భర్త బతికుంటే తనకు ప్రశాంతత ఉండదని.. భార్య ఏం చేసిందంటే..?
దిశ, ఎల్బీనగర్ : భార్యాభర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన భర్త రోజు కొడుతుండటంతో విసుగు చెందిన భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సరూర్‌నగర్ సీఐ కే.సీతారాం కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా బుసిరెడ్డి గ్రామానికి చెందిన బుసిరెడ్డి మురళీధర్ రెడ్డి (42)తో మిర్యాలగూడకు చెందిన బుసిరెడ్డి మౌనిక (25)ను ఇచ్చి 11 ఏండ్ల కిందట పెద్దలు పెళ్లి జరిపించారు. వీరికి […]
దిశ, ఎల్బీనగర్ : భార్యాభర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన భర్త రోజు కొడుతుండటంతో విసుగు చెందిన భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సరూర్‌నగర్ సీఐ కే.సీతారాం కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా బుసిరెడ్డి గ్రామానికి చెందిన బుసిరెడ్డి మురళీధర్ రెడ్డి (42)తో మిర్యాలగూడకు చెందిన బుసిరెడ్డి మౌనిక (25)ను ఇచ్చి 11 ఏండ్ల కిందట పెద్దలు పెళ్లి జరిపించారు. వీరికి శ్రేయస్ రెడ్డి అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు.
ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చి కొంతకాలం సైదాబాద్ కాలనీలో నివాసం ఉన్నారు. అనంతరం సరూర్‌నగర్ శ్రీ సాయికృష్ణ నగర్ కాలనీలోని సాయి నిఖిల నివాస్ అపార్ట్‌మెంట్‌కు మారారు. మురళీధర్‌రెడ్డి హైటెక్ సిటీలోని ఓ హార్డ్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, ఈ నెల 6వ తేదీన మౌనిక బీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేందుకు గుంటూరు జిల్లా గంగవరం వెళ్లింది. అదే రోజు పరీక్ష రాసి సాయంత్రం 4.30 గంటలకు తన ఇంటికి చేరకుంది. అప్పుడు ఆమె భర్త కొడుకు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. భర్త కంప్యూటర్ రూమ్‌లో ఉండగా, కొడుకు ఆమె వద్దకు వచ్చి నాన్న నీ గురించి అందరికీ చెడుగా చెబుతున్నాడని తల్లికి వివరించాడు.
దీంతో మౌనిక నా గురించి ఎందుకు చెడుగా చెబుతున్నావని భర్తతో గొడవపడింది. ఇష్టం లేకపోతే వదిలేయాలని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన భర్త బతికి ఉంటే ఇదే విధంగా గొడవ పడతాడని, అతడిని చంపేస్తే ఏ గొడవ ఉండదని భావించిన ఇల్లాలు మురళీధర్‌రెడ్డి నిద్రిస్తుండగా కిచెన్ రూంలో నుంచి కత్తి తెచ్చి గొంతులో పొడిచి హత్య చేసింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాలనుకుంది. కానీ, వీలు కాకపోవడంతో సోమవారం ఉదయం 7.30 గంటలకు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సీతారం తెలిపారు.