ప్రజల ప్రాణాలను హరిస్తున్న మృత్యు.. తుపాన్లు!

తుపాన్.. ఈ పేరు వింటేనే తీరప్రాంత ప్రజల వెన్నుల్లో వణుకుపడుతుంది. రోజుల తరబడి జన జీవనాన్ని స్తంభింపజేస్తుంది.

Update: 2024-10-29 10:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : తుపాన్.. ఈ పేరు వింటేనే తీరప్రాంత ప్రజల వెన్నుల్లో వణుకుపడుతుంది. రోజుల తరబడి జన జీవనాన్ని స్తంభింపజేస్తుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా అతలాకుతలం చేస్తుంది. కూడు, గూడును దూరం చేసి కన్నీరు పెట్టిస్తుంది. మృత్యువును ఆహ్వానిస్తూ కరాళనృత్యం చేస్తుంది. ఒక్కోసారి ప్రళయాన్ని సృష్టించి ఊరూవాడను నామరూపాలు లేకుండా చేస్తుంది. గతంలో కేవలం వర్షకాలంలోనే విజృంభించే ఈ తుపానులు ప్రస్తుతం కాలంతో పని లేకుండా హఠాత్తుగా వచ్చిపడుతున్నాయి. మానవ జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరో పది రోజుల్లో శీతాకాలం ప్రారంభం అవుతున్న ఈ తరుణంలోనూ ‘దానా’ తుపాను దేశంలోని అనేక రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ముఖ్యంగా బంగాళాఖాతం తీర ప్రాంత రాష్ట్రాలు ‘దానా’ ధాటికి ఛిన్నాభిన్నం అవుతున్నాయి. సాధారణంగా మనదేశంలో నైరుతి రుతుపవనాల వల్ల వానాకాలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈ తుపానులు ఎందుకు వస్తాయి..? రుతుపవనాలను మించి వర్షాలు కురిపించి, బీభత్సమైన ఈదురు గాలులు వీచేలా చేసే ఈ తుపానులు ఏంటీ..? అవి ఎలా ఏర్పడతాయి..? ప్రతి తుపానుకు ఒక్కో పేరు ఎందుకు పెడతారు..? ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇలాంటి భారీ తుపానులు వస్తాయి వంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం.

-రాజీ కన్నా

తుపాను అంటే ఏమిటి?

తుపాను అనేది ఒక తీవ్రమైన వాతావరణ వ్యవస్థ. సముద్రంపై ఏర్పడే అల్పపీడనం వల్ల అధిక వేగంతో గాలులు వీచి, భారీ వర్షాలు కురిసే పరిస్థితిని తుపాను అంటారు. వీటిని సైక్లోన్లు అని కూడా పిలుస్తారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా తుపానులు ఏర్పడతాయి. వేడి సముద్రపు నీటి నుంచి ఆవిరైన జలతాపం పైకి లేస్తుంది. ఇలా పైకి లేచిన వేడి గాలి చల్లబడి మళ్లీ కిందికి వస్తుంది. ఇది అనేకసార్లు జరగడం వల్ల.. వేడి, చలిగాలులు చుట్టూ తిరగడం మొదలవుతుంది. ఎందుకు వృత్తాకారంలోనే తిరుగుతాయంటే భూమి భ్రమణం వల్ల అని చెప్పవచ్చు. క్రమంగా ఈ వృత్తాకార కేంద్ర భాగంలో అల్పపీడనం ఏర్పడి, దాని చుట్టూ అధిక వేగంతో గాలులు వీస్తాయి. ఈ భారీ ఆవిరి గాలులు మేఘాలుగా మారి బీభత్సమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు కారణం అవుతాయి.

తుపానులకు పేర్లు..? ఎందుకు పెడతారు?

