హైదరాబాద్ అవమానించింది.. SRHకు డేవిడ్ వార్నర్ గుడ్‌బై..?

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడా? టైటిల్ సాధించి పెట్టినా తనను తీవ్రంగా అవమానించిందనే అసంతృప్తితో ఉన్నాడా? మరో సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడేందుకు విముఖత చూపిస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. వచ్చే సీజన్‌లో హైదరాబాద్ జట్టు వదిలి వేరే ఫ్రాంచైజీలో చేరాలని డేవిడ్ వార్నర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 2016లో సన్‌రైజర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. అతడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు వరుసగా […]

Update: 2021-05-07 08:52 GMT

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడా? టైటిల్ సాధించి పెట్టినా తనను తీవ్రంగా అవమానించిందనే అసంతృప్తితో ఉన్నాడా? మరో సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడేందుకు విముఖత చూపిస్తున్నాడా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. వచ్చే సీజన్‌లో హైదరాబాద్ జట్టు వదిలి వేరే ఫ్రాంచైజీలో చేరాలని డేవిడ్ వార్నర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 2016లో సన్‌రైజర్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టాడు. అతడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సన్‌రైజర్స్ జట్టు వరుసగా ప్లేఆఫ్స్ చేరుతూనే ఉన్నది. గతంలో కూడా తొలి అర్దభాగంలో కొన్ని మ్యాచ్‌లు ఓడినా తర్వాత వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ ప్లేఆఫ్స్ చేరుకున్న రికార్డు ఉన్నది.

సన్‌రైజర్స్ తరఫున రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 5వేల పరుగులు దాటిన తొలి విదేశీ ప్లేయర్ కూడా డేవిడ్ వార్నర్‌ మాత్రమే. అలాంటి మంచి రికార్డులు ఉన్న కెప్టెన్‌ను రెండు మూడు మ్యాచ్‌ల ప్రదర్శనతో కెప్టెన్సీ నుంచి దూరం చేయడాన్ని వార్నర్ అవమానంగా భావిస్తున్నాడు. కోహ్లీ వంటి ఆటగాడు ఎన్నో సీజన్లుగా ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. అయినా అతడిని కొనసాగిస్తున్నారు. గత ఏడాది చెన్నై అత్యంత పేలవ ప్రదర్శన చేసినా సీఎస్కే ఎంఎస్ ధోనీపై నమ్మకం ఉంచింది. కానీ వార్నర్‌కు అలాంటి భరోసా సన్‌రైజర్స్ ఇవ్వలేకపోయింది.

వార్నర్ కోసం ఆ మూడు టీమ్స్

ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ భారీ వేలం నిర్వహించనున్నది. ఈ సారి అన్ని ఫ్రాంచైజీలలో ఆటగాళ్లు మారిపోయే అవకాశం ఉన్నది. అయితే వేలంలో అనుభవం ఉన్న ఆటగాళ్లకే ప్రాధాన్యత దక్కుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. జట్టులో ఉన్న ఆటగాళ్లతో పాటు ఇంకా ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నదో చూసుకొని వారి స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉన్నది. దీంతో వార్నర్ తమ జట్టులో ఉంటే బాగుంటుందని ఇప్పటికే మూడు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో నిలకడైన ఓపెనర్ లేడు. ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లు ఒకటి, రెండు సార్లు రాణించినా ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు.

దీంతో వార్నర్ వంటి ఓపెనర్ ఉంటే జట్టు బలంగా మారుతుందని కేకేఆర్ భావిస్తున్నది. ఇక రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో ఓపెనింగ్ సమస్యతో సతమతం అయ్యింది. వార్నర్ ఉంటే ఆ లోటు పూడ్చగలడని అనుకుంటున్నది. ఇక ఆర్సీబీ ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసి వరుసగా విజయాలు సాధించింది. అయితే ఆ జట్టులో నెంబర్ 3 బ్యాట్స్‌మెన్ లేని లోటు కనిపిస్తున్నది. రజత్ పటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్‌లను ఆ స్థానంలో పరిశీలించినా.. వాళ్లు విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్ వస్తే జట్టు బలంగా మారుతుందని ఆర్సీబీ భావిస్తున్నది. ఈ మూడు జట్లు వార్నర్‌ కోసం పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

కొత్త జట్టు వైపు వార్నర్ మొగ్గు

వార్నర్‌ను తీసుకోవడానికి మూడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. అదే సమయంలో వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు ఏర్పాటు కానున్నాయి. అహ్మదాబాద్, పూణే లేదా లక్నో కేంద్రాలుగా ఈ ఫ్రాంచైజీలు ఉండవచ్చు. కొత్త ఫ్రాంచైజీలు కనుక మనుగడలోకి వస్తే వార్నర్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. కెప్టెన్‌గా బ్యాట్స్‌మాన్‌గా వార్నర్‌కు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అతడి కోసం పోటీ పడే అవకాశం ఉన్నది. మరోవైపు వార్నర్ కూడా కొత్త ఫ్రాంచైజీల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. కొత్త ఫ్రాంచైజీలల్లో అయితే ఒత్తిడి తక్కువగా ఉంటుందని.. ఐపీఎల్‌లో ఫ్రెష్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంటుందని డేవిడ్ భావిస్తున్నాడు. అంతే కాకుండా అక్కడైతే కెప్టెన్సీ అవకాశాలు కూడా ఉంటాయి. డేవిడ్ వార్నర్ ముందు ఇన్ని ఆప్షన్లు కనపుడుతున్న నేపథ్యంలో అతడు ఎటు వైపు మొగ్గు చూపుతాడో తెలుసుకోవాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News