విద్యుత్ చార్జీలు పెరగడం ఖాయమేనా?

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగడం ఖాయమేనా? లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మధ్య తేడా ఉండడంతో ఆర్థిక పరిపుష్టి కోసం చార్జీలను పెంచక తప్పదని డిస్కంలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా వరుసగా మూడు నెలల బిల్లుల్ని ఒకేసారి ఇవ్వడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి సమయంలో కరెంటు చార్జీలను పెంచితే ప్రజల నుంచి మరింత ఆగ్రహం తప్పదనే అభిప్రాయం కూడా రెండు డిస్కంల ఉన్నతాధికారుల్లో ఉంది. పెంచకుంటే ఆర్థిక […]

Update: 2020-06-18 03:18 GMT

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగడం ఖాయమేనా? లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మధ్య తేడా ఉండడంతో ఆర్థిక పరిపుష్టి కోసం చార్జీలను పెంచక తప్పదని డిస్కంలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా వరుసగా మూడు నెలల బిల్లుల్ని ఒకేసారి ఇవ్వడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి సమయంలో కరెంటు చార్జీలను పెంచితే ప్రజల నుంచి మరింత ఆగ్రహం తప్పదనే అభిప్రాయం కూడా రెండు డిస్కంల ఉన్నతాధికారుల్లో ఉంది. పెంచకుంటే ఆర్థిక ఇబ్బందులు, పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత. ఇలా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక డిస్కంలు సతమతమవుతున్నాయని అంటున్నారు. ఈ నెల 30 లోపు విద్యుత్ క్రమబద్ధీకరణ సంస్థ (ఈఆర్సీ)కి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) సమర్పించాల్సి ఉంది. దీంతో ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం నడుచుకుందామనే స్పష్టతకు డిస్కంలు వచ్చాయని అంటున్నారు. నిజానికి కరెంటు చార్జీలను పెంచే ఆలోచన లేదని లాక్‌డౌన్‌కు ముందు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కానీ, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని డిస్కంల ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ మేరకు పెంచితే నిలదొక్కుకోగలమో సీఎంకు వివరించడానికి సిద్ధమవుతున్నారు.

సర్కారు నిర్ణయమేమిటో?

విద్యుత్ చార్జీలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా వ్యాప్తి నిరోధానికి కట్టడి విధించడంతో దేశంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. లాక్‌డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్ బిల్లులు వసూలు చేయని డిస్కంలు జూన్‌లో ఒకేసారి మూడు నెలల బిల్లుల్ని ఇచ్చాయి. శ్లాబ్ రేటు మారిపోయి ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తోందని, దొడ్డిదారిన ఎక్కువ ఆర్జించడానికి డిస్కంలు దుర్మార్గపు ఆలోచన చేశాయని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. దీంతో సందేహాలను నివృత్తి చేయడానికి, అర్థం చేయించడానికి ఏకంగా హెల్ప్‌లైన్ డెస్కునే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీలు పెంచితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వానికి తెలియందేమీ కాదు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృపహ విద్యుత్ వినియోగదారులే ఎక్కువ. ఆదాయ వనరులను పెంచుకోవాలంటే వీరి మీద కూడా ఎంతో కొంత భారం మోపక తప్పదని విద్యుత్ అధికారుల అభిప్రాయం. సుమారు రెండు నెలల పాటు వ్యాపారాల్లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు క్రాస్ సబ్సిడీ పేర ఉన్న అధిక చార్జీలు చెల్లించడానికే ఆపసోపాలు పడుతున్నారు. గృహ వినియోగదారులకు నామమాత్రంగా పెంచి కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారుల మీద భారం మోపే పరిస్థితి కూడా లేదు. దీంతో ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవడం సమస్యాత్మకంగా మారింది.

నష్టాలను పూడ్చుకోవడానికే

రాష్ట్రంలో చివరిసారిగా 2015లో విద్యుత్ చార్జీలు పెరిగాయి. అప్పట్లో 100 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు స్వల్పంగా 4 శాతం, 200 యూనిట్ల కన్నా విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు 5.75 శాతం పెరిగింది. కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులకు అన్ని రకాల చార్జీలపై 5.75 శాతం దాకా పెరిగింది. దీంతో రూ. 825.61 కోట్ల మేర అదనపు ఆదాయాన్ని డిస్కంలు సమకూర్చుకున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఒక్క దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థనే కేవలం రూ. 2 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఎన్పీడీసీఎల్ మరో రూ. 600 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు అంచనా. ఈ లోటును పూడ్చుకోవడానికి చార్జీలు పెంచక తప్పదని భావిస్తున్నాయి. కానీ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. డిస్కంల నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం నుంచి లభించే హామీకి అనుగుణంగా రెండు డిస్కంలు ఏఆర్ఆర్ రూపొందిస్తాయి.

ఏఆర్ఆర్ల సమర్పణ రెండుసార్లు వాయిదా

ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2019-20), ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ల‌ను రెండు డిస్కంలు గతేడాది నవంబరు నాటికే ఈఆర్సీకి సమర్పించాల్సి ఉంది. కానీ, మార్చి 31 దాకా గడువు కావాలని కోరడంతో ఈఆర్సీ అనుమతించింది. అప్పటికి లాక్‌డౌన్ వచ్చేసింది. ఫలితంగా డిస్కంలు ఏఆర్ఆర్లను సమర్పించలేకపోయాయి. మరోసారి గడువు పెంచాల్సిందిగా కోరే పరిస్థితులు ఏర్పడ్డాయి. లిఖితపూర్వకంగా అలాంటి విజ్ఞప్తి మాత్రం చేయలేదు. మరోవైపు ఈసారి గడువు పెంచేది లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీంతో జూన్ 30 లోపు నివేదికలు ఇవ్వడానికి డిస్కంలు సిద్ధమవుతున్నాయి.

Tags:    

Similar News