లాక్‌డౌన్ తర్వాత ప్రపంచం ఎలా ఉంది?
దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో పెద్దమొత్తంలో సడలింపులు రాబోతున్నాయి. వైరస్‌తోనే జీవించాలని మానవాళి కాంప్రమైజ్ అయింది. దీంతో కొన్ని జాగ్రత్తలతో రోజువారీ పనులను ప్రారంభించుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను దాదాపుగా విరమించుకున్నాయి. అయితే లాక్‌డౌన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయా దేశాల ప్రజలు ఎలా ఫీలయ్యారో, ఏం చేశారో మీకోసం.. బార్సిలోనా, స్పెయిన్ లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వగానే ఇక్కడి ప్రజలు మధ్యదరా సముద్రం తీరానికి వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. నెలలపాటు […]
దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌లో పెద్దమొత్తంలో సడలింపులు రాబోతున్నాయి. వైరస్‌తోనే జీవించాలని మానవాళి కాంప్రమైజ్ అయింది. దీంతో కొన్ని జాగ్రత్తలతో రోజువారీ పనులను ప్రారంభించుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను దాదాపుగా విరమించుకున్నాయి. అయితే లాక్‌డౌన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయా దేశాల ప్రజలు ఎలా ఫీలయ్యారో, ఏం చేశారో మీకోసం..
బార్సిలోనా, స్పెయిన్
లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వగానే ఇక్కడి ప్రజలు మధ్యదరా సముద్రం తీరానికి వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. నెలలపాటు ఇళ్లకే పరిమితమవడం వల్ల ప్రతి ఒక్కటీ కొత్తగా కనిపించిందని 34 ఏళ్ల వలేరియా కొనటెల్లీ ఆనందంతో చెప్పింది. ఇప్పుడు ప్రజలందరూ ఒక్కొక్కరుగా పార్కుల్లో వాకింగ్‌కి, జాగింగ్‌కి కూడా వస్తున్నారు. అయితే పార్కుల్లోకి వస్తున్నవారెవరూ మాస్కులు ధరించడం లేదు. ఇక సామాజిక దూరం సంగతి దేవుడెరుగు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌కి ముందు ఎలా ఉన్నారో అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
న్యూరెమ్‌బర్గ్, జర్మనీ
లాక్‌డౌన్ తర్వాత బయటికి వచ్చిన న్యూరెమ్‌బర్గ్ ప్రజలకు ఒక సినిమా సెట్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతోందట. అయితే వైరస్ ఇంకా బతికే ఉందన్న విషయం వారిని ఇబ్బంది పెడుతోందని 29 ఏళ్ల వాన్నీ హూచ్ చెప్పారు. అయినప్పటికీ జనాలు పెద్దగా జాగ్రత్తలు పాటించడం లేదు. ఇక బట్టల దుకాణాలు, కిరాణా దుకాణాల ముందు జనం బారులుతీరి నిల్చుంటున్నారు. వైరస్ మళ్లీ రెండోసారి వస్తుందన్న భయం ప్రజల్లో ఏ మాత్రం కనిపించడం లేదు.
బీజింగ్, చైనా
దాదాపు 100 రోజుల కంటే ఎక్కువ కాలం లాక్‌డౌన్‌లో గడిపిన బీజింగ్ ప్రజలు సడలింపులు దొరకగానే స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్నారు. అయితే టాక్సీ ఎక్కాలన్నా కూడా ఆరోగ్య రిపోర్టులు చూపించాల్సి వస్తుండటంతో చాలా ఇబ్బందిగా ఉందని 48 ఏళ్ల టోనీ చివూ అన్నారు. ప్రతిచోటుకి పేపర్లు పట్టుకుని పోవాల్సి వస్తుంది. ఒకర్ని ఒకరు ముట్టుకోవడానికి వీలు లేదు. వాళ్లు కేవలం నవ్వులతో పలకరించుకుంటున్నారు. కానీ మాస్క్ ఉండటంతో నవ్వు కూడా ఎవరికీ కనిపించడం లేదు. ఇక చేసేది లేక కనిపించగానే తలలు ఊపుకుంటున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా పాత రోజుల్లా అనిపించడం లేదని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
బొలోన్యా, ఇటలీ
మనుషులను ముట్టుకోకుండా, ముద్దుపెట్టుకోకుండా, కౌగిలించుకోకుండా ఉండాలంటే ఇటాలియన్లకు కొద్దిగా కష్టమే… కానీ తప్పడం లేదు. సంస్కృతిని కాదని ప్రస్తుతం వారు రెండు మీటర్ల దూరం మెయింటెయిన్ చేయాల్సి వస్తోందని 29 ఏళ్ల జియోర్జియో సాటాంజెలో అన్నారు. లాక్‌డౌన్‌లో కొద్దిగా సడలింపులు ఇచ్చినపుడే ప్రజలు ప్రతి చిన్న కారణానికి బయటికి వస్తున్నారు. ప్రపంచంలోనే బాగా ఎఫెక్ట్ అయిన దేశంగా ఇటలీ ఉన్నప్పటికీ ప్రజలు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోందని సాటాంజె అభిప్రాయపడ్డారు. మళ్లీ పూర్వ పరిస్థితులు తిరిగొచ్చే అవకాశాలు కనిపించడం లేదని, అంతేకాకుండా వైరస్ రెండోసారి దాడి చేస్తుందేమోనని ఇటలీ ప్రజలు భయపడుతున్నారు.
ఉట్రెచ్, నెదర్లాండ్స్
పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోతున్నప్పటికీ ఇక్కడ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ నమస్తే చాలా పాపులర్ అయిందని 43 ఏళ్ల సమిక్ ముఖర్జీ అంటున్నారు. కొంచెం కొత్తగా అనిపించినా ప్రజలందరూ నమస్తే చెబుతూ పలకరించుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. శానిటైజర్లు, మాస్కులు బాగానే వాడుతున్నారు. ఉద్యోగస్తులంతా ఇంకా ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. ఈ సిటీ కరోనా వైరస్ రెండో దాడికి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోన్నట్లు కనిపిస్తోంది.
ఇక మనం కూడా ఇవాళో రేపో స్వేచ్ఛను అందుకోబోతున్నాం, అయితే ఆ స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలనేది మన చేతిలోనే ఉంది. ఒకరు వద్దన్నా.. కాదన్నా కరోనా వైరస్ రెండో దాడి జరగకమానదు. కాబట్టి ఉట్రెచ్ లాగ అప్రమత్తంగా ఉండటమా లేక బార్సిలోనా వలె నిబంధనలు తుంగలో తొక్కేయడమా అనేది మీరే నిర్ణయించుకోవాలి.