కరోనాపై బ్రహ్మాస్త్రం.. ఉష్ణ టీకా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు ఇప్పుడు మొత్తం ప్రపంచమే వణికిపోతున్నది. తొలి రెండు కరోనా వేవ్‌లు ప్రపంచాన్ని అతాలకుతలం చేశాయి. మూడో దశ పొంచి ఉందంటూ వస్తున్న వార్తలు, అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నది. వివిధ దేశాల్లో వినియోగిస్తున్న టీకాల సామర్థ్యంపైన అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కొత్త వ్యాక్సిన్‌లపై పరిశోధనలు ఉధృతంగా జరుగుతున్నాయి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఎంతవరకు పనిచేస్తాయోననే అనుమానాలు వినిపిస్తున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు ఇప్పుడు మొత్తం ప్రపంచమే వణికిపోతున్నది. తొలి రెండు కరోనా వేవ్‌లు ప్రపంచాన్ని అతాలకుతలం చేశాయి. మూడో దశ పొంచి ఉందంటూ వస్తున్న వార్తలు, అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నది. వివిధ దేశాల్లో వినియోగిస్తున్న టీకాల సామర్థ్యంపైన అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కొత్త వ్యాక్సిన్‌లపై పరిశోధనలు ఉధృతంగా జరుగుతున్నాయి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఎంతవరకు పనిచేస్తాయోననే అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో అన్ని రకాల కరోనా వేరియంట్లకు కళ్ళెం వేసే ఓ అస్త్రం అందుబాటులోకి రాబోతున్నది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చినట్లు తాజా నివేదికల ద్వారా వ్యక్తమవుతున్నది. ఇప్పుడు వినియోగిస్తున్న వ్యాక్సిన్లు శీతల నిల్వకేంద్రాల్లో (కోల్డ్ స్టోరేజ్) భద్రపరచాల్సి వస్తున్నది. కానీ ఇకపైన ఆ అవసరం లేని ఉష్ణ (వార్మ్) టీకాలను సాకారం చేసే దిశగా భారత్-ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వినూత్న పరిశోధనల్లో ముందడుగు వేశారు. అన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లపైనా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఎలుకలపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడైంది.
బెంగుళూరు కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మైన్‌వ్యాక్స్ బయోటెక్ అనే సంస్థలు సంయుక్తంగా చేసిన పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ సానుకూల ఫలితాలను ఇచ్చినట్లు ఆ టీమ్‌లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ రాఘవన్ వరదరాజన్ ఒక మెడికల్ జర్నల్‌లో వ్యాఖ్యానించారు. దీని సామర్థ్యంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆధ్వర్యంలోని కామెన్‌వెల్త్ శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్‌వో (CSIRO) కూడా మందింపు జరిపింది. అన్ని రకాల వేరియెంట్లపై పరీక్షించి చూసింది. ఈ టీకాలు ఎలుకల్లో బలమైన రోగనిరోధక స్పందనలను కలిగించినట్లు తేలింది. భారత్‌లోని సగటు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా ఈ టీకాలు నెల రోజుల పాటు చెక్కు చెదరకుండా ఉంచే వీలుందని ఆ పరిశోధనలో తేలింది. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద 90 నిమిషాల వరకు ఆ టీకాలు దెబ్బతినకుండా ఉన్నట్లు తేలింది.
కరోనాలోని అల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను సమర్థంగా అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పన్నమవుతున్నట్లుగా వెల్లడైందని సీఎస్ఐఆర్‌వోలోని కొవిడ్19 ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ తెలిపారు. ఐఐఎస్‌సీ-మైన్‌వ్యాక్స్ సంయుక్తంగా రూపొందించిన టీకా ఫార్ములేషన్స్‌ను జంతువులపై పరీక్షించామని, వీటిలో మానవ ప్రయోగాలకు అనువైన వ్యాక్సిన్‌ను గుర్తించడానికి దోహదపడిందని చెప్పారు. భారత్‌లో త్వరలో క్లినికల్ ప్రయోగాలు జరుగుతాయని వెల్లడించారు.
ప్రస్తుత కొవిడ్ వ్యాక్సిన్లను కనిష్ట ఉష్ణోగ్రతల్లో భద్రపరచడం తప్పనిసరిగా మారింది. ఆస్ట్రాజనికా టీకాను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయాలి. ఫైజర్ వ్యాక్సిన్‌కు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ మోతాదులో నిల్వ చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ యంత్రాలనే వాడాల్సి వస్తున్నది. కానీ ఐఐఎస్‌సీ-మైన్‌వ్యాక్స్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను మాత్రం ఎలాంటి కోల్డ్ స్టోరేజీ అవసరం లేని సాధారణ ఉష్ణోగ్రత దగ్గర కూడా నిల్వ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో కోల్డ్ స్టోరేజీ సమస్యాత్మకంగా మారడంతో ఇప్పుడు కొత్తగా ఉనికిలోకి రానున్న వ్యాక్సిన్ అలాంటి ఆంక్షలను అధిగమించడానికి ఆస్కారం కలుగుతున్నది.