ప్రగతి భవన్ నుంచి వార్నింగ్స్.. 41 మంది ఎమ్మెల్యేలకు వేటు తప్పదా.?

దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 41 మంది ఎమ్మెల్యేలకు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ‘ చిక్కరు.. దొరకరు’ అన్నట్టుగా జనాలకు దూరంగా ఉండటం వారిపై వ్యతిరేకతను పెంచింది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు సంకేతాలు కూడా వెళ్లినట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిరి పరిస్థితి ఇప్పుడు లేకపోవడం, సెగ్మెంట్లలో ప్రత్యామ్నాయ నాయకులు ఎదగటం నేపథ్యంలో సిట్టింగులకు గండం పొంచి ఉన్నది. […]

Update: 2021-12-10 23:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 41 మంది ఎమ్మెల్యేలకు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ‘ చిక్కరు.. దొరకరు’ అన్నట్టుగా జనాలకు దూరంగా ఉండటం వారిపై వ్యతిరేకతను పెంచింది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలకు సంకేతాలు కూడా వెళ్లినట్టు అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాదిరి పరిస్థితి ఇప్పుడు లేకపోవడం, సెగ్మెంట్లలో ప్రత్యామ్నాయ నాయకులు ఎదగటం నేపథ్యంలో సిట్టింగులకు గండం పొంచి ఉన్నది. వీరికి అధికార పార్టీ టికెట్​ఇవ్వకపోతే.. రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే వివరాలను సైతం అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే కొంతమంది అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌లు ముందస్తుగానే మార్పులను ఊహించి ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తున్నారు.

ముందస్తుగానే మొదలు..

ఇటీవల వరుసగా ఎదురవుతున్న రాజకీయ ఎదురుదెబ్బలతో గులాబీ బాస్ ఇప్పటి నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు. దీని కోసం కొత్త కొత్త సర్వే బృందాలను రంగంలోకి దింపారు. అటు ప్రభుత్వ నిఘా వర్గాలు ఓవైపు.. బెంగళూరు, నాగపూర్, యూపీ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ప్రైవేట్​సర్వే టీములు మరోవైపు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుందనే అంశాలపై దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాల అంశాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యేల తీరుపైనే ఈ సర్వే చేయించడం విశేషం.

కేసీఆర్​ చరిష్మా.. నో గ్యారంటీ

2018 అసెంబ్లీ ఎన్నికలు కేవలం కేసీఆర్​చరిష్మాతోనే జరిగాయి. ప్రతిపక్షాలన్నీ మహా కూటమిగా ఒకవైపు.. సీఎం కేసీఆర్ మరోవైపు అన్నట్టుగా ఎన్నికల్లోకి వెళ్లారు. అప్పటి పరిస్థితులు గులాబీ దళానికి అనుకూలించాయి. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని సైతం తమవైపు తిప్పుకొన్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఈసారి కూడా కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్, సంక్షేమ పథకాలు కలిసి రావడం లేదు. దీనికితోడుగా ఎమ్మెల్యేల వ్యవహారశైలి ప్రతిబంధకంగానే మారుతున్నది. ఈ క్రమంలో సిట్టింగ్​ఎమ్మెల్యేలందరికీ టికెట్​ఇచ్చేందుకు కేసీఆర్ వెనకాడుతున్నట్టు సమాచారం. ఈ విషయం ఇప్పటికే బహిర్గతమవడంతో.. అనుమానాలున్న సెగ్మెంట్‌ల నుంచి కొత్త నేతలు ప్రగతిభవన్​వైపు చూస్తున్నారు.

ప్రస్తుతం వెనకంజలో 41 మంది

రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఎమ్మెల్యేలు ప్రజాభిమానం చూరగొనడంలో వెనుకబడినట్టు సర్వేలు చెబుతున్నాయి. గ్రేటర్ ఫలితాల నుంచి శాసనమండలి ఎన్నికల వరకు ఎమ్మెల్యే కోటా, స్థానిక కోటా టికెట్ల పంపిణీని విశ్లేషించుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్స్‌లకే చాన్స్ ఇచ్చినా.. కార్పొరేటర్లు చాలా చోట్ల ఓడిపోయారు. అభ్యర్థులను మార్చిన డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు గులాబీ బాస్​చేసుకుంటున్న సర్వేల్లో చాలా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తేలింది. ఇది పార్టీలో కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ పదుల సంఖ్యలో సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.

మీరు మారరా..?

ఇప్పుడు ప్రగతిభవన్ నుంచే కొంతమంది ఎమ్మెల్యేలకు సంకేతాలు కూడా ఇస్తున్నట్లు సమాచారం. “ మీ నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఉంది.. ఎందుకు ఆ పనులు.. అవన్నీ పక్కకు పెట్టరాదు.. వచ్చేదంతా ఎన్నికల కాలం.. జాగ్రత్తగా ఉంటేనే మళ్లీ టికెట్.. ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది..” అంటూ ఏవైనా పనుల కోసం ప్రగతిభవన్​ వర్గాలను అడుగుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారా.. లేదా అనేది ముందుగానే కొంతమేరకు సమాచారం ఇస్తున్నారని పార్టీ నేతంటున్నారు. ఇలా 41 నియోజకవర్గాల్లో ఈసారి అధికార పార్టీ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతుందని ప్రచారం జరుగుతున్నది. ఈ నియోజకవర్గాల్లో సెకండ్​ కేడర్ మాత్రం కొంత ఉత్సాహంగా ఉన్నది. తమ ఎమ్మెల్యే ఆ జాబితాలో ఉంటారా.. తమకేమైనా అవకాశం వస్తుందా అనే ఆశ ఇప్పుడు సెకండ్ కేడర్‌లో నెలకొంది.

అందుకే.. పక్క చూపులు

ఇక అధికార పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ, కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉంటున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్​ నడుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరాదనుకుంటున్న నేతలకు ఇప్పటి నుంచే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో, వారు ముందస్తుగానే అలర్ట్ అవుతున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేయొచ్చనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మేరకు పక్కచూపులు చూస్తున్నారు. వ్యతిరేకతను మూటగట్టుకున్న నేతలను ఇతర పార్టీల్లోకి పంపించి, కొత్తవారిని బరికి దింపి గెలిపించుకోవచ్చని, సిట్టింగ్‌లను బయటకు పంపితే ఎంతో కొంత ఓట్లు చీల్చితే తమకే కలిసి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతున్నది.

Tags:    

Similar News