నాలుగోసారైనా శ్రీవారి దర్శనం దక్కుతుందా?
తిరుమల తిరుపతి దేవస్థానం నాలుగోసారి దర్శనాలు రద్దు చేసేలా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత నెల 20న తొలుత వారం రోజుల పాటు, ఆపై ఏప్రిల్ 14 వరకూ, దాని తరువాత మే 3 వరకూ దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు మే 4 నుంచి కూడా దర్శనం కల్పించడం సాధ్యమవుతుందా? అన్న […]
తిరుమల తిరుపతి దేవస్థానం నాలుగోసారి దర్శనాలు రద్దు చేసేలా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత నెల 20న తొలుత వారం రోజుల పాటు, ఆపై ఏప్రిల్ 14 వరకూ, దాని తరువాత మే 3 వరకూ దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం, ఇప్పుడు మే 4 నుంచి కూడా దర్శనం కల్పించడం సాధ్యమవుతుందా? అన్న మేధోమధనం నిర్వహిస్తోంది.
కరోనా ఇంకా పూర్తిగా కట్టడి కాలేదు. దర్శనాలు కల్పిస్తే దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఎవరికైనా వైరస్ సోకితే, ఇక్కడి రద్దీ కారణంగా అది ఇతరులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. దీంతో దర్శనాల రద్దును మరిన్ని రోజుల పాటు పొడిగించాలన్న ఆలోచనలో టీటీడీ ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, ప్రస్తుతానికి తిరుమలలో విధులు నిర్వహించే అధికారులు, పూజాది కైంకర్యాలు జరిపించే అర్చకులు మినహా మరెవరికీ కొండపైకి ప్రవేశం లేదు.
ఆలయంలోకి భక్తులకు అనుమతి లేకున్నా, స్వామివారికి జరిగే అన్ని కైంకర్యాలనూ వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరిపిస్తున్నామని అర్చకులు అంటున్నారు. ఆలయాన్ని తెల్లవారుజామున 3 గంటలకే సుప్రభాత సేవతో తెరుస్తున్నామని, రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నామని వెల్లడించారు. కల్యాణ, వసంతోత్సవ తదితర సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
మరోవైపు ప్రకృతి అందాలకు కొలువైన సప్తగిరుల్లో నెలకొన్న నిర్మానుష్యం వన్య ప్రాణులకు వరంగా మారింది. వాహనాలతో పాటు జనసంచారం లేకపోవడంతో అవి యధేచ్చగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నాయి. పనిలోపనిగా, తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో షికారుకు వస్తున్నాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా, తిరుమల ఔటర్ రింగ్ రోడ్డుపై ఎలుగుబంట్లు సంచరిస్తున్న వీడియో వైరల్ కాగా, మరో ప్రాంతంలో చిరుతపులి కనిపించింది. ఇక కోతులు, పాముల సంచారం సరేసరి. దీంతో టీటీడీ ఫారెస్ట్ విభాగం అధికారులు స్థానిక బాలాజీ నగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.
జనసంచారం పూర్తిగా లేకపోవడంతోనే జంతువులు అడవుల నుంచి బయటకు వస్తున్నాయని, స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. తిరుమలలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్స్ ద్వారా 50 మంది అనుక్షణం వన్యప్రాణుల కదలికలపై కన్నేశారని తెలిపారు. ఏవైనా జంతువులు వచ్చాయని గుర్తిస్తే, వెంటనే ఆ ప్రాంతానికి సిబ్బంది వస్తారని, డప్పు శబ్దాలతో పాటు, డమ్మీ గన్ లను వాడి, వాటిని తరిమేస్తామని తెలిపారు.
Tags: ttd, tirupatihi, sri venkateswaraswami, no entry, lockdown, extension