పీవీ సింధుకు ఏమయ్యింది?
దిశ, స్పోర్ట్స్ : ‘అనవసరమైన తప్పిదాలు (అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్) ఎక్కువగా చేసి ఓటమిని కొని తెచ్చుకున్నాను. ప్రత్యర్థికి సులభమైన పాయింట్లు ఇవ్వడం వల్లే ఓడిపోయాను’- టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత పీవీ సింధు చేసిన వ్యాఖ్యలు ఇవి. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాది పాటు కోర్టుకు దూరంగా ఉన్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు అనుకున్న మేర రాణించలేక పోతున్నది. బ్యాంకాక్‌లో జరిగిన యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన […]
దిశ, స్పోర్ట్స్ : ‘అనవసరమైన తప్పిదాలు (అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్) ఎక్కువగా చేసి ఓటమిని కొని తెచ్చుకున్నాను. ప్రత్యర్థికి సులభమైన పాయింట్లు ఇవ్వడం వల్లే ఓడిపోయాను’- టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత పీవీ సింధు చేసిన వ్యాఖ్యలు ఇవి. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాది పాటు కోర్టుకు దూరంగా ఉన్న ప్రపంచ చాంపియన్ పీవీ సింధు అనుకున్న మేర రాణించలేక పోతున్నది. బ్యాంకాక్‌లో జరిగిన యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు.. తాజాగా టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యింది. టోక్యో ఒలంపిక్స్‌లో తప్పక పతకం సాధిస్తుందని భావిస్తున్న క్రీడాకారుల్లో పీవీ సింధు ఒకరు. గత రియో ఒలంపిక్స్‌లో సిల్వర్ గెలిచి దేశం పరువు నిలబెట్టిన సింధు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నది. కానీ పేలవమైన ప్రదర్శన, సులువైన ప్రత్యర్థులతోనే మ్యాచ్‌లను ఓడిపోవడం కలవరపెడుతున్నది.
ప్రపంచ చాంపియన్.. పడిపోయిన గ్రాఫ్
2011 కామన్వెల్త్ యూత్ గేమ్ప్ బ్యాడ్మింటన్‌లో గోల్డ్ గెలిచిన పీవీ సింధు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా పలు బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లలో విజేతగా నిలిచి స్టార్ షట్లర్‌గా ఎదిగింది. 2016 రియో ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. ఒలంపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత తన ఫామ్ కొనసాగించిన సింధు 2019లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన తొలి ఇండియన్‌గా సింధు మరో ఘనత సాధించింది. కానీ ఆ తర్వాత సింధు తన ఫామ్ కోల్పోయింది. 2019 అగస్టు తర్వాత సింధు చెప్పుకోదగిన విజయాలు సాధించలేదు. 2020 మొదట్లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సింధు.. నయోమి ఒకుహర మీద ఓడిపోయింది. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇదే ఒకుహార మీద గెలిచి స్వర్ణ పతకం సాధించిన సింధు.. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఓడిపోయింది. కాగా, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా సింధు ఇంటికే పరిమితం అయ్యింది. లాక్‌డౌన్ అనంతరం హైదరాబాద్‌లో జాతీయ బ్యాడ్మింటన్ క్యాంప్‌లో కొన్ని రోజులు పాల్గొన్నది. అనంతరం ఇంగ్లాండ్ వెళ్లిన సింధు.. అక్కడే శిక్షణ తీసుకున్నది. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికే ఇంగ్లాండ్ వెళ్లినట్లు చెప్పుకొచ్చింది.
అన్నీ ఓటములే.. అర్హత సాధించేనా?
ఇంగ్లాండ్ శిక్షణ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లిన పీవీ సింధు ఆడిన రెండు టోర్నీల్లోనూ ఓటమి పాలయ్యింది. టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ తరపున బ్యాడ్మింటన్ బెర్తులు ఇంకా ఖరారు కాలేదు. కరోనా కారణంగా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ నిలిపేసింది. తాజాగా ఏప్రిల్ 29ను అర్హత కటాఫ్ తేదీగా బీడబ్ల్యూఎఫ్ నిర్ణయించింది. అప్పటి ర్యాంకుల ఆధారంగా ఒలంపిక్స్ బెర్త్‌లు నిర్ణయిస్తామని చెప్పింది. ప్రస్తుతం పీవీ సింధు ఇలాంటి చెత్త ఫామ్ కొనసాగిస్తే ఒలంపిక్ బెర్త్ దొరకడం కూడా కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో జరిగే కీలక టోర్నీల్లో సింధు తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. కరోనా లాక్‌డౌన్, శిక్షణ, థాయ్‌లాండ్ ఓపెన్ పరాజయాలు సింధును మానసికంగా కుంగదీశాయి. ఒలంపిక్స్ అర్హతకు మరో మూడు నెలల గడువు ఉన్నది. ప్రస్తుతం 7వ ర్యాంకులో ఉన్న సింధు.. వరుస ఓటములు కొని తెచ్చుకుంటే ర్యాంకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు నెలల్లో సాధ్యమైనంత మెరుగైన ప్రదర్శన చేస్తే బెర్తు దొరకడం ఖాయమే.