్ఐ కానిస్టేబుల్‌తో అన్నాడు. దీంతో అక్కడి నుంచి మళ్లీ బైక్ స్టార్ట్ చేసి ఆ ఐటీ యువకుడు ఆర్డర్ చేసిన హోటల్‌కు వెళ్లాడు. తన ఆర్డర్ గురించి ఎంక్వైరీ చేసి అరగంట పడుతుందంటే ఓపిగ్గా వెయిట్ చేసి మరీ ఆ టిఫిన్ పార్సిల్ పట్టుకొని ఆ ఐటీ ప్రొఫెషనల్ ఇంటికి బయలుదేరాడు.

మళ్లీ పోలీసులు.. బాబోయ్..

ఈసారి ఇక వీళ్లతో వద్దనుకొని షార్ట్ కట్‌లో ఎలాగోలా కస్టమర్ ఇంటివద్దకు చేరుకున్నాడు. వెళ్లగానే అక్కడ మరో సినిమా స్టార్టయింది. ఇప్పటికే లేటయిందనుకొని నేరుగా వెళ్లి ఆ ఇంటిగేటు తెరవబోయాడు డెలివరీ బాయ్. ఇంతలో ఆ ఇంటి ఓనర్ వచ్చి రేయ్.. ఎవడ్రా నిన్ను లోపలికి రమ్మన్నది, గేటు ముట్టుకోమన్నది, బయటే ఉండు.. అన్నాడు. సార్ మీ ఇంటి నుంచే ఆర్డర్ వచ్చింది సార్.. టిఫిన్ తీసుకొచ్చాను అని చెప్పాడు. ఆ అయితే ఆ పై పెంట్ హౌసులో ఉండే కుర్రాడేమోననుకొని ఆ ఐటీ ప్రొఫెషనల్‌ను పిలిచాడు ఓనర్. తర్వాత అతను కిందికి వచ్చి టిఫిన్ తీసుకొని ఏం లేటయింది. ఇప్పుడా తెచ్చేది.. అంటూ పార్సిల్ తీసుకున్నాడు.. దీనికి.. కంగారు పడిన ఆ డెలివరీ బాయ్ లాక్‌డౌన్ కదా సార్ బయట హోటళ్లు లేవు.. ఉన్న కాన్నే మస్తు మంది.. మీది నుంచి పోలీసులు అని సర్ది చెప్పి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి సార్ అని అడిగాడు. సరేలే అని ఆన్సరిచ్చుకుంటూ ఆ ఐటీ కుర్రాడు వెళ్లిపోయాడు. అబ్బ అంటూ… ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ ఊపిరి పీల్చుకున్నాడు. మళ్లీ ఇంకో ఆర్డర్ కోసం ఫోన్ చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇలా అటు పోలీసుల వేధింపులు.. ఇటు కస్టమర్ల వేధింపులు అన్నింటిని తట్టుకొని ఈ ఆర్డర్ డెలివరీ చేస్తే అతనికి వచ్చేది కేవలం 50 రూపాయలు. ఇదీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ కంపెనీల్లో పనిచేస్తూ ఇంట్లో టైముకు వంట చేసుకోలేని, వంట చేయడానికి ఎవరూ లేని వాళ్ల ఆకలి తీరుస్తున్న డెలివరీ బాయ్‌ల పరిస్థితి. గత నాలుగైదు ఏళ్ల నుంచి హైదరాబాదే కాకుండా దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలు బాగా పాపులర్ అయ్యాయి. ప్రజల లైఫ్ స్టైల్ మారడం, ఫోన్ డాటా చార్జెస్ తగ్గడం, మెట్రో నగరాల్లో ట్రాఫిక్ హెవీగా ఉండడం లాంటి కారణాలతో ప్రజలు ఇళ్లలోనుంచే ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి అలవాటు పడ్డారు. దేశంలో మొత్తం గత 5 ఏళ్లలో 2 లక్షల మంది ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్‌కి ఫుడ్ డెలివరీ టెక్నాలజీ కంపెనీల వల్ల ఉద్యోగాలు దొరికాయి. హైదరాబాద్‌లో 10 వేల మందికిపైగా యువకులు ఈ ఫుడ్ డెలివరీ కంపెనీల్లో డెలివరీ పార్ట్ నర్స్‌గా ఉపాధి పొందుతున్నారు.

సొంత బైక్ ఉండి స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేసే జ్ఞానం ఉంటే చాలు ఈ ఉద్యోగాల్లోకి కంపెనీలు యువకులను తీసుకుంటున్నాయి. పార్ట్ టైం డ్యూటీ చేసుకొని రోజుకు ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉండడంతో చాలామంది నిరుద్యోగ, ఇతర పనులు చేస్తున్న యువకులు ఈ రంగంలోకి ఎంటరయ్యారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చిన లాక్‌డౌన్‌తో అత్యవసర సర్వీసులే పనిచేస్తుండడం, అందులో ఫుడ్ డెలివరీ చేసే ఈ డెలివరీ బాయ్స్‌కి పర్మిషన్ ఉండడంతో వీరు ఇప్పుడు సొసైటీలో హీరోలయ్యారని చెప్పక తప్పదు. ఇలాంటి కష్ట సమయాల్లో ఆహారమవసరమున్న వాళ్ల ఆకలిని ప్రాణాలు రిస్క్ చేసి మరీ వీరు తీరుస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

80 శాతం దాకా పడిపోయిన బిజినెస్..

