సంచలన ప్రకటన: 'ప్రగతి భవన్‌ను కూల్చి అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాం'
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను కూలుస్తామని, అక్కడే 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఆ పార్టీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను లక్ష నాగళ్ళతో దున్నిస్తామని, బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడలు వంచి మరీ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు. నగరంలోని ఇందిరాపార్కు దగ్గర దీక్షలో భాగంగా బండి సంజయ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను కూలుస్తామని, అక్కడే 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఆ పార్టీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను లక్ష నాగళ్ళతో దున్నిస్తామని, బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడలు వంచి మరీ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు. నగరంలోని ఇందిరాపార్కు దగ్గర దీక్షలో భాగంగా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు పేరుతో ప్రతీ పేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని కేసీఆర్ అంటున్నారు గానీ రూ. 50 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపును అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదన్నారు. ఉప ఎన్నికలో గెలవడానికి కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ ఆ స్థాయికి వెళ్లడానికి కారణం ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమేనన్నారు. దళితులపై ప్రేమ కురిపిస్తున్న ఆయన గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై కేసీఆర్‌కు చితశుద్ది లేదని, పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేసిన మూర్ఖుడు అని బండి సంజయ్ అన్నారు. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు.
పోడు రైతులు తిరగబడాలి : ఎంపీ సోయం బాపూరావు
ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో అటవీ సిబ్బంది అరాచకాలు పెరిగిపోయాయని, అడ్డుకునేవారిపై పోడు రైతులు తిరగబడాలని పిలుపునిచ్చారు. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీపై కేసీఆర్‌ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. దళితులకు 16 వేల ఎకరాలు భూములు పంచామన్న తెలంగాణ ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు పట్టాలు ఇస్తానని మాట ఇచ్చి గాలికి వదిలేశారని, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చూసి కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు.
ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న ఎన్నిక
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని, తెలంగాణ ప్రజలకు, నియంతృతత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తనను ముఖ్యమంత్రిని, మధుసూధనాచారికి బీసీ మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్ ఇప్పుడు దళితబంధు విషయంలోనూ దాన్నే రిపీట్ చేయనున్నారని అన్నారు. దళిత బంధు పథకంపై స్వయంగా కేసీఆరే తెర వెనుక ఉండి హైకోర్టులో ఒక పిటిషన్ వేయించి దాన్ని బీజేపీ మీదకు నెట్టి ఆపేయించిందని కూడా డ్రామా నడిపిస్తారని అనుమానం వ్యక్తం చేశారు.