నయీం లెఫ్ట్ హ్యాండ్ శేషన్న ఏమయ్యాడు..?

దిశ, వెబ్‌డెస్క్ : ఏనుగు చచ్చినా వెయ్యే.. బతికినా వెయ్యే చందంగా మారింది గ్యాంగ్ స్టర్ నయీం కేసు దర్యాప్తు. అతడు ఎన్‌కౌంటర్ అయ్యి.. నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా అందరి నోళ్లల్లో నానుతూనే ఉన్నాడు. నయీం చేసిన అకృత్యాలు, అక్రమాలు, హత్యలు, దోపిడీలు, భూదందాలు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ యంత్రాంగంతో సహా.. అనేక శక్తులను గడగడలాడించిన నయీం.. తన సామ్రాజ్యాన్ని నిరాటంగా కొనసాగేందుకు అనేక మంది రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపయోగించుకున్నాడనే ఆరోపణలు […]

Update: 2020-12-23 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏనుగు చచ్చినా వెయ్యే.. బతికినా వెయ్యే చందంగా మారింది గ్యాంగ్ స్టర్ నయీం కేసు దర్యాప్తు. అతడు ఎన్‌కౌంటర్ అయ్యి.. నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా అందరి నోళ్లల్లో నానుతూనే ఉన్నాడు. నయీం చేసిన అకృత్యాలు, అక్రమాలు, హత్యలు, దోపిడీలు, భూదందాలు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వ యంత్రాంగంతో సహా.. అనేక శక్తులను గడగడలాడించిన నయీం.. తన సామ్రాజ్యాన్ని నిరాటంగా కొనసాగేందుకు అనేక మంది రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపయోగించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎన్‌కౌంటర్ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఆస్తులు, డబ్బు, పట్టుబడిన సొత్తు, ఇలా చాలా విషయాల్లో ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది. వీటన్నింటినీ తేల్చడానికి ప్రభుత్వం సిట్ నియమించింది. కానీ దాని దర్యాప్తు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందనేది ప్రజల మాట. నాలుగేళ్లు గడుస్తున్నా.. కనీసం నయీం కుడి భుజంగా పేర్కొనే శేషన్న ఆచూకీని కూడా కనిపెట్టలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నయీం.. ఈ పేరు చెబితేనే ప్రభుత్వాలు సైతం గడగడలాడిన రోజులు ఉన్నాయి. అధికారులు, రాజకీయ నాయకులకు వెన్నుల్లో వణుకు వచ్చేది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నయీం చేసే ప్రతి అరాచకం వెనక ఎవరో ఒకరు ఉంటారనేది బహిరంగ రహస్యమే.
అయితే నయీం బహిరంగంగా బయటకు రాకపోయినా.. అనుకున్న పని అనుకున్న సమయానికి పక్కాగా జరిగేదని గతంలో పోలీసులు సైతం ధ్రువీకరించారు. నయీం స్కెచ్ వేస్తే.. తూచ తప్పకుండా అమలు చేసేది మాత్రం శేషన్న. శేషన్న కూడా మాజీ మావోయిస్టునే. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన నయీంకు నమ్మిన బంటు.. కుడిభుజం లాంటోడు. నయీం ఏర్పాటు చేసిన యాక్షన్ టీముల్లో ముఖ్యభూమిక పోషించేది శేషన్ననే.

నయీం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రతి పని శేషన్నకు తెలుసన్నది పోలీసులకు తెలిసిన బహిరంగ రహస్యం. భూదందాలు, హత్యలు, సెటిల్మెంట్లు ఇలా ప్రతి విషయంలో శేషన్న హస్తం ఉంటుంది. అయితే 2016 ఆగస్ట్ 8న షాద్‌నగర్ శివారులోని మిలీనియం టౌన్ షిప్‌లో నయీంను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినప్పటి నుంచి శేషన్న జాడ తెలియడం లేదు. నయీం కేసు దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసినా వారి కంటకూడా శేషన్న పడలేదట. దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్న పోలీస్ గా పేరున్న తెలంగాణ పోలీసులు శేషన్నను పట్టుకోలేకపోయారనడం అతిశయోక్తే. శేషన్న దొరికితే నయీంకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నయీం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా చీకటి వ్యాపాలు చేసినట్టు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. గన్స్, బాంబులు, పేలుడు పదార్ధాలు, హవాల మణి, మహిళల అక్రమ రవాణా ఇలా.. ఎన్నో విషయాలు శేషన్నకు తెలియకుండా జరగలేదన్నది జగమెరిగిన సత్యం.

