ఆమెకు మంత్రి పైరవి.. మద్దతు వెనక ఆంతర్యం ఏమిటి.?
దిశ, కరీంనగర్ సిటీ : బల్దియాలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ కోల మాలతి ప్రాతినిత్య భవితవ్యంపై, నగర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఓసీ అయిన మాలతి, బీసీ స్థానం నుంచి.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోటీ చేసి గెలుపొందినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెపై అనర్హత వేటు పడేనా.. ఆమెపై చర్యలు తీసుకుని తొలగిస్తే.. 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థికి అవకాశమిస్తారా, తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా.. అనే సందేహాలు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతేడాది […]
దిశ, కరీంనగర్ సిటీ : బల్దియాలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ కోల మాలతి ప్రాతినిత్య భవితవ్యంపై, నగర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఓసీ అయిన మాలతి, బీసీ స్థానం నుంచి.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోటీ చేసి గెలుపొందినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెపై అనర్హత వేటు పడేనా.. ఆమెపై చర్యలు తీసుకుని తొలగిస్తే.. 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థికి అవకాశమిస్తారా, తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా.. అనే సందేహాలు నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
గతేడాది జరిగిన బల్దియా ఎన్నికల్లో ఆరవ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాలతి పోటీ చేసి గెలుపొందారు. బీసీ స్థానంలో ఓసి అయిన ఈమెకు అవకాశమివ్వటం పట్ల, అప్పట్లోనే అధికార పార్టీలో తీవ్ర దుమారం రేగింది. ఈ డివిజన్ నుంచి టికెట్ ఆశించిన సిటింగ్ కార్పొరేటర్ సాదవేని సుజాత అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లింది.
అయితే, మంత్రి కమలాకర్ అండ దండలుండటంతో, పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. అధికార పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ సాదవేని సుజాత, కార్పొరేటర్ కోల మాలతి విద్యా ర్హతల సర్టిఫికెట్లు సంపాదించింది. వాటిలో ఓసి గానే ఉండటంతో, కోర్టును ఆశ్రయించింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో గెలుపొందిందని, 2020 మే 29 న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణ జరపాలంటూ, స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఆమె సర్టిఫికెట్లు పరిశీలించి ఓసీగా నిర్దారించిన తహసీల్దార్, బీసీగా నిరూపించుకునేందుకు 6 మాసాల గడువు ఇచ్చినా, ఎలాంటి ఆధారాలు అందజేయలేదు. దీంతో, ఆమెను ఓసి గానే పరిగణిస్తూ, కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. బీసీ స్థానంలో గెలిచిన ఆమెను తొలగించాలంటూ సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
కాగా, సాక్షాత్తు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మద్దతు తెలుపుతూ ఉండగా, ఏమీ కాదనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి వర్గం మాత్రం వెంటనే తొలగించాలంటూ, ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. దీంతో, మాలతి కార్పొరేటర్ పదవి ఉండేనా.. ఊడేనా అనే చర్చ తెరాస వర్గాల్లో సాగుతుంది.
మాలతికి మంత్రి మద్దతుపై బీసీ సంఘాల మండిపాటు..
ఓసీ అని తెలిసి కూడా బీసీ స్థానంలో టికెట్ ఇచ్చి గెలిపించిన, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్‌పై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కోళ్ల మాలతి బీసీ కాదని స్పష్టమైన ఆధారాలు బహిర్గతమైనా, చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాల్సిన మంత్రి గంగుల మద్దతు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి కార్పొరేటర్ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.