కరోనా వేళ.. కమ్యూనిటీ కిచెన్లు

పారిశుధ్య కార్మికులకు ఆపన్న హస్తంగా విజ్ఞాన దర్శిని దిశ, మేడ్చల్: హబ్సిగూడలో ఉండే మంగమ్మ(పేరు మార్చాం) తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచింది. లేచింది మొదలు హడావిడిగా ఇంటి నుంచి తార్నాక వైపు నడక మొదలుపెట్టింది. 5 గంటల వరకల్లా తార్నాక వంతెన వద్దకు చేరుకుంది. అప్పటికే మంగమ్మ లాంటి వారు మరో పది మంది ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. అంతా సిద్ధమయ్యి ఠంఛనుగా 5 గంటలకు డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఇంతకీ వీరు చేసే పనేంటో […]

Update: 2020-04-10 17:10 GMT

పారిశుధ్య కార్మికులకు ఆపన్న హస్తంగా విజ్ఞాన దర్శిని

దిశ, మేడ్చల్:

హబ్సిగూడలో ఉండే మంగమ్మ(పేరు మార్చాం) తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచింది. లేచింది మొదలు హడావిడిగా ఇంటి నుంచి తార్నాక వైపు నడక మొదలుపెట్టింది. 5 గంటల వరకల్లా తార్నాక వంతెన వద్దకు చేరుకుంది. అప్పటికే మంగమ్మ లాంటి వారు మరో పది మంది ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. అంతా సిద్ధమయ్యి ఠంఛనుగా 5 గంటలకు డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఇంతకీ వీరు చేసే పనేంటో తెలుసా. చెత్తను ఊడ్చడం. మనం రోజంతా ముక్కు మూసుకుని దూరంగా పడేసే చెత్తను వారంతా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారంతో మరెవరో కాదు.. పారిశుధ్య కార్మికులు. ఇలా మంగమ్మ లాంటి పారిశుధ్యకార్మికులు ఒక్కరు..ఇద్దరు కాదు.. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలు, కార్పొరేషన్లు, మేజర్ గ్రామపంచాయతీల్లో వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరంతా తెల్లవారుజాము నుంచే చెత్తను చిత్తశుద్ధితో సేకరించకపోతే మనమంతా ఒక్క క్షణమూ ఉండలేం. ఓ వైపు కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి వణికిస్తోంటే ఈ పారిశుధ్య కార్మికులు మాత్రం నిత్యం అలాంటి వైరస్‌లకు పుట్టినిల్లుగా ఉండే చెత్తలోనే జీవితమంతా గడుపుతూ సైనికుల్లా యుద్ధం చేస్తున్నారు.

ఇంటి నుంచి బయటకు వచ్చే పారిశుధ్య కార్మికులకు మధ్యాహ్నం ఇంటికెళ్లే వరకు ఎక్కడా ఏం దొరకడం లేదు. సాధారణ రోజుల్లోనైతే ఓ టీస్టాల్ దగ్గర ఛాయ్ తాగడమో, నాలుగు ఇడ్లీలు తినడమో చేసేటొళ్లు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కొవిడ్ 19 కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో హోటల్స్, టీ స్టాల్స్ అన్నీ బందయ్యాయి. దీంతో వారికి తాగు నీళ్లు తప్ప మరేది దొరక్కట్లేదు. మధ్యాహ్నాం లేక సాయంత్రం ఇంటికి వెళ్లి శుభ్రంగా స్నానం చేసే వరకు చెత్త వల్ల వచ్చే ఆ దుర్వాసనకు ఏం తినాలో తెలియదు.

పారిశుధ్య కార్మికుల కోసమే..

ఇలాంటి తరుణంలో ‘విజ్ఞాన దర్శిని’ పారిశుధ్య కార్మికులకు అపన్న హస్తాన్ని అందిస్తోంది. వారి ఆకలి బాధలను తీర్చేందుకు దాతల సాయంతో విజ్ఞాన దర్శిని కమ్యూనిటీ కిచెన్లను ప్రారంభించింది. ఈ కిచెన్ల ద్వారా ఉప్పల్‌లో 50 మంది, తార్నాకలో 50 మంది, జనగామ పట్టణంలో మరో 200 మందికి భోజన సదుపాయాన్ని సమకూరుస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో భోజనాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం విజ్ఞాన దర్శిని కార్యకర్తలు వంటలు చేయడంతో పాటు ఇతర పనులకు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. ఉప్పల్‌లో గుడిసెల్లో నివసిస్తున్న మరో 200 మంది కార్మికులకు విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నారు.

శానిటైజర్లు, మాస్కులు సైతం..

పారిశుధ్య కార్మికులకు కేవలం భోజన సదుపాయం ఏర్పాటు చేయడంతో ఆగకుండా వారి ఆరోగ్య రక్షణకూ విజ్ఞాన దర్శిని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే చర్లపల్లి జైలు నుంచి శానిటైజర్లు, మాస్కులు తెచ్చి అందజేస్తున్నారు. విజ్ఞాన దర్శిని శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందిస్తుండటంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణలో పాల్గొంటున్న వారందరికీ విజ్ఞాన దర్శిని ప్రతినిధులు టీ.రమేష్, జి.తులసీరామ్, బక్క కృష్ణ, కందుకూరి విజయ, పరమేష్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.

Tags: covid 19 effect, vignana darshini, food mask, distribution, lockdown

Tags:    

Similar News