నర్సులపై ఎందుకీ వివక్ష..?
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడిలో వైద్యారోగ్య సిబ్బంది సేవలు భేష్ అంటూ ప్రధాని మొదలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు అనేక ప్రశంసలు వచ్చాయి. కానీ హెల్త్ కేర్ వర్కర్లలో డాక్టర్లకే గుర్తింపు ఉంది తప్ప తమకు లేదంటూ నర్సుల అవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కరోనా పేషెంట్లకు సేవచేస్తున్న నర్సుల కృషికి తగిన గుర్తింపు లేకపోయినా బాధపడడంలేదుగానీ వివక్షను మాత్రం భరించలేకపోతున్నారు. సానుభూతి, ప్రశంసలు ఎలా ఉన్నా సమస్యలకు పరిష్కారం మాత్రం ఎక్కడ […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడిలో వైద్యారోగ్య సిబ్బంది సేవలు భేష్ అంటూ ప్రధాని మొదలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు అనేక ప్రశంసలు వచ్చాయి. కానీ హెల్త్ కేర్ వర్కర్లలో డాక్టర్లకే గుర్తింపు ఉంది తప్ప తమకు లేదంటూ నర్సుల అవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కరోనా పేషెంట్లకు సేవచేస్తున్న నర్సుల కృషికి తగిన గుర్తింపు లేకపోయినా బాధపడడంలేదుగానీ వివక్షను మాత్రం భరించలేకపోతున్నారు. సానుభూతి, ప్రశంసలు ఎలా ఉన్నా సమస్యలకు పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తరహాలనే ఉండిపోయాయని నర్సులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఏడేళ్ళ క్రితం ఫిక్స్ చేసిన రెండు వేల రూపాయల స్టయిఫండే ఇప్పటికీ కొనసాగుతోందని, డాక్టర్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి నర్సుల సమస్యలు, డిమాండ్లు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నలకు సమాధానం కరువైంది. కరోనా కట్టడి టైమ్‌లో నర్సులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే అవకాశమే లేకుండాపోయిందని, నోడల్ ఏజెన్సీ, టాస్క్ ఫోర్స్ లాంటి విభాగాల్లో నర్సులకు ప్రాతినిధ్యమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా బారిన పడిన డాక్టర్లకు ‘నిమ్స్‘ ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్‌లను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన అధికారులకు నర్సుల అవసరాలను మాత్రం ఎందుకు మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. గతంలో మంత్రి ఈటల రాజేందర్‌కు తాజాగా మంత్రి హరీశ్‌రావుకు, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తులు చేసినా అవి పరిష్కారానికి నోచుకోలేదని వాపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్ళుగా నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ళు, డైరెక్టరేట్, కౌన్సిల్ తదితరాలకు పూర్తిస్థాయి అధికారులే లేరని, అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉండిపోయాయని, మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి సొల్యూషనే లేదని వ్యాఖ్యానించారు.
నర్సులంటే చిన్నచూపు..
రాష్ట్రంలోని వైద్య సిబ్బందిలో సుమారు 70 శాతం మంది నర్సులేనని, డాక్టర్లు పరీక్షించిన తర్వాత కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చేది నర్సులేనని, 24 గంటలపాటూ వారికి అందుబాటులో ఉంటున్నా ప్రభుత్వం నుంచి మాత్రం తగిన ప్రాధాన్యత లభించడం లేదనేది వారి ఆవేదన. ఫస్ట్ వేవ్‌లో చాలా మంది నర్సులు వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురై ప్రాణాలు కోల్పోయారని, కనీసం ప్రభుత్వం తరపున ఒక్క ప్రతినిధి లేదా అధికారి ఆ కుటుంబాలను పరామర్శించలేదని గుర్తుచేశారు. డాక్టర్లు చనిపోతే వెంటనే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం నర్సుల విషయంలో అలాంటి ఆసక్తిని ఎందుకు చూపడంలేదని ప్రశ్నిస్తున్నారు.
ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి, వ్యాక్సిన్ ఇవ్వడానికి ఉపయోగపడే నర్సుల సేవలను కీర్తిస్తున్న, ప్రశంసిస్తున్న అధికారులు, మంత్రులు సమస్యల పరిష్కారంపై ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నోడల్ ఏజెన్సీ కూర్పులో నర్సింగ్ తరఫున ఒకరికి ప్రాతినిధ్యం ఉన్నా తెలంగాణలో మాత్రం దానికి నోచుకోలేదని ఎత్తిచూపారు. నర్సుల ప్రతినిధులే లేనప్పుడు వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎలా వెళ్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైన నర్సులకు వారు పనిచేస్తున్న ఆస్పత్రుల్లోనే ట్రీట్‌మెంట్‌కు నోచుకోలేకపోతున్నారని, ఉన్నతాధికారుల పైరవీలపై ఆధారపడాల్సి వస్తున్నదని గుర్తుచేశారు.
కొత్త నర్సింగ్ కళాశాలలూ లేవు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం మూడు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్కదాన్ని కూడా కొత్తగా నెలకొల్పలేదని నర్సింగ్ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించారు. ఇప్పటికే ఉన్న ఆరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో మూడింటికి పూర్తిస్థాయి ప్రిన్సిపాళ్ళు కూడా లేరని గుర్తుచేశారు. ఇక నర్సింగ్ డైరెక్టరేట్‌లో ఫుల్ టైమ్ డిప్యూటీ డైరెక్టర్‌లు, క్రిందిస్థాయి సిబ్బంది కూడా లేరని పేర్కొన్నారు. హై పవర్డ్ కమిటీ సూచించినా ప్రైవేటు రంగంలోనూ నర్సింగ్ కాలేజీలకు సర్కారు అనుమతి ఇవ్వలేదనే విమర్శలు చాలా కాలం నుంచీ ఉన్నాయి. నర్సింగ్ కోర్సు పూర్తిచేసినవారికి సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సత్వరం పూర్తి చేయకపోవడంతో క్వాలిఫై అయ్యి నెలలు గడుస్తున్నా వారికి ఉద్యోగం చేసుకునే అవకాశం లేకపోతోందని యువ విద్యార్థులు వాపోతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీ నర్సింగ్ పోస్టులు ఉన్నా వాటి భర్తీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గతంలో అసెంబ్లీ వేదికగానే ఎమ్మెల్యేల నుంచి విమర్శలు వచ్చాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 3,311 పోస్టులకు మోక్షం కలిగినా అందులో క్వాలిఫై అయిన 2,418 మందికి ఇప్పటికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని అర్హులైన నర్సింగ్ అభ్యర్థులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆర్డర్స్ అందుకోడానికి ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిపైన భర్తీ చేస్తున్న నర్సులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కనీస వేతనాన్ని కూడా అమలుచేయడంలేదని ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నారు.
ఐక్య వేదికగా ఉద్యమం
రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సులకు వేర్వేరు సంఘాలు ఉన్నప్పటికీ వైద్యారోగ్య టీమ్‌లో ఒక విస్తృతమైన అంగమని భావించిన డాక్టర్లు, పారామెడికల్, లాబ్ టెక్నీషియన్ లాంటి విభాగాలకు చెందినవారంతా ఒకే గొడుగు కిందికి చేరారు. మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ యునైటెడ్ ఫోరం పేరుతో కొత్త ఐక్య వేదికను ఏర్పాటైంది. మంత్రి హరీశ్‌రావుకు ఇటీవల 13 డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేసింది.
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఇచ్చిన హామీ ప్రకారం కరోనా చికిత్సలో ఉన్న నర్సులకు పది శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని, ఇన్‌ఫెక్షన్‌కు గురైన నర్సులకు ‘నిమ్స్‘ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, కరోనా కారణంగా చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి నెల రోజుల లోపే కారుణ్య నియమాకం కింద జాబ్ ఇవ్వాలని, కేంద్రం ఇస్తున్న రూ. 50 లక్షల పరిహారం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటి రూపాయలను నెల రోజుల వ్యవధిలోనే ఇవ్వాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి ప్రస్తుత సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించాలని, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలోనే రిక్రూట్‌మెంట్ జరగాలని, క్వారంటైన్‌లో ఉన్న కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణించాలని.. తదితర డిమాండ్లను మంత్రికి వివరించింది.
