నీళ్లపై మళ్లీ పోరాటం చేయాల్సిందే : కోదండరాం

దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్ల కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, నీళ్లు, నిధులు, నియామకాల అంశంలో టీఆర్ఎస్​ప్రభుత్వం విఫలమైందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్​విడుదల చేసిందని, ఈ సమయంలో ఇప్పుడేం చేయాలో అందరితో కలిసి ఆలోచించాలని సీఎంకు సూచించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నీళ్లు–నిజాలు అంశంపై తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆల్​పార్టీ మీటింగ్​జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జలాల […]

Update: 2021-07-19 09:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్ల కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, నీళ్లు, నిధులు, నియామకాల అంశంలో టీఆర్ఎస్​ప్రభుత్వం విఫలమైందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్​విడుదల చేసిందని, ఈ సమయంలో ఇప్పుడేం చేయాలో అందరితో కలిసి ఆలోచించాలని సీఎంకు సూచించారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నీళ్లు–నిజాలు అంశంపై తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆల్​పార్టీ మీటింగ్​జరిగింది.

ఈ సందర్భంగా కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వ తీరుపై అన్ని పార్టీలు మండిపడ్డాయి. అయితే కేంద్రం గెజిట్​ విడుదల చేసిందంటూ కేవలం కేంద్రంపైనే నిందలు వేయడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు వస్తున్నాయని బీజేపీ నేత ప్రకాష్​రెడ్డి చెప్పడంతో రిటైర్డ్​ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్​రెడ్డి వాదించారు. దీంతో కొంత సమయం వాగ్వాదం జరిగింది. అనంతరం నీళ్లు–నిజాలు అంశంపై టీజేఎస్​అధ్యక్షుడు కోదండరాం మాట్లాడారు.

స్వరాష్ట్రంలో ఇంకా అసమానతలు ఉన్నాయని, ప్రభుత్వం లక్ష్య సాధనలో వైఫల్యం చెందిందన్నారు. కృష్ణా జలాల అంశంలో సరైన ప్రణాళిక లేకుంటే చాలా నష్టపోతామని పదేపదే చెప్పామని గుర్తు చేశారు. కానీ పట్టించుకోలేదని, నీటిపారుదల శాఖను తన దగ్గరే పెట్టుకున్నాడని, దీంతో ఎవరికీ చెప్పలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు దీనిపై సానుకూలంగా చర్చించుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు నడిపిస్తున్నారని, మేఘా కృష్ణారెడ్డి మాత్రమే ప్రాజెక్టులు నిర్మిస్తారని, రెండు రాష్ట్రాల్లో ఈ నీళ్ల గొడవలకు ఆయన కూడా బాధ్యుడేనన్నారు.

ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాజెక్టులు అంటూ మలుపులు తిప్పుతున్నారని, ఎక్కడి జలాలు అక్కడే వాడుకోవాలని సూచించారు. గోదావరి నీళ్లను తీసుకువచ్చి కృష్ణాలో కలుపడం అంటే కరెక్ట్​ కాదని, ఇలా ప్రాజెక్టులు నిర్మించి కాంట్రాక్టర్లకు మేలు చేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. ముందుగా నీళ్ల కేటాయింపులు చేయాలని, వాటా మేరకు నీటిని వాడుకునే ప్లాన్​చేయాలని సూచించారు. కేంద్రం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. నీళ్ల వివాదం చల్లార్చకుంటే జల సాధన ఉద్యమాలు మళ్లీ వస్తాయని, ఉద్యమం తప్ప మరే మార్గం లేదని, దీనిపై ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీకి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ బాధ్యత లేని చర్యల వల్లే ఈ పంచాయతీ వచ్చిందని, ఇలాంటి చర్యల వల్లే కేంద్రం ముందుకొచ్చిందన్నారు. పెద్ద ప్రాజెక్టుల పేరుతో చిన్న వాటిని పట్టించుకోవడం లేదని, నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీలు తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. నీళ్ల పంచాయతీ వల్ల జరుగుతున్న నష్టం పై ఆర్టీఐ పెట్టామని, ఇద్దరు సీఎంలు కలసి శ్రీశైలం ఖాళీ చేశారని, ప్రస్తుతం కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.

రెండు రాష్ట్రాలు రెండు నదులను పంచుకున్నాయని, తెలంగాణకు గోదావరి అమ్ముకున్నారని, ఏపీకి కృష్ణ నదిని అమ్ముకున్నడని అర్థమవుతుందని కొండా విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. బోర్డుల పరిధిపై అక్టోబర్ 14 తర్వాత గెజిట్ అమలవుతుందని, ఇన్నాళ్లూ ఫామ్ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ ఇప్పుడు మేల్కొని హడావుడి చేస్తున్నడని, నీళ్ల విషయంలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. నాడు మృగశిర వరకు రంగారెడ్డికి నీళ్లు తెస్తా అన్నాడని, ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ తెచ్చిందని, కొన్ని టీడీపీ చేసిందని, కానీ టీఆర్ఎస్​చేసిందేమీ లేదని ఫైర్​అయ్యారు. స్వరాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుందను కోలేదన్నారు. నీళ్లపై ఆంధ్ర సీఎంకు అవగాహన ఉంది కానీ కేసీఆర్‌కు లేదని, మన ముఖ్యమంత్రి మనకు నష్టం చేస్తున్నాడని విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల కేటాయింపుల్లో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పిన కేసీఆర్​ ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ప్రశ్నించారు. కేసీఆర్​కు స్వీయ రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్​ఒక ఇంజినీర్​గా మారి అన్యాయం చేస్తున్నాడని, జగన్‌కు కృష్ణా, తనకు గోదావరి అని ఇరు రాష్ట్రాల సీఎంలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. జగన్​ కృష్ణా జలాలను దొంగిలిస్తుంటే కేసీఆర్​ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్​మౌనంగా ఉండటంతోనే కేంద్రం గెజిట్​ విడుదల చేసిందని, రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శ్రవణ్​ పేర్కొన్నారు.

Tags:    

Similar News