హిందూ మహాసముద్రంలో (బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం) తుఫానులకు 2000 సంవత్సరం నుంచి ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) మార్గదర్శకాల ప్రకారం పేర్లు పెడుతున్నారు. హిందూ మహాసముద్రంలోని 13 దేశాలు (ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్) కలిసి ఈ పేర్లను సూచిస్తాయి. ముందు ఎనిమిది దేశాలు మాత్రమే ఉండేవి.. వీటికి మరికొన్ని తోడవ్వడం వల్ల వాటి సంఖ్య 13కు చేరింది. ఇందులో ప్రతి దేశం 13 పేర్లను సూచిస్తుంది. ఈ పేర్ల సంఖ్య 169. ప్రస్తుతం దానా అనే పేరును సూచించిన దేశం ఖతార్. దీనికి ముందు సెప్టెంబరులో ఏర్పడ్డ తుపాన్ "అస్న" అనే పేరును పాకిస్తాన్ సూచించింది. ఈ వరుసలో తర్వాత ఏర్పడబోయే తుపానుల ఫింజల్, శక్తి పేర్లను సౌదీ అరేబియా, శ్రీలంక సూచించాయి. ఈ 169 పేర్లు అయిపోగానే ఈ 13 దేశాలు కలిసి మళ్ళీ కొత్త లిస్టును ప్రకటిస్తాయి. ఈ పేర్లు సూచించడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయండోయ్..! అవేమిటంటే... తుఫానుల పేర్లు సులభంగా గుర్తుంచుకోగలిగేలా ఉండాలి. సాంస్కృతిక భావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. రాజకీయంగా వివాదాస్పదం కాకూడదు. పేరులో కేవలం 8 ఆంగ్ల అక్షరాలు మాత్రమే ఉండాలి.

సముద్రం.. సైక్లోన్ పేరు..

తుపానులు కేవలం హిందూ మహాసముద్రం అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో మాత్రమే కాదు.. ప్రపంచంలో అన్ని చోట్లా సంభవిస్తాయి. అయితే మనం తుఫానులు లేదా సైక్లోన్స్ అన్నట్టు ఆయా చోట్ల రకరకాల పేర్లు ఉంటాయి. ఉదాహరణకు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఈశాన్య పసిఫిక్ మహాసముద్రం ఏర్పడే సైక్లోన్స్ ను "హరికేన్" అంటారు. అలాగే వాయవ్య పసిఫిక్ మహాసముద్రం మరియు చైనా సముద్రం, జపాన్ తీరంలో "టైఫూన్" అంటారు. ఆస్ట్రేలియా తీరంలో ఏర్పడే వాటిని "విల్లీ-విల్లీస్" అని పిలుస్తారు.

తుపాన్లు ఇక్కడే ఎక్కువ..

* బంగాళాఖాతంలో మే-జూన్, అక్టోబర్-నవంబర్ మాసాల్లో ఎక్కువగా ఏర్పడతాయి. ఇవి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాలను అధికంగా ప్రభావితం చేస్తాయి.

* కరేబియన్ ప్రాంతంలో అయితే జూన్-నవంబర్ మధ్య కాలంలో హరికేన్లు ఎక్కువగా ఏర్పడగా.. ఇవి అమెరికా తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి.

* దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో జూలై-సెప్టెంబర్ మధ్య అధికంగా ఏర్పడే టైఫూన్లు.. ఫిలిప్పీన్స్, చైనా, జపాన్, తైవాన్ దేశాలను ప్రభావితం చేస్తాయి.

* అంతే కాదండోయ్.. తుపానుల వేగం తీవ్రతను బట్టి వాటిని వివిధ కేటగిరీలుగా కూడా వర్గీకరిస్తారు.

* కేటగిరీ-1: గంటకు 119-153 కి.మీ వేగం

* కేటగిరీ-2: గంటకు 154-177 కి.మీ వేగం

* కేటగిరీ-3: గంటకు 178-208 కి.మీ వేగం

* కేటగిరీ-4: గంటకు 209-251 కి.మీ వేగం

* కేటగిరీ-5: గంటకు 252 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తూ.. ఊహించని స్థాయిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. గత కొన్నిరోజుల కిందట అమెరికాలో 5వ కేటగిరీ హరికేన్లు ఏర్పడి ఊర్లకు ఊర్లు తుడిచి పెట్టుకు పోయాయి.

