సాయిరెడ్డిగూడెం.. క్వారంటైన్ మధ్య లింక్ ఏంటి..?
కరోనా నుంచి తప్పించుకోవడానికి మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. నలుగురితో కలువకూడదు. అనుమానం ఉంటే క్వారంటైన్ తప్పనిసరి. క్వారంటైన్ అనే పదాన్ని చాలా మంది నోట వింటున్నాం. కానీ, వందేళ్ల క్రితమే క్వారంటైన్ పేరిట హైదరాబాద్లో ఓ ఆసుపత్రే ఏర్పాటైంది. దీనినే ఫీవర్ హాస్పిటల్ పిలుస్తున్నారు. సామాన్యులకు ఇది కోరంటి దవాఖానాగా సుపరిచితం. ఆ కాలంలోనే అంటువ్యాధి నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ పల్లెలు క్వారంటైన్ను ఆచరించాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. దిశ, న్యూస్ బ్యూరో: శతాబ్దం క్రితం ఇక్కడి […]
కరోనా నుంచి తప్పించుకోవడానికి మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. నలుగురితో కలువకూడదు. అనుమానం ఉంటే క్వారంటైన్ తప్పనిసరి. క్వారంటైన్ అనే పదాన్ని చాలా మంది నోట వింటున్నాం. కానీ, వందేళ్ల క్రితమే క్వారంటైన్ పేరిట హైదరాబాద్లో ఓ ఆసుపత్రే ఏర్పాటైంది. దీనినే ఫీవర్ హాస్పిటల్ పిలుస్తున్నారు. సామాన్యులకు ఇది కోరంటి దవాఖానాగా సుపరిచితం. ఆ కాలంలోనే అంటువ్యాధి నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ పల్లెలు క్వారంటైన్ను ఆచరించాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
దిశ, న్యూస్ బ్యూరో: శతాబ్దం క్రితం ఇక్కడి పల్లెలు ప్లేగు వ్యాధితో వణికిపోయాయి. అనేక మంది మృత్యువాత పడ్డారు. దాంతో ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నారు. ఊరికి దూరంగా ఉంటూ సహచరులను కాపాడారు. దాదాపు అందరూ వ్యవసాయదారులే కావడంతో వాళ్ల వాళ్ల బావుల దగ్గరే క్వారంటైన్ అయ్యారు. ఎండ, వాన, చలి నుంచి కాపాడుకునేందుకు చిన్నపాటి గుడిసెలు వేసుకున్నా రు. కాలక్రమేణా అవన్నీ ఇండ్లుగా మారాయి. దాంతో జీవనమే మారిపోయింది. వ్యవసాయం, జీవనం రెండూ ఒకే చోట అయ్యాయి. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత వ్యవసాయానికి తోడునీడగా ఉండేందుకు ఇతర వృత్తులు, వ్యక్తులతో మమేకమయ్యారు. ఈ క్రమంలోనే అనేక పల్లెలు అవతరించాయి. తెలంగాణలో కొన్ని పల్లెలు ఇలా క్వారంటైన్ నుంచి పుట్టినవేనని తెలుస్తోంది. అం దుకే ఆ పల్లెలేవీ రెవెన్యూ గ్రామాలుగా లేవు. ఇప్పటికీ ఆవాస గ్రామాలుగానే కనిపిస్తున్నాయి. అలాంటి పల్లెనే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సాయిరెడ్డి గూడెం. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీకి భూములను అప్పగించిన పల్లెల్లో ఒకటి. క్వారంటైన్ ప్రక్రియతోనే ఈ పల్లె ఆవిర్భవించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
వ్యాధి వ్యాపించకుండా
ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా ఉండేందుకు ఆనాడే భౌతికదూరం పాటించారు. తోటి వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని బావుల దగ్గరే ఉండేవారు. ఏ ఇంట్లోనైనా చనిపోయిన ఎలుకలు కనిపించాయంటే చాలు, ఎక్కడ ప్లేగు వ్యాధి సోకుతుందోనని ఇల్లు వదిలేసి వెళ్లిపోయేవారు. బావుల దగ్గరే చాలా కాలం పాటు ఉన్నారు. అక్కడే నివాసమేర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయానికి నలుగురు అవసరం కావడంతో వాళ్లంతా వచ్చారు. ‘‘అందుకే మా గ్రామంలో 30-40 ఏండ్ల క్రితం వరకు కూడా అనేకం గుడిసెలే కనిపించాయని’’ సాయిరెడ్డిగూడెంవాసి ఎస్.వెంకటరామిరెడ్డి ‘దిశ’కు వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాతే శాశ్వత గృహాలను చూశామని చెప్పారు. ‘‘మా తాత, పెద్దనాన్న ఆనాటి భయానక పరిస్థితుల గురించి చెప్పేవా రు. మా తాత పేరిటే ఈ పల్లె ఏర్పడింది. మాకు ఎక్కువ భూములు ఉండడం వల్ల సహాయకంగా మిగతా వృత్తుల వారంతా పల్లెల్లో సెటిలయ్యారు’’ అని ఆయన వివరించారు. అందుకే తమ పల్లె రెవెన్యూ గ్రామం కాదని, ఇప్పటికే ముచ్చర్లకు ఆవాస గ్రామంగానే కొనసాగుతోందనీ అన్నారు. పల్లె జనాభా కూడా 2000 దాట లేదని, వందేండ్ల క్రితమే క్వారంటైన్ ను ఆచరించిన తమ పల్లె ఆదర్శవంతమైందని పేర్కొన్నా. అందుకే ఇప్పటికే నాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అప్పుడు కట్టుకున్న ఇండ్లు దర్శనమిస్తున్నాయి.
ఎలుకలు తెచ్చిన ముప్పు
ప్లేగుని మహమ్మరి, బ్లాక్‌డెత్‌గా పిలిచారు. ఇది నల్లని పెద్ద ఎలుకల వల్ల వచ్చే జునోటిక్ బాక్టీరియల్ డిసీజ్. చాలా ప్రమాదకరమైన అంటు వ్యాధి. శీఘ్ర గమనంతో క్షణాలలో సోకే ఈ వ్యాధి మానవ వినాశినిగా అందరినీ వణికించింది. వ్యాధి ఎరిసీనియా పెరిటోస్ అనే బాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది సాధారణంగా గాలి వెలుతురు సరిగా లేని వీధుల్లో, ఇళ్లల్లో ఇరుకు గృహల్లో అధిక జనాభా వున్న ప్రాంతంలో అపరిశుభ్రత వున్నచోట, ధాన్యాలు, గోడౌన్లు వున్న చోట ఎక్కుగా ప్రబలుతుంది. మురికివాడలు, పల్లెల్లోని వారు ఎక్కువగా గురవుతారు. ఎలుకలు ఆకస్మాత్తుగా చనిపోవడానికి కారణం ప్లేగు. పెస్టిస్ క్రిమి ఎలుకలలో ప్రవేశించి వాటి ప్రేగులలో వృద్ధిపొంది ప్లేగు వ్యాధిని కలగచేస్తుంది. అందుకే అనేక మంది బావుల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారానే పల్లెలు ఏర్పడ్డట్టుగా తెలుస్తోంది. ఆవాస గ్రామాలకు, రెవెన్యూ గ్రామాలకు మధ్య సంబంధాలు ఉన్నాయి. ఒకే ఇంటి పేరు కలిగిన (పాలోళ్లు) రెండు ఊర్లల్లోనూ కనిపిస్తుంటారు. వం దేండ్ల క్రితం ఏర్పడిన పల్లెల్లో ఆదర్శ జీవనం కొనసాగుతోంది.