విద్యాసాగర్‌రావును పక్కన పెట్టారా? మోడీ టీమ్ ప్లాన్ ఏంటి?

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ గవర్నర్, తెలంగాణ బీజేపీ నేత విద్యాసాగర్‌రావు పాత్ర ప్రజెంట్ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గవర్నర్ పదవి ముగిసాక వెంటనే పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన మళ్లీ ఎందుకు పత్తా లేకుండా పోయారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాషాయ కండువా కప్పుకున్న రోజే కేసీఆర్‌కు గట్టి ప్రశ్నలు సంధించి, ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదన్నది క్వశ్చన్‌మార్క్‌గా మారింది. అయితే కావాలనే సీనియర్ నేతలు రెండోసారి పార్టీలోకి తీసుకొచ్చి పక్కన పెట్టారా? […]

Update: 2021-02-06 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ గవర్నర్, తెలంగాణ బీజేపీ నేత విద్యాసాగర్‌రావు పాత్ర ప్రజెంట్ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. గవర్నర్ పదవి ముగిసాక వెంటనే పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన మళ్లీ ఎందుకు పత్తా లేకుండా పోయారన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాషాయ కండువా కప్పుకున్న రోజే కేసీఆర్‌కు గట్టి ప్రశ్నలు సంధించి, ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదన్నది క్వశ్చన్‌మార్క్‌గా మారింది. అయితే కావాలనే సీనియర్ నేతలు రెండోసారి పార్టీలోకి తీసుకొచ్చి పక్కన పెట్టారా? లేకుంటే ఏదైనా ప్లాన్ ఉందా! ఇదంతా హైకమాండే పైనుంచి లీడ్ చేస్తుందా అన్నది బహిరంగ చర్చకు వస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు వాజ్‌పేయి హయాంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా సేవలందించారు. అనంతరం 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 26న విద్యాసాగర్‌రావును మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు ఐదేళ్ల పాటు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2019, సెప్టెంబర్ 1న కొత్తవారికి బాధ్యతలు అప్పగించి హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యారు. 15రోజుల్లోనే నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం గమనార్హం.

రాష్ట్రంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో నడిచిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో గానీ, ప్రెస్‌మీట్లలో గానీ ఎక్కడా దర్శనం ఇచ్చిన సందర్భాలు కనపడలేదు. తల్లిలాంటి బీజేపీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందని, ఇక నుంచి కార్యకర్తగా బీజేపీకి అంకితమవుతానని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అని పార్టీలో చేరిన రోజున ఉపన్యాసం ఇచ్చారు. కానీ ఆ ప్రసంగం తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలోనూ ఆయన కనిపించలేదు. అయితే ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్.. సీనియర్ నేత అయిన విద్యాసాగర్‌రావు సూచనలను పాటించరని, గతంలో నుంచే వీరిద్దరికి పార్టీలో అంతగా పొసగలేదు కాబట్టే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొన్న విద్యాసాగర్‌రావు పార్టీకి, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.

‘కులం’ పేరు చెప్పి కూర్చోబెట్టారా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాసాగర్‌రావు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో వీరు తక్కువ పర్సంటేజే ఉన్నా అధికారంలో ఉండి మళ్లీ వెనుకటిలా ‘దొర’ అని పిలిపించుకుంటున్నారన్న ముద్ర పడింది. అయితే బీజేపీ హైకమాండ్ ఎప్పట్నుంచో తెలంగాణలో అధికారంపై కన్నేసినందున ఎక్కువ జనాభా ఉన్న బీసీల ఓటు బ్యాంక్‌ కోసం ‘బీసీ’ నేతలకే సపోర్టు చేస్తుందన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. అందుకే మళ్లీ విద్యాసాగర్‌రావును యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తెస్తే 2023 ఎన్నికల వరకు సీఎం అభ్యర్థి అవుతారని, ఒక దొర పోతే.. ఇంకో కొత్త దొరను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రశ్నలు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే మోడీ టీమ్.. బీసీ అయిన బండి సంజయ్ కి పుష్ అప్ ఇస్తోందన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాలపై ఆరేళ్లుగా సీరియస్‌గా స్టడీ చేస్తున్న బీజేపీ హైకమాండ్ అన్ని ఆలోచించే విద్యాసాగర్‌రావును రీ ఎంట్రీ ఇప్పించి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేకుండా ప్లాన్ చేసిందనే గుసగుసలు ఓ వైపు నుంచి వినిపిస్తుండగా.. మరోవైపు వచ్చేఎన్నికల నాటికి కీలక పదవి అప్పగించి నేషనల్ పాలిటిక్స్‌లోకి తీసుకెళ్తారన్న ఊహాగానాలు బీజేపీ శ్రేణుల నుంచే వినపడుతుండటం విశేషం.

Tags:    

Similar News