* ఈ తుపాన్లు తీవ్రమైన వర్షాలు, వరదలు, భారీ ఈదురు గాలులు, సముద్ర అలల ఉధృతిని కలిగిస్తాయి. వీటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం అధికంగా ఉంటుంది.

* తుపానుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు.. ఇతర రంగాలకు కూడా భారీ నష్టం కలుగుతుంది.

తుపాను.. ఆయా రంగాలపై ప్రభావం

వ్యవసాయం

- పంటలు నేలకొరగడం, నీట మునగడం

- చెట్లు పడిపోవడం, కొబ్బరి, అరటి తోటల నష్టం

- పశుగ్రాసం నష్టపోవడం

- మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడం

- వరి, వేరుశనగ వంటి పంటలకు నష్టం

మౌలిక సదుపాయాలు

- రోడ్లు, వంతెనలు దెబ్బతినడం

- విద్యుత్ సరఫరా స్తంభాలు పడిపోవడం

- టెలిఫోన్ లైన్లు తెగిపోవడం

- కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం

- రైలు మార్గాలు దెబ్బతినడం

గృహ నిర్మాణం

- ఇళ్లు కూలిపోవడం

- పైకప్పులు ఎగిరిపోవడం

- గోడలు పగిలిపోవడం

- వాణిజ్య భవనాలకు నష్టం

పరిశ్రమలు

- ఫ్యాక్టరీలు మూతపడటం

- ఉత్పత్తి స్తంభించడం

- ముడి సరుకుల రవాణా ఆగిపోవడం

- కార్మికులకు పని లేకపోవడం

పర్యాటకం

- హోటళ్లు, రిసార్టులకు నష్టం

- పర్యాటకుల రాక తగ్గడం

- బీచ్ ప్రాంతాలు దెబ్బతినడం

విద్యా రంగం

- పాఠశాలలు, కళాశాలలకు నష్టం

- చదువులు నిలిచిపోవడం

- పరీక్షలు వాయిదా పడటం

ఆరోగ్య రంగం

- అంటువ్యాధులు వ్యాప్తి

- మందుల కొరత

- వైద్య సేవలు అందకపోవడం

బ్యాంకింగ్ సెక్టార్

- ATM లు పనిచేయకపోవడం

- ఆన్‌లైన్ సేవలు నిలిచిపోవడం

- రుణాల తిరిగి చెల్లింపు ఆలస్యం

రవాణా వ్యవస్థ

- విమానాలు రద్దు

- బస్సు సేవలు నిలిచిపోవడం

- రైళ్ళు ఆగిపోవడం

- సరుకు రవాణా స్తంభించడం

చేపల పరిశ్రమ

- చేపల వేట నిషేధం

- బోట్లు, వలలు నష్టం

- మత్స్యకారుల ఆదాయం నష్టం

నష్ట నివారఖు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు

1. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ

2. తుపాన్లను తట్టుకునేలా భవనాల నిర్మాణం

3. సరైన మౌలిక సదుపాయాలు

4. బీమా పథకాలు

5. అత్యవసర సహాయక చర్యల ప్రణాళిక

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. తుపాను హెచ్చరికలను గమనించడం

2. సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం

3. ఆహార పదార్థాలు, మందులు నిల్వ చేసుకోవడం

4. రేడియో, టీవీలలో వార్తలను గమనించడం

5. అత్యవసర సంప్రదింపుల నంబర్లను దగ్గర ఉంచుకోవడం

పదేళ్లలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన భారీ తుఫానులు:

1. ఫని (2019) :

4వ కేటగిరీ తీవ్రతకు చెందిన ఈ తుపాను బంగాళాఖాతంలో ఏర్పడి, ఒడిశా తీరాన్ని తాకింది. గంటకు 200 కిమీల వేగంతో గాలులతో, కురిసిన భారీ వర్షాల ధాటికి 65 మంది మృతి చెందగా.. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమ్యాయి. వేల మంది నిరాశ్రయుల్యారు.