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి స్పీడు పెరిగిన తర్వాత మార్చి 22న జనతా కర్ఫ్యూను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తొలుత మార్చి31 దాకా లాక్‌డౌన్ ప్రకటించింది. దీనిని వెంటనే ఏప్రిల్ 14 దాకా పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. లాక్‌డౌన్ ప్రకటించిన తొలి రోజుల్లో స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల వ్యాపారం పాతాళానికి పడిపోయింది. అంతకముందున్న వ్యాపారంతో పోలిస్తే 90 శాతం వ్యాపారం తగ్గింది. పైగా అక్కడో ఇక్కడో ఏవైనా ఆర్డర్ హానర్ చేసే హోటళక్ల కంటే పార్సిల్ తీసుకురావడానికి వెళుతున్న బాయ్స్‌ను పోలీసులు మొదట్లో అడ్డుకున్నారు. ఫుడ్ పార్సిల్స్ చేరవేయడానికి అనుమతుందని వారికి తెలియకపోవడం దీనికి కారణం. కొన్ని చోట్లయితే డెలివరీ బాయ్స్‌ను పోలీసులు చితకబాదిన సంఘటనలు జరిగాయి.

తర్వాత కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల యాజమాన్యాలు ప్రభుత్వాలకు ప్రత్యేకంగా విన్నవించుకొని అనుమతులు తీసుకున్నారు. అందులో తెలంగాణ సైతం ఫుడ్ డెలివరీ చేసుకునే యాప్ కంపెనీలకు అనుమతిచ్చింది. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం బిజినెస్ 80 శాతం వరకు పడిపోయిందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. దీనికి కారణం ప్రజలు కరోనా వైరస్‌కు భయపడి బయటి ఫుడ్ మానేయడమేనని తాము అనుకుంటున్నట్టు వారు చెబుతున్నారు. పేరొందిన రెస్టారెంట్లు సైతం మూతపడ్డాయని 10 శాతం హోటళ్లు మాత్రమే పార్సిల్లు ఇస్తున్నాయని చెబుతున్నారు. డెలివరీ బాయ్స్‌లోనూ చాలామంది డ్యూటీలకు రావట్లేదని, అంతకుముందు పనిచేసిన వాళ్లలో కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారని అంటున్నారు. మిగతా వాళ్లంతా ఊళ్లకు వెళ్లిపోయినట్టు తమకు సమాచారముందని చెబుతున్నారు.

రన్నింగ్‌లో ఉన్నవి కొన్నే హోటళ్లు…

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించగానే నగరంలో చాలా హోటళ్లు తెరచుకోలేదు. టేక్ అవే అంటే పార్సిల్లు కట్టి ఫుడ్ అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి ఉన్నప్పటికీ కరోనా వైరస్ ఎక్కడ అంటుతుందో అన్న భయంతో చాలామంది యజమానులు హోటళ్లు తెరవడం లేదు. దీంతో స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో పరిమిత దూరంలోనే ఆర్డరివ్వాలన్న నిబంధనను తొలగించారు. కస్టమర్ ఉన్న చోటు నుంచి ఎంత దూరంలో తెరిచి ఉన్న హోటల్‌లో ఆర్డరిచ్చినప్పటికీ కస్టమర్ ఉన్న ఏరియాలో లాగిన్ అయిన డెలివరీ బాయ్‌కి వెళుతోంది. ఆర్డర్ అందిన వెంటనే దూరం ఎంతనేది చూడకుండా డెలివరీ బాయ్ హోటల్‌కు వెళ్లి ఫుడ్ పార్సిల్ తీసుకొస్తున్నాడు. అయితే ఇతని జోన్ దాటి వెళ్లి మళ్లీ పార్సిల్ తీసుకొచ్చేంత సేపు ఆర్డర్ పడదు. వేరే జోన్‌లో ఉన్నంతసేపు లాగ్ అవుట్ అయినట్టే లెక్క. మళ్లీ ఆర్డర్ పడాలంటే ఇతను లాగిన్ అయ్యే ఏరియాకు వచ్చి వెయిట్ చేయాల్సిందే. ఇలా 2 కిలోమీటర్ల లోపు ఆర్డర్‌కు రూ.30 చొప్పున కంపెనీలు చెల్లిస్తున్నాయి. 2 కిలో మీటర్లు దాటి ప్రతి కిలోమీటర్‌కు మరో 10 రూపాయల చొప్పున చెల్లిస్తున్నాయి.

