వరంగల్ సీపీ గురించి హాట్ హాట్‌గా చర్చ

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానంలో ఐపీఎస్ అధికారినే సీపీగా నియమించాలని మెజార్టీ ప్రజానీకం డిమాండ్ చేస్తున్నది. వరంగల్ సీపీగా ఐపీఎస్ వస్తే తమ పప్పులు ఉడకవని కొందరు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు ఆర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ పోలీసు కమిషనర్ ఎవరనే విషయమై వరంగల్ జిల్లాలో హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. ఐపీఎస్‌కు చాన్స్ ఇస్తారా? లేక ప్రమోటీలకు ప్రాధాన్యత ఇస్తారనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. సంప్రదాయం కొనసాగిస్తారా? రాష్ట్ర రాజధాని […]

Update: 2020-07-03 20:19 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానంలో ఐపీఎస్ అధికారినే సీపీగా నియమించాలని మెజార్టీ ప్రజానీకం డిమాండ్ చేస్తున్నది. వరంగల్ సీపీగా ఐపీఎస్ వస్తే తమ పప్పులు ఉడకవని కొందరు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు ఆర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ పోలీసు కమిషనర్ ఎవరనే విషయమై వరంగల్ జిల్లాలో హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. ఐపీఎస్‌కు చాన్స్ ఇస్తారా? లేక ప్రమోటీలకు ప్రాధాన్యత ఇస్తారనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.

సంప్రదాయం కొనసాగిస్తారా?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్ద నగరంగా పేరొందింది. జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా మారింది. దీని పరిధిలో వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ జిల్లాలు ఉన్నాయి. ఈ కమిషనరేట్‌కు ప్రభుత్వం డీఐజీ ర్యాంక్ అధికారిని పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ ఇద్దరు సీపీలు పని చేశారు. మొదటి కమిషనర్‌గా సుధీర్‌బాబు పనిచేసినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యాడనే ఆరోపణలు వచ్చాయి. ఆయన బదిలీ తర్వాత విశ్వనాథ రవీందర్ వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదని, దాంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. సీపీ రవీందర్ టైంలో హోంగార్డులకు న్యాయపరంగా దక్కాల్సిన జీతభత్యాల్లో అన్యాయం జరిగినట్లు ప్రచారం జరిగింది. ప్రజా ప్రతినిధులకు కొమ్ము కాస్తూ అమాయకులను ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో భూ ఇసుక మాఫియా, రౌడీయిజం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ కమిషనర్‌గా అనుభవం కలిగిన ఐపీఎస్ అధికారిని తీసుకొస్తారా? లేక ప్రమోటీని నియమిస్తారనేది తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

ప్రజాప్రతినిధుల పావులు..

వరంగల్ జిల్లాలో ప్రజా ప్రతినిధుల దందాలు పెరిగాయి. రియల్ ఎస్టేట్‌తో పాటు పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రజా ప్రతినిధులు అన్ని రంగాల్లో తలదూర్చుతున్నారు. తమ కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు అనుకూలంగా ఉండే అధికారుల పేర్లను పరోక్షంగా సిఫార్సు చేస్తున్నారని సమాచారం. వరంగల్ సీపీ పోస్ట్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో మళ్లీ వచ్చేవారు ఐపీఎస్ స్థాయి అధికారి అయితే తమ పప్పులు ఉడుకవని, తెలిసిన వారినే ఇక్కడికి రప్పించాలని పావులు కదుపుతున్నారు. అత్యంత కీలకమైన వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఎవరు రానున్నారనే అంశంపై పోలీసు శాఖతోపాటు ప్రజల్లో చర్చ జరుగుతుండగా, పలువురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న వి.బి.కమలాసన్‌ రెడ్డి, రామగుండం సీపీ వి.సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్‌లో డీఎస్పీగా పనిచేసిన బి. సుమతి కూడా వరంగల్ పోలీసు కమిషనర్ కావచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్పీగా ఉన్నారు. ఇటీవలే ఆమె డీఐజీగా ప్రమోషన్ పొందడంతో వరంగల్ సీపీ రేసులో ఉన్నారు. వీరితో పాటు నిజామాబాద్‌ సీపీ కార్తికేయ, హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.విశ్వప్రసాద్, హైదరాబాద్‌లో జాయింట్‌ కమిషనర్‌(స్పెషల్‌ బ్రాంచ్‌) డాక్టర్‌ తరుణ్‌జోషి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉండగా ఇటీవల వరంగల్ కమిషనరేట్ ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా ప్రమోద్ కుమార్‌ను నియమించారు.

Tags:    

Similar News