భయం.. భయం.. ములుగు అడవుల్లో మరో పెద్దపులి..!

దిశ‌, ములుగు: పేరులోనే గొప్పత‌నాన్ని క‌లిగి ఉండే పెద్దపులి అంటే ఇష్టపడ‌ని వారుండ‌రు. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులులంటే అంద‌రికీ ఆస‌క్తి. పెద్దపులులు అంత‌రించే జాతిలో ఉండ‌గా, అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా వీటి సంఖ్య పెరుగుతున్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. గ‌డిచిన కొద్దిరోజులుగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో వీటి సంచారం పెర‌గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శనం. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అభ‌యార‌ణ్యంలో పెద్దపులి సంచ‌రిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. […]

Update: 2021-11-08 22:44 GMT

దిశ‌, ములుగు: పేరులోనే గొప్పత‌నాన్ని క‌లిగి ఉండే పెద్దపులి అంటే ఇష్టపడ‌ని వారుండ‌రు. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులులంటే అంద‌రికీ ఆస‌క్తి. పెద్దపులులు అంత‌రించే జాతిలో ఉండ‌గా, అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా వీటి సంఖ్య పెరుగుతున్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. గ‌డిచిన కొద్దిరోజులుగా ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో వీటి సంచారం పెర‌గ‌డ‌మే ఇందుకు నిద‌ర్శనం.

తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అభ‌యార‌ణ్యంలో పెద్దపులి సంచ‌రిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. తాడ్వాయి మండ‌లం కామారం అర‌ణ్యంలో మేత‌కు వెళ్లిన మేక‌ల గుంపుపై పెద్దపులి దాడికి య‌త్నించింది. అయితే కాపారులంతా ఒక్కచోట చేరి అర‌వ‌డంతో పారిపోయిన‌ట్లుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. స‌మాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంట‌నే పులి సంచరించిన ప్రాంతానికి చేర‌కుని పాద‌ముద్రలను సేక‌రించారు. పెద్దపులి పాద‌ముద్రలుగానే అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పెద్దపులి ఆచూకీ కోసం అటవీ అధికారులు, సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఇప్పటికైనా ర‌క్షణ ఏర్పాట్ల చేసేనా..?

కొద్దిరోజుల క్రితం వేట‌గాళ్ల ఉచ్చుకు ఓ పెద్దపులి బ‌లైన విష‌యం తెలిసిందే. అడవిలో పెద్దపులి సంచ‌రిస్తున్నట్లుగా అధికారులకు క‌నీస స‌మాచారం లేక‌పోవ‌డంతోనే వేట‌గాళ్ల ఉచ్చులో చిక్కుకుని మ‌ర‌ణించిన‌ట్లుగా ఆ శాఖ ఉద్యోగుల మ‌ధ్యే చ‌ర్చ జ‌రిగింది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి కూడా జిల్లా అట‌వీ అధికారుల‌కు గ‌ట్టిగానే మంద‌లింపులు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రోసారి పెద్దపులి సంచరించిన‌ట్లుగా స్పష్టమైన ఆన‌వాళ్లు, ఆధారాలు ల‌భించ‌డంతో ర‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని జంతు ప్రేమికులు కోరుతున్నారు. పులి సంచ‌రించే ప్రాంతాల‌ను గుర్తించాల‌ని, హాని క‌లిగించ‌కుండా వేట‌గాళ్ల నుంచి ర‌క్షించాల‌ని సూచిస్తున్నారు.

ఏజెన్సీలో భ‌యం.. భ‌యం..

ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం అడ‌వుల్లో పులి సంచ‌రిస్తున్నట్లుగా అట‌వీ అధికారులు అనుమానిస్తున్నారు. ములుగు మండ‌లంలోని పెగడపెల్లి, లాలయిగూడెం, జగ్గన్నగూడెం, అంకన్నగూడేం గ్రామల్లో పెద్దపులి సంచ‌రిస్తున్నట్లుగా ఆయా గ్రామ‌స్తులు అటవీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం కూడా అడవికి మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి రాకపోవడంతో పశువుల యజమాని గ్రామస్తులతో అడవిలో పరిశీలించగా ఆవుపై పులి దాడి చేసినట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పెగడపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరి రైతుల పశువులు కూడా అడవికి వెళ్లి మూడు రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో వీటిపై కూడా పులి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పులి సంచార సమాచారంతో ఏజెన్సీ గ్రామస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు.

Tags:    

Similar News