రూట్ మార్చిన వొడాఫోన్ ఐడియా.. వాటిని తగ్గించేందుకే..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే పనిలో పడింది. దీనికోసం రానున్న రోజుల్లో సంస్థ మూలధన వ్యయాన్ని 2 బిలియన్ డాలర్లు అంటే రూ. 15,000 కోట్లకు పెంచాలని యోచిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ.3,800 కోట్ల మూలధన వ్యయాన్ని కలిగి ఉంది. నిధుల సమీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూనే కంపెనీ ప్రమోటర్లు అయిన ఆదిత్య బిర్లా గ్రూప్(ఏబీజీ), యూకేకు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే పనిలో పడింది. దీనికోసం రానున్న రోజుల్లో సంస్థ మూలధన వ్యయాన్ని 2 బిలియన్ డాలర్లు అంటే రూ. 15,000 కోట్లకు పెంచాలని యోచిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ.3,800 కోట్ల మూలధన వ్యయాన్ని కలిగి ఉంది. నిధుల సమీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూనే కంపెనీ ప్రమోటర్లు అయిన ఆదిత్య బిర్లా గ్రూప్(ఏబీజీ), యూకేకు చెందిన వొడాఫోన్ పీఎల్‌సీలు మరింత ఈక్విటీని ఉంచే అవకాశం ఉందని తాజాగా కంపెనీ అంతర్గత పెట్టుబడిదారుల సమావేశంలో యాజమాన్యం స్పష్టం చేసినట్లు ఓ అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.
నిధుల సమీకరణను 2022 మార్చి నాటికి పూర్తి చేయనున్నామని, అదే సమయంలో ప్రమోటర్లు మూలధన వ్యయాన్ని అందించవచ్చని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ ముంద్రా అన్నారు. నిధుల సమీకరణ ఆధారంగా కంపెనీ యాజమాన్యం తమ మూలధన వ్యయాన్ని రూ. 15 వేల కోట్లకు పెంచనుంది. దీని ద్వారా 4జీ నెట్‌వర్క్ సేవలను మరింత పెంచే వీలుంటుంది. ఈ రంగంలో ఉన్న దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు సైతం ఏడాదికి దాదాపు రూ. 15 వేల కోట్ల మూలధన వ్యయాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇటీవల టెలికాం రంగానికి ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీ ఇవ్వడం మూలంగానే మూలధనం మొత్తాన్ని పెంచేందుకు ఏబీజీ చైర్మన్ కుమార మంగళం బిర్లా నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం మద్దతుకు ముందు ఏబీజీతో పాటు వొడాఫోన్ పీఎల్‌సీలు రెండూ ఈక్విటీని పెంచేందుకు నిరాకరించాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి వొడాఫోన్ ఐడియా వద్ద రూ. 250 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.