అలా చేస్తే మూగబోతుంది.. మూతపడుతుంది !
మార్చి 17లోపు టెలికాం సంస్థలన్నీ ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ రూ. 10,000 కోట్లు చెల్లించగా, ఇంకా రూ. 25,585 కోట్లు చెల్లించాల్సి ఉంది. టాటా గ్రూప్ రూ. 2,197 కోట్లను చెల్లించింది. మరో రూ. 13,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, గడిచిన పదేళ్ల కాలంలో వొడాఫోన్ ఐడియా రూ. 2 లక్షల కోట్ల నష్టాల్లో ఉందని, రాత్రికి రాత్రి బకాయిలను చెల్లించలేమని అలా చేస్తే సంస్థ […]
మార్చి 17లోపు టెలికాం సంస్థలన్నీ ఏజీఆర్ బకాయిలను పూర్తిగా చెల్లించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ రూ. 10,000 కోట్లు చెల్లించగా, ఇంకా రూ. 25,585 కోట్లు చెల్లించాల్సి ఉంది. టాటా గ్రూప్ రూ. 2,197 కోట్లను చెల్లించింది. మరో రూ. 13,800 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అయితే, గడిచిన పదేళ్ల కాలంలో వొడాఫోన్ ఐడియా రూ. 2 లక్షల కోట్ల నష్టాల్లో ఉందని, రాత్రికి రాత్రి బకాయిలను చెల్లించలేమని అలా చేస్తే సంస్థ మూతపడే అవకాశముందని వొడాఫోన్ తరపు న్యాయవాది ముకుల్ రోహాత్గీ తెలిపారు. ఒకవేళ సంస్థ మూతపడే పరిస్థితి వస్తే 10,000 మంది వరకూ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని, సుమారు 30 కోట్ల మంది వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. ఈ పరిణామాలతో టెలికాం రంగంలో కేవలం రెండు సంస్థలదే ఆధిపత్యం అవుతుందని ఆయన వెల్లడించారు.
వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ. 7000 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. దానికి పెనాల్టీ, పెనాల్టీపై వడ్డీ ఇలా అన్నీ కలుపుకుని రూ. 25,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే రూ. 2,150 కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో టెలికాం రంగాలు సంక్షోభంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిలను ఇప్పటికిప్పుడు చెల్లించడానికి టెలికాం సంస్థలకు వీలవదని ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు.