ఆ ఆసుపత్రిలో డాక్టర్ల ఇష్టారాజ్యం.. పేషెంట్లను పట్టించుకోరా..?

దిశ, భువనగిరి రూరల్ : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా.. కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. ఓవైపు కరోనా విజృంభిస్తుండగా.. మరోవైపు వర్షకాలంతో జనాలను సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా […]

Update: 2021-07-18 07:37 GMT

దిశ, భువనగిరి రూరల్ : గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా.. కొందరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. ఓవైపు కరోనా విజృంభిస్తుండగా.. మరోవైపు వర్షకాలంతో జనాలను సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. మండలంలో మొత్తం నాలుగు పీహెచ్‌సీలు ఉండగా.. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నాయి.

ఐ డోంట్ కేర్..

వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 16 మంది విధుల్లో ఉంటున్నారు. ఇక్కడ ఒక ఏఎన్ఎం, ఒక సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యాధికారులతో పాటు మిగతా సిబ్బంది నిత్యం విధులకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఓ వైద్యాధికారికి కరోనా పాజిటివ్ వచ్చిందని గత కొద్దిరోజులుగా విధులకు హాజరు కావడం లేదు. మరో వైద్యాధికారి హైదరాబాద్‌లో ఉంటూ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సదరు వైద్యాధికారి ఉదయం 11 గంటలకు ఆస్పత్రికి వచ్చి తిరిగి 4 గంటల లోపు వెలుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆ వైద్యాధికారిని చూసి మిగతా సిబ్బంది కూడా వారిని ఫాలో అవుతున్నారని వాపోతున్నారు. జ్వరం వచ్చి సాయంత్రం 6 తరువాత ఆస్పత్రికి వెళ్లినా.. మందు గోలీ ఇచ్చే వాళ్లు కరువయ్యారని వలిగొండకు చెందిన కాసుల వెంకన్న వాపోయారు. కనీసం ఓపీ కూడా చూడడం లేదని, సాయంత్రం 4 గంటలకే గేటుకు తాళం వేసి వెళ్తున్నారని తెలిపారు. 9 గ్రామాలకు సంబంధించి ప్రతి రోజు వందల సంఖ్యలో రోగులు ఉన్నా.. కనీసం పదుల సంఖ్యలో కూడా వైద్య సేవలు అందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సీజనల్ జ్వరాలతో ఆస్పత్రికి వచ్చిన వారిని సైతం భువనగిరికి పంపిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యాధికారులు సమయ పాలన అస్సలే పాటించడం లేదని విమర్శిస్తున్నారు.

మచ్చుకైనా కనిపించని పారిశుద్ధ్యం..

వలిగొండలో పెద్దాస్పత్రి ఇదే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు పడకలతో ఏర్పాటు చేసినా.. దాతల సహాయంతో బెడ్లను 20 వరకు పెంచారు. కానీ అందుకు అనుగుణంగా వైద్య సేవలను పెంచలేదు. వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు ఆస్పత్రిని 30 పడకలకు అప్ గ్రేడ్ చేయాలని కోరుతూ వైద్యాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు సమర్పించారు. కానీ నేటికీ అమలుకు నోచుకోలేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది. పీహెచ్‌సీ చుట్టు పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. కోతులు యథేచ్ఛగా ఆస్పత్రిలోకి వచ్చి బెడ్లపై తిరుగుతున్నాయి. నిత్యం క్లిన్ చేయకపోవడంతో దోమలు, దుమ్ము దూళి పేరుకుపోయింది. విష సర్పాలు సైతం ఆస్పత్రి ఆవరణలో దర్శనమిస్తున్నాయి. 22 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆస్పత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. చిన్నపాటి వర్షానికే కురుస్తుండడంతో పాటు పెచ్చులూడి బెడ్లపై పడుతున్నాయి. దీంతో రోగులు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. దీనికి తోడు ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడంతో ఏ చిన్న జర్వమొచ్చినా అప్పులు చేసుకుని జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని మండల ప్రజలు వాపోతున్నారు. వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సుస్తీ చేసిన వైద్య సిబ్బందికి, ఆస్పత్రికి చికిత్స చేయాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

నూతన భవనాలు నిర్మించాలి..

శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చివేసి నూతన భవనాలు నిర్మించాలి. అలాగే పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా మార్చి పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి, 24 గంటలు సేవలు అందించాలి. ప్రస్తుతం వెంటనే అంటెండర్‌ను నియమించి, పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వైద్యాధికారులతో పాటు సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో పీహెచ్‌సీ ఎదుట నిరహారదీక్ష చేస్తాం.- బుంగ సునీల్, తెలంగాణ జన సమితి వలిగొండ మండల అధ్యక్షుడు

పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి..

ఎప్పుడైనా ఆరోగ్యం సరిగ్గా లేక సాయంత్రం పూట ఆసుపత్రికి వెళితే గేటుకు తాళం దర్శనమిస్తుందే తప్ప వైద్యం చేసే వారు కనిపించడం లేదు. మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది కానీ అందుకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం లేక పేద ప్రజలు చాలా బాధను అనుభవిస్తున్నారు. ప్రజలు అనుభవిస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి. హామీలకు పరిమితం అవ్వకుండా పేద ప్రజలకు పూర్తి స్థాయి వైద్యం అందేలా కృషి చేయాలి – కాసుల వెంకన్న, యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ జిల్లా నాయకులు.

Tags:    

Similar News