2. హుద్ హుద్ (2014)

బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వద్ద తీరం దాటగా.. దీని దెబ్బకు విశాఖ కోలుకోలేకుండా నష్ట పోయింది. గంటకు 185 కి.మీ వేగంతో గాలులతో, భారీ వర్షాలతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దాదాపు 124 మంది మరణించగా.. రూ. 21,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.

3. వర్దా (2016)

బంగాళాఖాతంలో ఏర్పడి.. తమిళనాడు తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురిసి, నగరం మొత్తం జలమయం అయింది. కొద్దిరోజులపాటు చెన్నై నగరం అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. వేలాది ఇళ్ళు నీట మునిగి, ప్రజలు ఆకలితో అలమటించారు.

4. తితలి (2018)

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీరం దాటిన ఈ తుపాను వలన దాదాపు77 మంది మృతి చెందారు. వేల ఎకరాల్లో పంట నష్టం జగరడంతో రైతులు భారీగా నష్టపోయారు. దాదాపు రూ.2700 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.

5. గజ (2018)

ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీరం తాకుతుందని అంచనా వేసినప్పటికీ ఇది అనూహ్యంగా తమిళనాడు వైపు దూసుకెళ్లింది. 'గజ' ప్రభావంతో దాదాపు లక్ష మంది నిరాశ్రయులు కాగా అధికారిక లెక్కల ప్రకారం 45 మంది మరణించారు. 60 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది.

6.అంఫాన్ (2020)

బంగాళాఖాతంలో ఏర్పడిన 4వ కేటగిరీకి చెందిన ఈ తుపాను.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే 120 మంది వరకు చనిపోగా.. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పదివేల కోట్ల ఆస్తి నష్టం జరగగా.. బెంగాల్ ఎదుర్కున్న అత్యంత విధ్వంసకరమైన తుపానుల్లో ఇదీ ఒకటి.

7.తౌక్టే (2021)

ఇది అరేబియా సముద్రంలో ఏర్పడి.. గుజరాత్ తీరాన్ని తాకింది. దీని ధాటికి గుజరాత్ రేవు పట్టణాలలోని అనేక నౌకలు విరిగిపోయాయి అంటే.. ఇది చేసిన విధ్వంసం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముందుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ 155 మందిని పొట్టన పెట్టుకుంది.

8. సైతల్ (2022)

బంగ్లాదేశ్, ఒడిశాల మధ్య తీరం దాటిన ఈ తుపాను వలన మత్స్యకారులు భారీగా నష్టపోయాయి. వందల సంఖ్యలో బోట్లు కొట్టుకు పోయాయి. 11 మంది మృతి చెందగా.. వేలాది మంది ఇళ్ళు కోల్పోయి, నిరాశ్రయులు అయ్యారు.

9. మిచౌంగ్ (2023)

తమిళనాడు తీరాన్ని తాకిన ఈ తుపాను వలన ఆ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసాయి. చెన్నైలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు సంభవించాయి. కేవలం ఒక్క ఈ నగరంలోనే 20 వేల మంది నిరాశ్రయులు అయ్యారు.

10. బిపర్జోయ్ (2023)

అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను వలన గుజరాత్ లోని కచ్ ప్రాంతం తీరని నష్టాన్ని చవి చూసింది. గంటకు 150 కిమీల వేగంతో గాలులు వీయగా.. భారీ వర్షాలు కురిసాయి. అయితే ఈ తుపానుకు వారం రోజుల ముందే "హంబన్" తుపానును కూడా గుజరాత్ ఎదుర్కొంది. ఈ రెండు తుపానుల వలన కచ్, పోరుబందర్ ప్రాంతాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలను చవి చూశాయి.

Tags:    

Similar News