కేసీఆర్‌కు సూటి ప్రశ్న.. ఆధారాలతో నిలదీత

దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్.. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. కానీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నివాసాల్లోనే నీరు నిలవడంతో సీఎం ఇచ్చిన హామీలు అమలు చేస్తే తమకీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని స్థానికులు వాపోతున్నారు. 2015లో సీఎం హామీల జల్లు సీఎం బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 2015 జనవరిలో వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. నాలుగు […]

Update: 2020-08-21 21:08 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్.. హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. కానీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నివాసాల్లోనే నీరు నిలవడంతో సీఎం ఇచ్చిన హామీలు అమలు చేస్తే తమకీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని స్థానికులు వాపోతున్నారు.

2015లో సీఎం హామీల జల్లు

సీఎం బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 2015 జనవరిలో వరంగల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. నాలుగు రోజులు నగరంలోనే ఉన్న ఆయన మురికివాడలు, కాలనీలు పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఓరుగల్లుకు వరాల జల్లు కురిపించారు. నాలుగేళ్లు గడిచే సరికి వరంగల్ అద్దం తునక కావాలని వ్యాఖ్యానించారు. మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామన్నారు. అంబేడ్కర్ నగర్‌లో 430, లక్ష్మీపురంలో 429, దీన్ దయాల్ నగర్‌లో 500, గిరిప్రసాద్ నగర్‌లో 400, ఎస్‌ఆర్ నగర్‌లో 1000, గరీబ్ నగర్ లో 617, ప్రగతి నగర్‌లో 280, గాంధీనగర్‌లో 300 కలుపుకుని మొత్తం 3,957 ఇండ్లు కట్టిస్తామన్నారు. ఈ ఇండ్ల నిర్మాణానికి రూ. 400 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం ఐదు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు తనకు దావత్ ఇవ్వాలని కూడా చెప్పారు. రెండు మూడేళ్లలో ఇళ్లు లేని పేదవాళ్లు ఉండొద్దని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వరంగల్ నగర అభివృద్ధికి ఏటా రూ. 300 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కానీ ఐదేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేరలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్రమణలు తొలగిస్తారా?

భారీ వరదల కారణంగా వరంగల్‌లోని అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామని ఇటీవల నాయకులు పదే పదే చెప్తున్నారు. కానీ ఇది వందశాతం అమలు చేస్తారా అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా నగరంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి బిల్డింగ్‌ల నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే అక్రమార్కుల వెనక అధికార పార్టీకి చెందిన నేతలే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా ఎప్పుడో తాతల కాలం నాటి మాస్లర్ ప్లాన్ ను అమలు చేస్తున్న వైఖరిని నగర ప్రజలు తప్పుపడుతున్నారు. రెండేళ్ల కాలంగా కొత్త మాస్టర్ ప్లాన్ విడుదలను వాయిదా వేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరద నీటిలోనే కాలనీలు

ఇటీవల కురిసిన వరుస వానలకు వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని కాలనీలు ఇప్పటికీ వరదల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటించారు. తక్షణ సాయంగా రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం మంత్రి వైఖరిపై మండిపడుతున్నాయి. పర్యటనకు ముందు రోజు స్థానిక నాయకులు అర్ధరాత్రి బాధితులకు డబ్బులు, ఇతరత్రా సామగ్రి పంపిణీ చేసి రాజీ కుదుర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే మంత్రి ఎదుట ఎవరూ నోరు మెదపలేదని, నామమాత్రంగా తమకు సాయం చేయాలని చెప్పుకున్నారని పేర్కొంటున్నారు.

Tags:    

Similar News