కేసీఆర్ సర్కార్‌కు బిగ్ షాక్.. పెట్రో ధరల తగ్గింపు తప్పదా.?

దిశ, ప్రత్యేక ప్రతినిధి : ఉప ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు కానీ, ప్రజల్లో వస్తున్న నిరసన జ్వాల ధాటికి అయితేనేమి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై అమాంతంగా ఎక్త్సెజ్​సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా వాటిపై వ్యాట్‌ను తగ్గిస్తూ ఇతర రాష్ట్రాలకు సవాల్​విసురుతున్నాయి. వ్యాట్​తగ్గించాలా.? తగ్గించకపోతే రాజకీయంగా వచ్చే నష్టం ఎంత.? అనే మీమాంసలో ఇతర పార్టీల ప్రభుత్వాలు సంకటంలో పడ్డాయి. ఈ క్రమంలో వ్యాట్​ ద్వారా వేలాది కోట్ల రాబడి పొందుతున్న […]

Update: 2021-11-05 21:04 GMT

దిశ, ప్రత్యేక ప్రతినిధి : ఉప ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు కానీ, ప్రజల్లో వస్తున్న నిరసన జ్వాల ధాటికి అయితేనేమి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై అమాంతంగా ఎక్త్సెజ్​సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒక్కొక్కటిగా వాటిపై వ్యాట్‌ను తగ్గిస్తూ ఇతర రాష్ట్రాలకు సవాల్​విసురుతున్నాయి. వ్యాట్​తగ్గించాలా.? తగ్గించకపోతే రాజకీయంగా వచ్చే నష్టం ఎంత.? అనే మీమాంసలో ఇతర పార్టీల ప్రభుత్వాలు సంకటంలో పడ్డాయి. ఈ క్రమంలో వ్యాట్​ ద్వారా వేలాది కోట్ల రాబడి పొందుతున్న తెలంగాణ సర్కార్.. ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో భారీ వడ్డన..

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి మరీ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయి. దేశ ప్రజలపై కేంద్రం రూ.2.25లక్షల కోట్ల వరకు, రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.3లక్షల కోట్ల పన్ను భారం మోపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లీటర్​పెట్రోల్, డీజిల్‌పై మొత్తంగా 69% పన్ను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లీటర్ ​పెట్రోల్‌పై 35.2%, డీజిల్‌పై 27.3%, కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.33, డీజిల్‌పై రూ.32 పన్నుతో వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు మద్యం మాత్రమే జీఎస్‌టీ పరిధిలో లేవు. ఈ ఉత్పత్తులపై వ్యాట్ రూపంలో ఎంత పన్ను విధించాలన్న విచక్షణ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌తో పాటు కేంద్రం ఎక్త్సెజ్, సెస్ రూపంలో పన్నులను విధిస్తున్నది. కేంద్ర పన్నుల వాటాలో ఎక్త్సెజ్ సుంకం రాష్ట్రాలకు 42% చొప్పున పంచుతున్నప్పటికీ సెస్‌ను మాత్రం రాష్ట్రాలకు ఇవ్వదు. ఈ మధ్య కాలంలో కేంద్రం తెలివిగా పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ను పెంచుకుంటూ పోవడంతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి గండి పడుతున్నది. ఈ విషయంలో రెండేండ్లుగా సరాసరి రూ.1,500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు నష్టం వస్తున్నదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అక్కడికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గేదే లేదన్నట్లు భారీగానే వ్యాట్‌ను వడ్డిస్తున్నది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు కనీసం రూ. వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతున్నది. సొంత పన్నుల రాబడి వాటాలో ఇది రూ. 12వేల కోట్లుగా ఉంది.

తెలివిగా కేంద్రం ఎత్తులు..

2014 నుంచి పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల రాబడి 300% పెరిగింది. పెట్రోల్‌పై 2014లో రూ.9.48 ఉన్న పన్ను రూ.32.90కి పెరిగింది. అదే సమయంలో డీజిల్‌పై పన్ను రూ.3.56 నుంచి 31.80కి పెరిగింది. పెట్రోల్, డీజిల్‌పై పెరుగుతున్న ధరలకు కేంద్రానిదే పాపమని రాష్ట్రాలంటే, రాష్ట్రాలదీ తప్పేనని కేంద్రం వాదిస్తున్నది. ‘ధరల గొడవ ఎందుకు? జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే పాపమైనా, పుణ్యమైనా సమానంగా ఉంటుంది కదా?’ అని కేంద్రం వాదన. ‘కాదు ఉన్న ఒక్క సొంత పన్ను వ్యాట్ రాబడికి గండి కొట్టి గుత్తాధిపత్యం కోసం కేంద్రం ఎత్తులు వేస్తున్నది. వ్యాట్​జోలికి రావద్దు.. అవసరమైతే సెస్‌ను తగ్గించాలి’ అని రాష్ట్రాలు డిమాండ్​ చేస్తున్నాయి.

ఒకవైపు జీఎస్‌టీ పరిధిలోకి తేవాలా? వద్దా? అనే విషయంపై సందిగ్ధం కొనసాగుతుండగానే కేంద్రం తెలివిగా ఎక్త్సెజ్​సుంకాన్ని తగ్గించి ఒక రకంగా రాష్ట్రాలను ఇరకాటంలోకి నెట్టింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీకి ధరల సెగ తగిలింది. సిట్టింగ్ స్థానాలలో సైతం పరాభవం ఎదురుకావడంతో కేంద్రం ధరల నియంత్రణకు చర్యలను చేపట్టింది. పెట్రోల్‌పై 5, డీజిల్‌పై 10 రూపాయల మేరకు ఎక్త్సెజ్​సుంకాన్ని తగ్గించి ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాలలో త్వరలో జరుగునున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ధరలను నియంత్రించడానికి ఎత్తులు వేస్తున్నది.

ఉత్తరప్రదేశ్, హర్యానాలో లీటర్ డీజిల్, పెట్రోల్‌పై రూ.12 చొప్పున వ్యాట్​పన్నును తగ్గించగా, అస్సోం, కర్ణాటక, గోవా, మణిపూర్, త్రిపుర, మిజోరంలో రూ.7 చొప్పున తగ్గించాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం రూ.1.50 మాత్రమే తగ్గించింది. బీజేపీయేతర రాష్ట్రం నవీన్​పట్నాయక్​నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం మాత్రం లీటర్‌పై రూ.3 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లీటర్ పెట్రోల్‌పై రూ.12.85, డీజిల్‌పై రూ. 19 తగ్గించింది. చండీఘర్, నాగాలాండ్‌లో రూ.7, జమ్మూకాశ్మీర్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.4.60 తగ్గగా, అరుణాచల్​ప్రదేశ్‌లో రూ.5.5శాతం వ్యాట్ తగ్గింది.

Tags:    

Similar News