సేఫ్ డెలివరీ కోసం కంపెనీల ప్రత్యేక చర్యలు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయటి ఫుడ్ అనుమతించడం ఎంత వరకు కరక్టని ఇటీవల ఒక ట్విట్టర్ ఖాతాదారుడు ట్వీట్ పోస్ట్ చేశాడు. దానికి స్విగ్గీ, జొమాటోలను ట్యాగ్ చేశాడు. దీంతో ఆయా ఫుడ్ డెలివరీ కంపెనీలు తాము సేఫ్‌గా ఫుడ్ డెలివరీ చేస్తామని చెప్పడానికి కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాయి. స్విగ్గీ కాంటాక్ట్ లెస్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే డెలివరీ బాయ్‌తో కస్టమర్లకు కాంటాక్ట్ అయ్యే అవసరమేమీ లేకుండా వీలైన చోటల్లా ఫుడ్ వచ్చిందని కస్టమర్‌కు ఇంటి బెల్ రింగ్ చేసో, పార్సిల్ ఇంటి డోర్ ముందు పెట్టి వెళ్లి ఫోన్ చేసి చెప్పమనో సూచిస్తోంది. జొమాటో తమ డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఎలాంటి కరోనా సింప్టమ్స్ లేవని కన్ఫర్మ్ చేసుకున్నాకే విధుల్లోకి తీసుకొంటోంది.

కస్టమర్స్ ను దాదాపు కలవట్లేదు..
కైలాష్, సికింద్రాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్

‘బిజినెస్ పడిపోయింది. అప్పుడున్న హోటళ్లలో చాలావరకు మూత పడ్డాయి. ఆర్డర్ వస్తే ఎక్కడి కంటే అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. అంతకముందు 2 కిలో మీటర్ల లోపు ఆర్డర్‌లు మాత్రమే తీసుకునేవాళ్లం. అప్పట్లో గంటకు 3 ఆర్డర్లు పడేవి. కనీసం రోజుకు 1000 రూపాయల వరకు సంపాదించే వాళ్లం. ఇప్పుడు రూ.500 మాత్రమే వస్తున్నాయి. ఇన్సెంటివ్స్ ఏమీ రావడం లేదు. లాక్‌డౌన్ స్టార్టయిన కొత్తలో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కోసారి చేయి చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. మా వాళ్లు కొందరైతే లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కస్టమర్లు మాకు ఏదో రోగం ఉన్నట్టే చూస్తున్నారు. ఇంటి గేట్లు ముట్టుకోనివ్వడం లేదు. గేటు బయట పార్సిల్ పెట్టి రింగ్ ఇచ్చి వెళ్లిపోమంటున్నారు. మా కంపెనీ వాళ్లు కూడా మాకు కస్టమర్లు వద్దంటే వారిని కలవొద్దని చెప్పారు. వారికి ఎలా కావాలో అలాగే పార్సిల్ అక్కడ పెట్టి వెళ్లిపోమని చెప్పారు. కొందరు కస్టమర్లు వాల్లే పెద్ద కవర్ తెచ్చుకొని మేం పట్టుకుపోయిన కవర్ లోనుంచి పార్సిల్ అందులో వేయముంటున్నారు. ఈ పరిస్థితిలోను పనిచేస్తున్నాము. కస్టమర్ల
ఆరోగ్యం ముఖ్యమని కంపెనీ చెప్పింది’

సాయంత్రం ఆరు దాకే ఏం సంపాదించినా..
ప్రసాద్, జొమాటో డెలివరీ బాయ్

‘లాక్‌డౌన్ పెట్టకముందు అసలు ఆర్డర్లు సాయంత్రమే స్టార్టయ్యేవి. ఇప్పుడేమో సాయంత్రం ఆరైందంటే బిజినెస్ ఆగిపోతుంది. ఆర్డర్లు తగ్గిపోయాయి. బిజినెస్ లేదు. ఇన్సెంటివ్స్ రావట్లేదు. ఇంట్లో ఉండలేక ఖర్చుల కోసం రిస్క్ చేస్తున్నాం. పోలీసులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. దూరం ఆర్డర్ పడితే పెట్రోల్ ఖర్చులు పోను అసలు వర్కవుట్ అవట్లేదు. కంపెనీ శానిటైజర్ ఇచ్చింది. ఎప్పటికప్పుడు చేతులు దానితో శుభ్రం చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లోనే మా అవసరం ప్రజలకు ఉందంటే ఇక మా ఉద్యోగాలకు డోకా లేదు. ప్రభుత్వాలు కూడా మాతోనే సరుకులు డెలివరీ చేయాలని ఆలోచిస్తున్నాయంటే ఈ బిజినెస్‌కు ఇక చావు లేదు. కానీ, లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు. లాక్‌డౌన్ ముగిస్తే కానీ మాకు మళ్లీ నెలకు రూ.25 వేలు సంపాదించుకునే రోజులు రావు. రోగం నుంచి కాపాడుకుంటూ పోలీసుల నుంచి తప్పించుకుంటూ కస్టమర్ల అవమానాలను భరిస్తూ ప్రజల ఆకలి తీరుస్తున్నామన్న తృప్తి మాత్రం మిగులుతోంది’.

Tags:    

Similar News