గ్రేటర్ ఎన్నికలతో కేటీఆర్ కళ్ళు దిగొస్తాయి

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్‌కు నెత్తిమీద ఉన్న కళ్ళు కిందికి దిగొస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. దుబ్బాకలో గెలుపు తమకు స్ఫూర్తినిచ్చిందని, అదే ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా ఫలితాలు ఇస్తుందని అన్నారు. టీఆర్ఎస్‌ను ఎలా ఓడించాలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక తమకు చాలా నేర్పిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వేసే ప్రతీ ఓటు మజ్లిస్ పార్టీకి వేసినట్లేనని, మేయర్ పీఠంపై ఆ పార్టీ నేతను […]

Update: 2020-11-16 10:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత మంత్రి కేటీఆర్‌కు నెత్తిమీద ఉన్న కళ్ళు కిందికి దిగొస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. దుబ్బాకలో గెలుపు తమకు స్ఫూర్తినిచ్చిందని, అదే ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా ఫలితాలు ఇస్తుందని అన్నారు. టీఆర్ఎస్‌ను ఎలా ఓడించాలో కూడా దుబ్బాక ఉప ఎన్నిక తమకు చాలా నేర్పిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వేసే ప్రతీ ఓటు మజ్లిస్ పార్టీకి వేసినట్లేనని, మేయర్ పీఠంపై ఆ పార్టీ నేతను కూర్చోబెట్టడానికి టీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బైటకు లాగుతున్నానని, త్వరలో కేసీఆర్‌ను ఎక్కడికి పంపాలో నల్లకోటు తేలుస్తుందని అన్నారు.

హైదరాబాద్ నగరాన్ని కోల్‌కతాగా మార్చవద్దని, తెలంగాణ రాష్ట్రాన్ని పశ్చిమబెంగాల్‌గా మార్చవద్దని హైదరాబాద్ ఓటర్లకు రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయని, వరద సాయం పేరుతో పది వేల రూపాయల ప్రభుత్వ పథకాన్ని టీఆర్ఎస్ నేతలు ఓట్లను కొనుగోలు చేసే విధానంగా మార్చిందన్నారు. నిజానికి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌కు రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేకపోయినా కోట్లాది రూపాయలను డ్రా చేసి పంచిపెట్టారన్నారు. గ్రేటర్ ఎన్నికలు పూర్తయిన తర్వాత అలాంటి జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతామన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో బావ (హరీశ్‌రావు)కు బీజేపీ సత్తా ఏంటో చూపామని, గ్రేటర్ ఎన్నికల్లో బావమరిది (కేటీఆర్)కు చూపిస్తామన్నారు.

సిద్దిపేటకు సమానంగా దుబ్బాకను అభివృద్ధి చేస్తా
దుబ్బాక గెలుపు తనపై చాలా బాధ్యతలను పెట్టిందని, సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తానని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గజ్వేల్ నియోజకవర్గానికో లేక సిద్దిపేటకో లేక సిరిసిల్లకో కాదని, మొత్తం రాష్ట్రానికి అని గుర్తుచేసిన రఘునందన్‌రావు దుబ్బాక పట్ల ఎందుకు వివక్ష చూపించారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతమే ఎక్కువగా ఉంది కాబట్టే కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే వీలైనంతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇకపై ఎప్పటికీ దుబ్బాకలో గెలుపు ఉండేలా అభివృద్ధి చేస్తానన్నారు. మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితుల గురించి ప్రస్తావిస్తూ, స్వయంగా తానే కోర్టులో వాదించి బాధితులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకుంటానన్నారు. దుబ్బాక బస్టాండ్ దీనావస్థ గురించి మాట్లాడుతూ, ఇప్పటిదాకా నిధులను గోల్‌మాల్ చేసిన వ్యవహారంలోని వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయన్నారు.

Tags:    

Similar News