టెస్టుల్లేవ్.. టీకాల్లేవ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభత్సానికి వైద్యారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. పాజిటివ్ పేషెంట్ల సంఖ్య లాగానే టెస్టులు చేయించుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో సకాలంలో రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతోంది. ఇంకోవైపు వ్యాక్సిన్ నిల్వలు సంతృప్తికరంగా లేకపోవడంతో వైద్యారోగ్య శాఖ పొదుపు మంత్రం పాటిస్తోంది. ప్రస్తుతం ఆరు లక్షల డోసులే ఉన్నందున సెకండ్ డోస్ ఇచ్చేవారి కోసం రిజర్వులో ఉంచింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సెలవు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభత్సానికి వైద్యారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. పాజిటివ్ పేషెంట్ల సంఖ్య లాగానే టెస్టులు చేయించుకునేవారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో సకాలంలో రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతోంది. ఇంకోవైపు వ్యాక్సిన్ నిల్వలు సంతృప్తికరంగా లేకపోవడంతో వైద్యారోగ్య శాఖ పొదుపు మంత్రం పాటిస్తోంది. ప్రస్తుతం ఆరు లక్షల డోసులే ఉన్నందున సెకండ్ డోస్ ఇచ్చేవారి కోసం రిజర్వులో ఉంచింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సెలవు ప్రకటించిన వైద్యారోగ్య శాఖ మళ్ళీ శనివారం కూడా సెలవు ఇచ్చింది. కొత్తగా వ్యాక్సిన్ స్టాకు వచ్చిన తర్వాతి పరిస్థితికి అనుగుణంగా వచ్చే వారం షెడ్యూలును ఖరారు చేయనుంది.
ఇదిలా ఉండగా పాజిటివ్ లక్షణాలేవీ లేకున్నా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల్లోకి వెళ్ళిన వ్యక్తులు స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్ టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ దగ్గర నిల్వలు పుష్కలంగానే ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు సకాలంలో అందడంలేదు. పట్టణాలు, నగరాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లలో సైతం రాపిడ్ టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. మరికొన్ని చోట్ల టెస్టులు చేయడానికి తగినంత మంది వైద్య సిబ్బంది లేకపోవడంతో మరుసటి రోజుకు టోకెన్లను ఇచ్చే విధానం అమలవుతోంది. ఆ ప్రకారం పరిమిత సంఖ్యలోనే కరోనా టెస్టులు జరుగుతున్నాయి.
ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల విషయంలో మాత్రం వైద్యారోగ్య సిబ్బందికి కొత్త సమస్య ఎదురవుతోంది. ఒక్కో పరీక్ష చేసిన తర్వాత రిపోర్టు రావడానికి సాధారణంగా నాలుగైదు గంటలే పడుతుంది. కానీ ఇప్పుడు పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో రిపోర్టు రావడానికి నాలుగైదు రోజులు పడుతోంది. దీంతో హైదరాబాద్‌లోని చాలా ప్రైవేటు లాబ్‌లు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేయడానికి ముందూ వెనకా ఆలోచిస్తున్నాయి. రిపోర్టు రావడానికి ఆలస్యమవుతుందంటూ ముందుగానే చెప్తున్నారు. ప్రభుత్వ లాబ్‌లలో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. టెస్టులు చేయించుకున్నవారికి ఆటోమేటిక్‌గా వచ్చే మొబైల్ మెసేజ్‌లు కూడా రావడంలేదు. ఐదారు రోజుల తర్వాత నేరుగా రిపోర్టులు వస్తున్నాయి. ఈ మధ్యలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే అడ్మిషన్ దొరకడం కష్టమవుతోంది.
టెస్టింగ్ కిట్లకు, వ్యాక్సిన్లకు కొరత ఉన్నట్లే ఆక్సిజన్‌కు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లకు కూడా కొరత ఏర్పడింది. బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే నయా దందాలు మొదలయ్యాయి. ఆపదలో ఉండే పేషెంట్లకు ఈ రెండూ అనివార్యం కావడంతో నాలుగైదు రెట్లు ఎక్కువ మొత్తం చెల్లించి మరీ కొనుక్కోక తప్పడంలేదు. రెమిడెసివిర్ మందుల తయారీ రాష్ట్రంలోని డిమాండ్‌కు అనుగుణంగా లేకపోవడంతో పరిశ్రమల మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఫార్మా కంపెనీలతో మాట్లాడి వారం రోజుల్లో కనీసంగా నాలుగైదు లక్షల డోసుల్ని తయారుచేసి మార్కెట్‌లోకి వదలాల్సిందిగా సూచించారు. వారం రోజుల వరకూ తిప్పలు తప్పేలా లేదు.
ఇంకోవైపు ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం అదనపు స్టాకును పంపడానికి మార్గాలను అన్వేషించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సైతం తెలంగాణలో ఆక్సిజన్ నిల్వలు, అవసరాలు, సరఫరాపై సమీక్ష నిర్వహించి తదనుగుణమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆక్సిజన్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాల్సిందిగా పరిశ్రమలను ఆదేశించడంతో పాటు పరిశ్రమల అవసరాలను పక్కనబెట్టి అక్కడ వాడే ఆక్సిజన్‌ను ప్రాసెస్ చేసి మెడికల్ ఆక్సిజన్ రవాణాను పెంచాల్సిందిగా సూచించారు.