నయీంకు నమ్మిన బంటుగా ఉన్న శేషన్నపై నేరుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. యాక్షన్ టీముల్లో ప్రధాన వ్యక్తి అయినా.. ఆయన పేరుపై కేసులు లేవంటే వారి ప్లాన్లు ఎలా ఉండేవో అర్థం అవుతోంది. ఏడుగురు సభ్యులతో యాక్షన్ టీంను ఏర్పాటు చేసిన నయీం.. ఆయన ఆదేశాల మేరకు పక్కాగా రెక్కీ నిర్వహించిన అనంతరం రంగంలోకి దిగి పని కానిచ్చేవారట. ఆ తర్వాత షెల్టర్ జోన్లకు వెళ్లిపోవడం వారి పని. ఎప్పుడూ చీకట్లోనే ఉండే ఈ టీం.. వెలుగులోకి వచ్చిందంటే ఏదో ఓ ఘాతుకం జరగాల్సిందేనట. అంతా కిరాతంగా వ్యవహరించే ఈ మూఠకు గ్యాంగ్ లీడర్ శేషన్న. వీళ్లు ఏ పని చేసినా వారి తరుఫున లొంగిపోవడానికి మరో గ్యాంగ్ ఉంటేదట. అందుకే ఈ యాక్షన్ టీంపై నేరుగా ఒక్క కేసు నమోదు కాకపోవడానికి ప్రధాన కారణమని పోలీసు వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఈ యాక్షన్ టీం అజ్క్షాతంలోకి వెళ్లింది.

నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన డెన్‌లో 24 తుపాకులు, 752 రిజిస్ట్రేషన్ దస్తావేజులు, 130 డైరీలతో పాటు 602 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో మూడు ఏకే 47న్లు, పిస్టల్స్ 9, రివాల్వర్స్ 3, తపాంచా 7, ఎస్‌బీబీఎల్ 12 బోర్ గన్ 1, స్టెన్ గన్ 1, హ్యాండ్ గ్రెనేడ్స్ 2, జిలిటన్ స్టిక్స్ 10, అమ్మోనియం 5 కేజీలు, నైట్రేట్ అండ్ ప్యూజ్ వైర్ – 10 మీటర్లు, మాగ్జైన్స్ 6, లైవ్ రౌండ్స్ 616 (వేర్వేరు ఆయుధాలవి), ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్ 30, నగదు రూ.2,16,57,180, గోల్డ్ 1.944 కేజీలు, వెండి 2,482 కేజీలు, ఫోర్ వీలర్లు 21, మోటారు సైకిల్స్ 26, సెల్ ఫోన్లు 602, ల్యాండ్ డాక్యుమెంట్లు 752, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ నయీం ఎలా సేకరించగలిగాడు అన్నది పోలీసులకు ఇప్పటి వరకు శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. శేషన్న దొరికితేనే వీటి గుట్టు తెలుస్తుందని పోలీసులే పేర్కొంటున్నారు.

నయీం ఎన్‌కౌంటర్ అయిన కొద్ది రోజుల్లోనే శేషన్నను పోలీసులు అదుపులోకి అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీటిపై పోలీసులు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. అప్పట్లో ఆయనను అరెస్ట్ చేయకపోతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నది మిస్టరీగా మారింది. ఎంతో ఆధునిక సాంకేతికను వినియోగిస్తున్న తెలంగాణ పోలీసులు వందల కేసుల్లో కీలకంగా ఉన్న వ్యక్తి ఆచూకీ కనుక్కోలేక పోతున్నారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలీసుల మదిలో మొదిలే ఎన్నో ప్రశ్నలకు జవాబు శేషన్న. వందల కేసులకు ప్రత్యేక్ష సాక్షి శేషన్న. వేల లావాదేవీలు, సెటిల్మెంట్లకు నిలువెత్తు కటౌట్ శేషన్న. లక్షల చిక్కుముడులను విప్పే శేషన్న.. ఆచూకీ దొరికితే నయీం కేసుకు ఎండ్ కార్డు పడినట్లే. ఇప్పటికైనా సిట్ అధికారులు శేషన్నను అరెస్ట్ చేస్తారా..? లేక పైఅన్ని ప్రశ్నలను శేషంగా మిగిల్చుతారా అన్నది వేచి చూడాల్సిందే..

Tags:    

Similar News