జర్నలిస్టులను విస్మరిస్తే పతనం తప్పదు.. విరాహత్ అలీ వార్నింగ్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశ చరిత్రలో జర్నలిస్టులను విస్మరించిన ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ సాధించలేదని, జర్నలిస్టుల కన్నీళ్లతో పతనమై పోయాయని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి రోజున దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశ చరిత్రలో జర్నలిస్టులను విస్మరించిన ప్రభుత్వాలు ఎక్కడ మనుగడ సాధించలేదని, జర్నలిస్టుల కన్నీళ్లతో పతనమై పోయాయని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి రోజున దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం ముందు జర్నలిస్టులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో ఆందోళన చెందుతున్నట్లు ఆయన చెప్పారు.
స్వాతంత్ర్యం అనంతరం వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ఉద్యమ ఫలితంగా సాధించుకున్న గొప్ప చట్టాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సహించరానిదన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని రద్దు చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులను ఆసుపత్రుల నిర్వాహకులు తిరస్కరిస్తుండడంతో ఉన్న ఆస్తులను అమ్ముకొని, అప్పులు చేసి జర్నలిస్టులు చికిత్స పొందుతున్నారని విరాహత్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో రాష్ట్రంలో 150 మంది జర్నలిస్టులు మృతి చెందారని, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
120 కేంద్రాల్లో ఆందోళన
జర్నలిస్టుల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన విజయవంతంగా ముగిసిందని విరాహత్ అలీ తెలిపారు. హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాల్లోని 120 కేంద్రాల్లో దాదాపు 3000 మంది జర్నలిస్టులు గాంధీ విగ్రహాల ముందు నిరసన చేపట్టి మహాత్ముడికి వినతి పత్రాలను అందించినట్లు ఆయన వెల్లడించారు.