సానుభూతితో పనులు కావు..
“నర్సులంటే సమాజంలో దీర్ఘకాలంగా వివక్ష ఉంది. ప్రభుత్వంలోనూ అది కనిపిస్తున్నది. డాక్టర్లతో పోలిస్తే నర్సులే ఎక్కువ సమయం పేషెంట్లకు దగ్గరగా ఉండి సేవలందిస్తున్నారు. వైరస్‌కు ఎక్కువగా గురయ్యేది మేమే. డాక్టర్ల పట్ల సానుకూలంగా స్పందించే ప్రభుత్వం మా విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉంది. సానుభూతి అవసరం లేదు. సమస్యలకు పరిష్కారం కావాలి. ఆంద్రప్రదేశ్‌లో నోడల్ ఏజెన్సీలో నర్సుల తరఫున ప్రతినిధి ఉన్నారు. చర్చల్లో నర్సుల సమస్యలను వినిపించి తగిన ఏర్పాట్లు చేయగలుగుతున్నారు. కానీ తెలంగాణలో అది లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నర్సింగ్ కౌన్సిల్, డైరెక్టరేట్ లాంటి వ్యవస్థలన్నీ అలంకార ప్రాయంగా మారిపోయాయి. వైద్య సిబ్బందిలో 70% మేమే. కానీ ఇప్పటికీ మా సమస్యలకు పరిష్కారం దొరకడంలేదు. టెస్టులు చేసిది, ట్రీట్‌మెంట్ ఇచ్చేది, సేవలు చేసేది.. చివరకు వ్యాక్సిన్ ఇచ్చేది కూడా మేమే. కానీ మేమంటే ప్రభుత్వానికి చిన్నచూపు. నిర్లక్ష్యం. నర్సులను వదిలిస్తే ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. మాకు డైరెక్టరేట్, సకాలంలో కౌన్సిల్ ఎన్నికలు జరిగితే మా డిమాండ్లకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఆ అవకాశం ఇవ్వకూడదనే ప్రభుత్వం నానుస్తూ ఉన్నది“. – సుజాత, గ్రేడ్-1 సీనియర్ నర్సు
ప్రభుత్వానికి మొదటి నుంచీ చిన్నచూపు..
“గ్రామాల్లో కుల వివక్ష ఉన్నట్లుగానే మెజారిటీ నర్సులు ఎస్సీ, ఎస్టీకి చెందినవారు కావడంతో ప్రభుత్వానికీ చిన్నచూపు ఉంది. ఏఎన్ఎం, జీఎన్ఎం కోర్సుల స్థానంలో బీ.ఎస్సీ నర్సింగ్ కోర్సు వచ్చిన తర్వాత కాస్త మార్పు కనిపిస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వానికి విశాలమైన దృష్టి లేదు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అధికార పార్టీకి వచ్చే ఫండింగ్ నర్సింగ్ కాలేజీల ద్వారా రాదు. అందుకే వీటిని నెలకొల్పడానికి ఆసక్తి చూపదు. తక్కువ జీతం ఇచ్చినా పనిచేస్తారనే భావనతో నర్సుల వేతనాల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండదు. అందుకే సుప్రీంకోర్టు కనీస వేతనంగా రూ. 20 వేలను ఫిక్స్ చేసినా ప్రభుత్వం దాన్ని అమలుచేయడంలేదు. డాక్టర్లకు ఇచ్చిన ప్రాధాన్యత నర్సులకు ఉండడంలేదు. మేల్ నర్సింగ్ విద్యార్థులకు పోస్టు గ్రాడ్యుయేట్, పీ.హెచ్.డీ.లలో అవకాశాలు కూడా లేవు. నర్సులు లేని ప్రజారోగ్య వ్యవస్థను ఊహించుకోలేం. ప్రస్తుత కరోనా లాంటి విపత్తులు భవిష్యత్తులోనూ కొనసాగితే నర్సుల కొరతతో ప్రజారోగ్య వ్యవస్థే అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది. అంతిమంగా ప్రజలకు వైద్య సేవలకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది“. – నక్కా సూర్యకుమార్, నర్సింగ్ హక్కుల కార్యకర్త