ఇంట్లో ఉండటమే గొప్పమేలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తూ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. అందుకే సామూహిక వేదికలపై ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ వైరస్ దావానలంలా వ్యాపించడానికి మనకు తెలియకుండా మనమూ భాగస్వాములమయ్యే ప్రమాదముంది. అందుకే స్వయంగా మీకు మీరుగా ఇంటికే పరిమితమవ్వండని పలు దేశాలు పౌరులను కోరుతున్నాయి. ఇంటికి పరిమితమైతే చాలు.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో మీరు గొప్ప మేలు చేసినట్టేనని చెబుతున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ కళాకారుడు ఇదే విషయాన్ని […]

Update: 2020-03-16 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తూ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. అందుకే సామూహిక వేదికలపై ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ వైరస్ దావానలంలా వ్యాపించడానికి మనకు తెలియకుండా మనమూ భాగస్వాములమయ్యే ప్రమాదముంది. అందుకే స్వయంగా మీకు మీరుగా ఇంటికే పరిమితమవ్వండని పలు దేశాలు పౌరులను కోరుతున్నాయి. ఇంటికి పరిమితమైతే చాలు.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో మీరు గొప్ప మేలు చేసినట్టేనని చెబుతున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ కళాకారుడు ఇదే విషయాన్ని సూటిగా, స్పష్టంగా, సరళంగా అర్థమయ్యేలా ఓ యానిమేటెడ్ వీడియోను తయారుచేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

వరుస క్రమంలో ఒకదాని పక్కన మరొక అగ్గిపుల్లలను నిలబెట్టి.. మొదటిదానికి నిప్పు పెట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. మొదట అంటుకున్న అగ్గిపుల్ల పక్కనే ఉన్న మరో అగ్గిపుల్లను మండిస్తుంది. అటుతర్వాత దాని పక్కన ఉన్న అగ్గిపుల్ల మండిపోతుంది. ఇలా వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కాలిపోతూ ఉంటాయి. కానీ, ఒక అగ్గిపుల్ల ఆ వరుసలో నుంచి చాకచక్యంగా వెనక్కి అడుగేసి తప్పుకుంటుంది. అంతే, పక్కన మండిపోతున్న అగ్గిపుల్ల వేడిమికి దూరంగా ఉండి మండిపోకుండా తనను తాను కాపాడుకోవడమే కాదు.. మరోవైపున ఉన్న అన్ని అగ్గిపుల్లలకూ ఆ మంట చేరకుండా పరోక్షంగా కాపాడగలుగుతుంది.

అంటే, అలా వ్యాప్తి చెందుతున్న వైరస్‌కు మనమూ ఇంధనంలా మారకుండా.. పక్కకు తప్పుకుంటే చాలు మనవంతుగా ఆ వ్యాప్తిని అడ్డుకున్నవారిమే అవుతామని ఆ వీడియో సరళంగా వివరిస్తున్నది. అందుకే ఈ వీడియోను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో రూపకర్త జాన్ డెల్కాన్ ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలంటే కేవలం ఇంటికి పరిమితమైతే చాలు’ అనే వ్యాఖ్య కూడా పెట్టారు.

ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలు ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విధించాయి. భారత్ సహా అనేక దేశాలు సామూహిక వేదికలపై నిషేధాజ్ఞలు జారీ చేశాయి. సినిమా థియేటర్లు, పబ్‌లు, యూనివర్సిటీలు, పాఠశాలలకు బంద్ ప్రకటించాయి. పెళ్లి వేడుకలపైనా కండీషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోషల్ డిస్టెన్సింగ్‌ ప్రాముఖ్యతను ఈ వీడియో సమర్థంగా వివరిస్తున్నదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

tags : coronavirus, social distancing, animated video, viral, match sticks

Tags:    

Similar News