భట్టికి పీసీసీ చేజారిపోవడానికి కారణాలివేనా?
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎంతో కాలంగా ఊరించి ఉసూరుమనిపించిన టీపీసీసీ అధ్యక్ష పీఠం ఎట్టకేలకు ఖరారైంది. రేవంత్ రెడ్డిని ఫైనల్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పదవిపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు చుక్కెదురైనట్లైంది. ముఖ్యంగా సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క రాష్ట్ర అధ్యక్ష పీఠంపై ఎప్పటి నుంచే ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే చీఫ్ మార్పు ఖాయమని సంకేతాలు వచ్చాయో.. అప్పటి నుంచే త్వరలో పదవి తనకే అంటూ తన సన్నిహితుల […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎంతో కాలంగా ఊరించి ఉసూరుమనిపించిన టీపీసీసీ అధ్యక్ష పీఠం ఎట్టకేలకు ఖరారైంది. రేవంత్ రెడ్డిని ఫైనల్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పదవిపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న సీనియర్లకు చుక్కెదురైనట్లైంది. ముఖ్యంగా సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క రాష్ట్ర అధ్యక్ష పీఠంపై ఎప్పటి నుంచే ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే చీఫ్ మార్పు ఖాయమని సంకేతాలు వచ్చాయో.. అప్పటి నుంచే త్వరలో పదవి తనకే అంటూ తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు ప్రచారం జరిగింది. భట్టి వర్గీయులు సైతం తమ నేతనే పీసీసీ చీఫ్‌గా ఖరారు చేయాలంటూ అధిష్టానానికి వినతులు సైతం పంపించారు. విక్రమార్క సైతం ఎలాగైనా పీఠాన్ని దక్కించుకునేందుకు మొదటి నుంచి పావులు కదుపుతూనే వచ్చారు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సహా సీనియర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఇటీవల కూడా కొన్ని రోజులు ఏకంగా దేశ రాజధానిలో బస చేయడంతో పార్టీ అధిష్టానమే ఆయనను పిలిపించిందని, రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని కేటాయించేందుకే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది.
మొదట భట్టి వైపే మొగ్గు చూపిన అధిష్టానం
పీసీసీ అధ్యక్ష పీఠం ఎవరికనేది మొదటి నుంచి సస్పెన్స్‌గానే కొనసాగుతోంది. తమ నేతకే అంటూ కొందరు సీనయర్లు సైతం ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది మధ్య తీవ్ర పోటీ ఉండడం, బహిరంగంగానే ఒకరినొకరు విమర్శలు చేసుకోవడంతో ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం భట్టి విక్రమార్క పేరును ముఖ్యంగా పరిశీలించింది. దానికి తగ్గట్టుగానే విక్రమార్క అధిష్టానం పెద్దల వద్ద తనదైన శైలిలో నమ్మకస్తుడిగా నడుచుకున్నారు. అంతేకాదు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించడం కూడా భట్టికి కలిసొస్తుందని అందరూ భావించారు. రాష్ట్ర ఇన్ చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూరు సైతం ఆయన వైపే మొగ్గు చూపారని, ఇదే విషయాన్ని అధిష్టానానికి సైతం చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో విక్రమార్కకే అధ్యక్ష పీఠం రావడానికి ఎక్కువ చాన్స్ ఉందని అందరూ అభిప్రాయపడ్డారు.
కలిసి రాని సామాజిక సమీకరణలు
పీసీసీ పదవి ఇచ్చేందుకు భట్టికి కొన్ని సమీకరణాలు కలిసొస్తాయని అందరూ భావించారు. తన నియోజకవర్గంలో గట్టి పట్టు సంపాదించడంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భట్టి అనుచరులు, అభిమానులు భారీగానే ఉన్నారు. అంతేకాదు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, సీఎల్పీ నేతగా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్‌తో పాటు సామాన్య జనాల్లో సైతం పార్టీపై సానుకూల వాతావరణం ఉంటుందని మొదట భావించారు. అంతేకాదు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఘాటుగా నిలదీయగల నేతగా ముద్రపడ్డారు. వాక్చాతుర్యం ఉన్న కాంగ్రెస్ అతికొద్ది మంది సీనియర్లలో భట్టి సైతం ముందువరుసలోనే ఉంటారు. అంతేకాదు ప్రభుత్వ విధానాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ జనాల్లోనే ఉండేవారు. ఇవన్నీ ఆయన్ను పీసీసీ అధ్యక్ష పీఠానికి దగ్గర చేస్తాయనుకున్నారు. కానీ చివరకు అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపింది.
ఈ కారణాలే దెబ్బతీశాయా?
ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోటగా ఉండేది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికారపార్టీకి సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోని ఏ జిల్లాలో కాంగ్రెస్ ఇన్ని సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. మధిర, పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం స్థానాల్లో హస్తం అభ్యర్థులు గెలిచారు. అయితే కొత్తగూడెం, పినపాక, పాలేరు, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియానాయక్‌లు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో భట్టి ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగిందనే చెప్పాలి. ఒకవేళ వీరందరినీ పార్టీ మారకుండా నిరోధించగలినట్లయితే భట్టికి ఇప్పుడు అధ్యక్ష పీఠం దక్కేదని ఆయన అనుచరులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌ను కలుపుకోలేకపోవడం, చివరకు ఆయన కనీస పోటీ ఇవ్వలేకపోవడం కూడా భట్టికి మైనస్‌గా మారింది. ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థానాలేవీ సాధించలేక పోవడం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది.
అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు
ఇక భట్టికి రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతుండడంతో ఆయనకు ఎప్పటినుంచే ప్రత్యర్థిగా ఉన్న రేణుక చౌదరి వర్గం ఎప్పటికప్పుడు అధిష్టానానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం కూడా ఒక కారణమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు గణనీయంగా పడిపోవడం, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సీట్లు తగ్గిపోవడానికి ప్రత్యర్థి వర్గమే కారణమని భట్టి అనుచరులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తే ఆయన ప్రతిష్ట పెరుగుతుందని భావించిన వారు కుట్ర పన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో సీఎల్పీ నేతగా ఉండి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పతనానికి కారణమయ్యారంటూ పార్టీ పెద్దలకు చెప్పడంతో ప్రతికూల వాతావరణ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా భట్టిని వరిస్తుందనుకున్న అధ్యక్ష పీఠం చివరకు రేవంత్ కు ఖరారు కావడంతో విక్రమార్క వర్గీయులు ఒకింత నిరాశగా ఉన్నారు.