మార్కెట్లు బంద్.. కొండెక్కిన కూరగాయాల ధరలు
దిశ,తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని వారాంతపు సంతలు, మార్కెట్లు నిర్వహించేందుకు దుకాణాదారులు జంకుతున్నారు. నగరంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరగుతున్న కరోనా పాజిటీవ్ కేసుల కారణంగా చాలా చోట్ల జరగాల్సిన వారాంతపు సంతలు నిర్వహించడం లేదు. ఈ సంతల ద్వారా కరోనా మరింత ప్రజలకు సోకే అవకాశం ఉండటంతో ముందుగానే దుకాణాదారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ఏదో ఓ కాలనీలో గురువారం సంత జరగాలి, కానీ […]
దిశ,తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని వారాంతపు సంతలు, మార్కెట్లు నిర్వహించేందుకు దుకాణాదారులు జంకుతున్నారు. నగరంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరగుతున్న కరోనా పాజిటీవ్ కేసుల కారణంగా చాలా చోట్ల జరగాల్సిన వారాంతపు సంతలు నిర్వహించడం లేదు. ఈ సంతల ద్వారా కరోనా మరింత ప్రజలకు సోకే అవకాశం ఉండటంతో ముందుగానే దుకాణాదారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ఏదో ఓ కాలనీలో గురువారం సంత జరగాలి, కానీ దాదాపు 60 శాతం కాలనీల్లో సంతలను నిర్వహించలేదు. ఒకవేళ జరిగినా అదికూడా అరకొర దుకాణాలను మాత్రమే ఏర్పాటుచేశారు. దీంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, గాజుల రామారం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కూరగాయల మార్కెట్‌లు తక్కువ మంది దుకాణాదారులే తెరుస్తున్నారు. కూకట్‌పల్లిలో గురువారం సంత కేవలం 20మంది వ్యాపారులకే పరిమితమైంది. ఇక్కడ శనివారం మార్కెట్ ఉండదని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా రైతు బజార్లలో కూడా సమయాన్ని కుదించారు. ఉదయం 9 గంటల వరకే కొన్నింటిని తెరిచి మూసేస్తున్నారు.
ధరలు పెరుగుతున్నాయి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగిస్తుంటారు. ప్రతి ఒక్కరికీ 300 గ్రాముల కూరగాయలు అవసరం. కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. దీంతో ప్రస్తుతం నిత్యం 4 వేల టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారుల అంచనా. కానీ మార్కెట్‌లకు డిమాండ్‌కు తగ్గ కూరగాయలు సప్లయ్ లేకపోడంతో కూరగాయల కొరత నెలకొందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల నుంచి బోయిన్‌పల్లి మార్కెట్‌కు దాదాపు 745 టన్నులు, ఎల్బీనగర్ మార్కెట్‌కు 11, మాదన్నపేట్ మార్కెట్‌కు 8, మీరాలంమండి మార్కెట్‌కు 6 టన్నుల కూరగాయలు దిగుమతి అయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు నగరంలోని 11 రైతు బజార్లను కలుపుకొని 110 టన్నులు, ఇతర చిన్నాచితకా మార్కెట్‌లకు 10 టన్నుల కూరగాయలు దిగుమతి అయినట్లు అంచనా. గ్రేటర్ కూరగాయల అవసరం ఒక్క రోజుకు 3 వేల నుంచి నాలుగు వేల టన్ను అయితే మంగళవారం నుంచి గురువారం వరకు కేవలం వెయ్యి టన్ను కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో డిమాండ్ ఎక్కువ.. సప్లయ్ తక్కువ కావడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. రెండు రోజుల కిందట వరకు రూ. 10 చొప్పున కిలో ఉన్న టమాట ఇప్పుడు రూ. 30కి చేరింది. చిక్కుడు, బిన్సీస్ ధర రూ. 60 నుంచి రూ. 80 వరకు పెరిగాయి. వంకాయ, బీరకాయ, దొండకాయ వంటి కూరగాయలు రూ. 40 నుంచి రూ. 80 వరకు పెరిగాయి. అటు మిర్చి కూడా రూ. 50 వరకు అమ్ముతున్నారు. రూ. 20కే కిలో పలికిన ఆలుగడ్డ రూ. 40కి పెరిగింది.