ఖాకీలు.. సదా వారి సేవలో!

దిశ, వరంగల్: ఎవర్ విక్టోరియస్‌గా పేరొందిన వరంగల్ పోలీసులు ప్రస్తుతం అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో పోస్టింగ్ దక్కించుకున్న అధికారులు వారు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనీ, వారు నియోజకవర్గానికి వచ్చారంటే చాలు వెంటే తిరుగుతూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సదరు ప్రజా ప్రతినిధులు రెండు లేదా మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉన్నారంటే ప్రజా సమస్యలు గాలికొదిలేస్తున్నారనీ, ఆ అధికారి ఎప్పుడు పోలీస్ స్టేషన్‌కు […]

Update: 2020-03-19 00:36 GMT

దిశ, వరంగల్: ఎవర్ విక్టోరియస్‌గా పేరొందిన వరంగల్ పోలీసులు ప్రస్తుతం అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖలతో పోస్టింగ్ దక్కించుకున్న అధికారులు వారు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనీ, వారు నియోజకవర్గానికి వచ్చారంటే చాలు వెంటే తిరుగుతూ స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సదరు ప్రజా ప్రతినిధులు రెండు లేదా మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉన్నారంటే ప్రజా సమస్యలు గాలికొదిలేస్తున్నారనీ, ఆ అధికారి ఎప్పుడు పోలీస్ స్టేషన్‌కు వస్తాడో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. తమ బాధలు చెప్పుకునేందుకు స్టేషన్‌కు వచ్చే బాధితులు గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఒకవేళ వేచి ఉన్నా అప్పటికీ ఠాణాకు వస్తాడనే గ్యారంటీ ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు సగం నౌకరీ ప్రజా ప్రతినిధుల బందోబస్తు సేవలకే పరిమతమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పైసలు కొట్టు.. పోస్టింగ్ పట్టు..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పోలీసుల పోస్టింగ్ కేటాయింపులు, బదిలీల విషయంలో ఉన్నతాధికారులు పారదర్శకత పాటించేవారు. అధికారుల శక్తి సామర్థ్యాలను బట్టి పోస్టింగ్‌లు కేటాయించేవారు. కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ పోస్టింగ్‌ల కేటాయింపులో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లేఖల ఆధారంగా అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చే విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఎమ్మెల్యేలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పోస్టింగ్ బట్టి అధికారిని రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము ఆశించిన చోట పోస్టింగ్ దక్కించుకున్న అధికారులు ఊరికే ఉండరు కదా..? తాము పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా డ్యూటీలు వెలగబెడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు శాంతి భద్రతలు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. వివిధ కేసుల పరిష్కారం నిమిత్తం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారిని పట్టించుకోవడం లేదని సమాచారం. అధికార పార్టీకి చెందిన చిన్నా చితకా నాయకుల సిఫార్సు మేరకు పిటిషన్ల స్వీకరణ, కేసుల నమోదు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సగానికి పైగా కేసులు ప్రజా ప్రతినిధులే డీల్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో చాలా మంది బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అక్రమాల జాతర..?

వరంగల్‌లో సగానికి పైగా పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్ అడ్డాలుగా మారాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాన పట్టణాల్లోని ఠాణాల పోస్టింగ్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పోస్టింగ్‌లు కొనుగోలు చేస్తున్న అధికారులు వైన్ షాపులు, బార్లు, ఇసుక వ్యాపారులు, పీడీఎస్ బియ్యం మాఫియా నుంచి నెలవారీ మామూళ్ల నుంచి మొదలుకుని ఇతర రాబడి మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా అన్ని పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పేరిట వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా వసూలు చేసిన డబ్బులతో నాసీరకం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మిగతా డబ్బులు వెనకేసుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో సగానికి పైగా పనిచేయకపోవడమే ఇందుకు ఉదహరణగా నిలుస్తోంది. అంతేగాకుండా భూ దందాలు, ప్రైవేట్ పంచాయితీల్లో కలగజేసుకుని పెద్ద మొత్తంలో సంపాదించడమే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Tags: warangal police, political leaders, quid pro quo deal

Tags:    

Similar News