నర్సుల వెతలు.. కరోనా టైంలో గుర్తించి.. ఇప్పుడు వదిలేస్తారా?

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో నర్సుల ప్రాధాన్యం ప్రభుత్వాలకు తెలిసొచ్చింది. దేశ ప్రజలంతా చప్పట్లు కొట్టారు. గంటలు మోగించారు.. దీపాలు వెలిగించారు.. విమానాల నుంచి పూలు చల్లి సత్కరించారు. ప్రధాని మొదలు సామాన్యుల వరకు వారే కరోనా టీకాలు ఇస్తున్నారు. కానీ, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, పోస్టుల భర్తీ, మెరుగైన వేతనాలు ఇవేవీ పాలకులకు పట్టలేదు. టీకా వేయించుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరు నర్సులతో ముచ్చచి వారి సేవలను కొనియాడారు. తమ సంక్షేమం […]

Update: 2021-03-03 10:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో నర్సుల ప్రాధాన్యం ప్రభుత్వాలకు తెలిసొచ్చింది. దేశ ప్రజలంతా చప్పట్లు కొట్టారు. గంటలు మోగించారు.. దీపాలు వెలిగించారు.. విమానాల నుంచి పూలు చల్లి సత్కరించారు. ప్రధాని మొదలు సామాన్యుల వరకు వారే కరోనా టీకాలు ఇస్తున్నారు. కానీ, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, పోస్టుల భర్తీ, మెరుగైన వేతనాలు ఇవేవీ పాలకులకు పట్టలేదు. టీకా వేయించుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరు నర్సులతో ముచ్చచి వారి సేవలను కొనియాడారు. తమ సంక్షేమం గురించి ఏం పట్టించుకున్నారన్న చర్చ ఇప్పుడు నర్సులలో మొదలైంది. జనాభా తగినట్టుగా ఎంత సంఖ్యలో నర్సులు ఉండాలనేది ప్రభుత్వాలకు తెలియందేమీ కాదు. అందుకు అనుగుణంగా నర్సులను నియమించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీకాలు వేయడానికి నర్సుల అవసరం ఉందన్న వాస్తవాన్ని గ్రహించినా, వారికి ఇస్తున్న వేతనాలు, వారి సంక్షేమం, చట్టాలను పటిష్టం చేయడంలాంటి విషయాలను పట్టించుకోలేదనే అసంతృప్తి వారిలో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రైవేటు ఆసుపత్రులలో కనీస వేతనాలు లభించడం లేదు. పని గంటల విషయంలోనూ పర్యవేక్షణ కొరవడిందని తెలంగాణ నర్సింగ్ సంఘం ప్రతినిధి ఒకరు వాపోయారు.

వీరి బాధ వర్ణణాతీతం..

ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులకే నెలల తరబడి జీతాలు రావడంలేదని ఒక నర్సు చెప్పారు. జీతాలు క్రమం తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించిన సంఘటనలను గుర్తుచేశారు. శ్రమ దోపిడీ జరుగుతోందని, జీతంలో కొంత భాగాన్ని ఏజెన్సీ నొక్కేస్తోందని అన్నారు. పీఎఫ్ పేరుతో మరికొంత మినహాయించి జేబులో వేసుకుంటోందని పేర్కొన్నారు. ఇన్ని రకాల అవకతవకలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కరోనా టీకాల సమయంలో మాత్రం ఆ నర్సుల సేవలే అవసరమొచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు వేల నర్సుల పోస్టులు భర్తీ చేయడానికి మూడేళ్లు పట్టిందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నా, వాస్తవిక పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు .

కొత్త కళాశాలలు రావాలి..

కొత్త నర్సింగ్ కళాశాలలు నెలకొల్పి, ఆ వైపున యువతకు అవగాహన పెంచాలని నర్సింగ్ ప్రతినిధులు చెబుతున్నారు. తగిన సీట్లు సృష్టించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. తెలంగాణ ఏర్పడి ఆరున్నరేళ్లయినా మూడు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు మాత్రమే వచ్చాయన్నారు. ప్రభుత్వ నర్సింగ్ స్కూళ్ళలో, కాలేజీలలో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రైవేటు సంస్థల తీరు మరీ ఘోరంగా ఉందని వివరించారు. కరోనా పరిస్థితితోనైనా ప్రభుత్వ ఆలోచనలో మార్పు వస్తుందని ఆశించినా చివరకు అది నేతిబీరలో నేయి చందంగానే మిగిలిపోయిందని ఓ నర్సు ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి పట్ల తగిన గుర్తింపు, గౌరవం లేకపోగా వేతనాల విషయంలోనూ అన్యాయానికి గురవుతున్నామని వాపోయారు. అందుకే యువత ఈ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల యువత మాత్రమే నర్సింగ్ వృత్తి పట్ల ఆసక్తి చూపుతున్నారని, కరోనా సమయంలో వారు సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో తీవ్ర కొరత ఏర్పడిందన్నారు.

Tags:    

Similar News