హీటెక్కిన బెజవాడ.. వైసీపీ నేతలతో వంగవీటి భేటీ

దిశ, ఏపీ బ్యూరో : రాజకీయంగా ఆ ముగ్గురుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీలు ఏవైనా.. పదవులు ఉన్నా లేకపోయినా ఆ ముగ్గురు మాత్రం కలుస్తూనే ఉంటారు. సరదాగా ముచ్చటిస్తూనే ఉంటారు. అయితే ఆ ముగ్గురులో ఇద్దరు వైసీపీలో ఉండగా.. మరోమిత్రుడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. టీడీపీలో ఉన్నా సైలెంట్‌గా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీలో ఉన్న ఇద్దరు మిత్రులు వచ్చి కలవడం పలు కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఆ ముగ్గురు నేతలు ఎవరో […]

Update: 2021-12-27 03:10 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాజకీయంగా ఆ ముగ్గురుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీలు ఏవైనా.. పదవులు ఉన్నా లేకపోయినా ఆ ముగ్గురు మాత్రం కలుస్తూనే ఉంటారు. సరదాగా ముచ్చటిస్తూనే ఉంటారు. అయితే ఆ ముగ్గురులో ఇద్దరు వైసీపీలో ఉండగా.. మరోమిత్రుడు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. టీడీపీలో ఉన్నా సైలెంట్‌గా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీలో ఉన్న ఇద్దరు మిత్రులు వచ్చి కలవడం పలు కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఆ ముగ్గురు నేతలు ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకెవరు మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీమోహన్.

వంగవీటి మోహన్ రంగా 33వ వర్ధంతి సందర్భంగా ఈ ముగ్గురు నేతలు ఒకే వేదికపై చేరారు. ఇలా ఈ ముగ్గురు ఒకే వేదికపై చేరడంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కొడాలి నాని, వంశీలు ఇద్దరూ వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారేమోనంటూ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ మెుదలైంది. ఈ చర్చ జరుగుతుండగానే వంగవీటి రాధా తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన కలుగుతుంది.

నా తండ్రి ఆశయం కోసం పని చేస్తా.. వంగవీటి రాధా

డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగా వర్థంతి. రాష్ట్రవ్యాప్తంగా 33వ వర్థంతి సందర్భంగా వంగవీటి మోహన రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ ఇంటికి ఆదివారం ఉదయం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రావడం చర్చనీయాంశంగా మారింది. రాధాతో కలిసి వల్లభనేని వంశీమోహన్ రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వీరితోపాటు జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్, సౌజన్యలు కూడా నివాళులర్పించారు. అనంతరం వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. ‘వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు. గత 33 సంవత్సరాలుగా నాన్న వర్ధంతిని ఆయన అభిమానులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఒక ఆశయం కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా. పేదల కోసం నిరంతరం పరితపించిన రంగా ఆశయాలకు అనుగుణంగా నేను పని చేస్తా. పార్టీ ఏదైనా.. పదవులు ఉన్నా లేకపోయినా నేను ప్రజల మనిషిని’ అని వంగవీటి రాధా తెలిపారు.

ఇకపోతే గుడ్లవల్లేరులో విగ్రహావిష్కరణ సభలో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ బాంబు పేల్చారు. ఇటీవలే తనను అంతమెుందించేందుకు రెక్కీ నిర్వహించినట్లు ఆరోపించారు. రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని పదవులపై ఆశ లేదన్నారు. తనను ఏదో చేద్దాము అనుకుని రెక్కీ నిర్వహించారు. నేను భయపడను అన్నింటికీ రెడీగా ఉన్నాను. ప్రజల మధ్యే ఉంటాను. తనను లేకుండా చెయ్యాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలి. త్వరలోనే ఎవరు తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారో వారి విషయాలు బహిర్గతమవుతాయని చెప్పుకొచ్చారు. వంగవీటి రాధా ఆకస్మాత్తుగా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.

అభిమానులే రాధాకు అండ.. వల్లభనేని వంశీ

వంగవీటి రాధాకు అభిమానులు, కార్యకర్తలు అండగా ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. వంగవీటి మోహన రంగా 33వ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు. అనంతరం ఇద్దరూ కలిసి వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. వంగవీటి మోహన రంగా అంతటి అత్యున్నత స్థాయికి రాధా రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు.. గుర్తుండే వ్యక్తులు ముగ్గురు అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెప్పుకొచ్చారు. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, వంగవీటి మోహన రంగాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వంగవీటి రంగా బిడ్డలమని చెప్పడానికి తామెంతో గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాధాకు అభిమానులు, కార్యకర్తలు అండగా ఉండాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విజ్ఞప్తి చేశారు.

ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలి : పోతిన వెంకట మహేశ్

వంగవీటి రంగా ఆయన ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికి మరువలేనివి. బడుగు బలహీన వర్గాల కోసం వంగవీటి రంగా నిరంతరం పోరాడారు. ప్రతీ ఊరిలో వంగవీటి రంగా విగ్రహాలు ఉంటాయి. కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని జనసేన నేత పోతిన వెంకట మహేశ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు విజ్ఞప్తి చేశారు.

మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

వంగవీటి రాధాకృష్ణ బంగారం అని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో ఆదివారం దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ జరిగింది. మంత్రి కొడాలి నాని, రాధా, వంశీలు ముగ్గురూ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా నాకు తమ్ముడు. నేను వైసీపీలో ఉన్నాను, రాధా టీడీపీలో ఉన్నాడు అనుకుంటా?. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీడీపీ నాయకులు చెప్పినా.. పదవులను ఆశించకుండా ఆయన ఆ పార్టీలో చేరారు. బంగారం లాంటి రాధా తన జీవితంలో కాస్త రాగి మిశ్రమాన్ని కలిపి రాజీపడితే పరిస్థితి మరోలా ఉండేది. రాగి కలిపితేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలోకి వస్తుంది.. కానీ కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడు. రాధాను అందరూ దీవించాలని.. రాధాకు మంచి భవిష్యత్‌ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

సొంతగూటికి వెళ్తారా..?

ఇదిలా ఉంటే వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎక్కడ కనిపించినా విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతాయి. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని.. వంగవీటి రాధాలు కలుసుకున్నారు. ఇద్దరు నేతలు వైసీపీ నేత ఇంట్లో కూర్చుని గంటసేపు మాట్లాడుకున్నారు. దీంతో వంగవీటి రాధా వైసీపీలో చేరుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని రాధా కొట్టిపారేశారు. తాజాగా వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో వంగవీటి రాధా కలవడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ అధికార వైసీపీలో అనధికారికంగా చేరిపోయినట్లే. ఇక కొడాలి నాని ఏలాగూ మంత్రిగా ఓ వెలుగు వెలుగొందుతున్నారు. దీంతో తన మిత్రుడయిన రాధాను కూడా తిరిగి వైసీపీకి దగ్గర చేసేందుకే నేతలు ప్రయత్నిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి దీనిపై రాధా ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

వంగవీటి రాధా జోలికి వస్తే అంతు చూస్తా.. ప్రత్యర్థులకు బీజేపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్

Tags:    

Similar News