‘డి-విటమిన్’తో ఉపయోగాలెన్నో తెలుసా ?

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యరశ్మి తాకితే శరీరంలో విటమిన్ ‘డి’ ఉత్పత్తవుతుందని, ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఉపయోగపడుతుందని తెలిసిన విషయమే. అయితే కరోనా కలకలం మొదలైన నాటి నుంచి విటమిన్ ‘డి’, విటమిన్ ‘సి’ పై చర్చ ఎక్కువగానే జరుగుతోంది. కాగా, కరోనాను ఎదుర్కొనేందుకు విటమిన్ ‘డి’ ఉపయోగపడుతుందా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేం కానీ.. కొంతవరకు నయమే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో విటమిన్ ‘డి’ ఉపయోగాలేంటో తెలుసుకుందాం. మారిన ఉద్యోగ […]

Update: 2020-05-27 02:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యరశ్మి తాకితే శరీరంలో విటమిన్ ‘డి’ ఉత్పత్తవుతుందని, ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఉపయోగపడుతుందని తెలిసిన విషయమే. అయితే కరోనా కలకలం మొదలైన నాటి నుంచి విటమిన్ ‘డి’, విటమిన్ ‘సి’ పై చర్చ ఎక్కువగానే జరుగుతోంది. కాగా, కరోనాను ఎదుర్కొనేందుకు విటమిన్ ‘డి’ ఉపయోగపడుతుందా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేం కానీ.. కొంతవరకు నయమే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో విటమిన్ ‘డి’ ఉపయోగాలేంటో తెలుసుకుందాం.

మారిన ఉద్యోగ వేళలు, నైట్ షిప్ట్‌లు, లేట్ నైట్ దాకా నెట్టింట్లోనే గడపడం వంటివి ఉదయాన్నే నిద్ర లేచే అలవాటుకు దూరం చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉదయాన్నే లభించే సూర్యరశ్మికి దూరమవడంతో శరీరానికి సరిపోయేంత ‘డి’ విటమిన్ అందడం లేదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరానికి అవసరమైన ‘డి’ విటమిన్‌లో 96 శాతం సూర్యరశ్మి ద్వారానే లభిస్తుండగా.. సాల్మన్‌, ట్యూనా ఫిష్‌, ఫోర్టిఫైడ్‌ మిల్క్‌ ద్వారా కూడా కొంతమేర లభిస్తుంది. ఎండ తీవ్రతను బట్టి.. వారానికి రెండుసార్లయినా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో కనీసం 5 నుంచి 30 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి అందేలా చూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎంత మేర అవసరం

ప్రతి వ్యక్తికి రోజుకు 1000-2000 యూనిట్స్‌ “విటమిన్‌-డి” అవసరమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇందుకు కొంతసేపు ఎండలో ఉంటే సరిపోతుంది. ఎండ వల్ల.. శరీరంలో ఉత్తేజాన్ని పెంచే ‘సెరోటోనిన్’ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. చర్మానికి హాని లేకుండా ఎంత మోతాదులో సూర్యరశ్మి పొందాలనేది కచ్చితంగా చెప్పలేం కానీ, ఒక్కో వ్యక్తికి ఒక్కో మోతాదు సూర్యరశ్మి అవసరమవుతుంది. నల్లని చర్మానికి ఎండను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. వారు ఎండలో ఎక్కువ సేపు ఉండగలరు. ‘విటమిన్‌-డి’ అందుతుంది కదా అని .. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని తాకితే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ కిరణాలు మరీ ఎక్కువగా తాకితే చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

పిల్లల్లో అధికం

ఇప్పుడు చాలా మందిలో విటమిన్‌-డి లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ లోపం ఎక్కువ. బయటకెళ్ళి ఆడుకోవడం తగ్గిపోయాక ఈ సమస్య మరింత పెరిగింది. పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లో, తరగతి గదుల్లోనే ఉండటంతో ఎండ తగలక వారిలో డి- విటమిన్‌ లోపిస్తోంది. కాబట్టి పిల్లల్ని ఉదయం, సాయంత్ర వేళల్లో ఆటలు ఆడేలా చూడాలి. దీనివల్ల పిల్లల్లో ‘విటమిన్‌-డి’ సమస్య రాకుండా అధిగమించవచ్చు. గృహిణులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మన దేశంలో 85 శాతం మంది ఈ లోపంతో బాధపడుతున్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది.

ఆరోగ్యానికి ‘డి’ అవసరమే

ఎముకల పటుత్వానికి, బ్లడ్‌ప్రెషర్‌కు కారణమయ్యే రెనిన్‌ అనే ఎంజైమ్‌ను నియంత్రించడంలోనూ విటమిన్‌ ‘డి’ తోడ్పడుతుంది. దీంతో బీపీ నార్మల్‌గా ఉంచడంతో పాటు ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. టైప్‌2 డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం 33 శాతం తగ్గుతుంది. ఈ విటమిన్‌ లోపం వల్ల ఒంటినొప్పులు, తీవ్ర అలసట, నిస్సత్తువతో పాటు హృదయ, రక్త సంబంధ వ్యాధులు వస్తాయి. ‘డి’ విటమిన్ లోపించడంతో.. తేలికపాటి గాయాలకే ఎముకలు విరుగుతాయి. గర్భిణుల్లో ‘విటమిన్‌-డి’ లోపం ఉంటే వారికి పుట్టే పిల్లలు.. ‘అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌(ఏడీహెచ్‌డీ)’ బారినపడే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News