టీకాల లభ్యతే అసలు సమస్య.. మే 1 నుంచి పంపిణీ ఎలా?

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. అయితే తెలంగాణలో దీన్ని అమలుచేయడంపై వైద్యారోగ్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీకాలు సరైన మోతాదులో రాకపోతే ఈ ప్రక్రియను మొదలుపెట్టడం, కొనసాగించడం ఎలా అనేది అధికారులకు మింగుడుపడడంలేదు. ప్రస్తుతం రోజుకు ఒకటిన్నర లక్షల డోసులకే సరిపోయే నిల్వలే లేనప్పుడు మే 1 నుంచి 18 ఏళ్ళు దాటినవారందరికీ ఇవ్వడానికి అవసరమైనంత స్టాక్ […]

Update: 2021-04-26 22:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. అయితే తెలంగాణలో దీన్ని అమలుచేయడంపై వైద్యారోగ్య శాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీకాలు సరైన మోతాదులో రాకపోతే ఈ ప్రక్రియను మొదలుపెట్టడం, కొనసాగించడం ఎలా అనేది అధికారులకు మింగుడుపడడంలేదు. ప్రస్తుతం రోజుకు ఒకటిన్నర లక్షల డోసులకే సరిపోయే నిల్వలే లేనప్పుడు మే 1 నుంచి 18 ఏళ్ళు దాటినవారందరికీ ఇవ్వడానికి అవసరమైనంత స్టాక్ అందుతుందా అనే భయం పట్టుకుంది. టీకా కేంద్రాల దగ్గర ప్రజలు క్యూ కడితే రద్దీని ఎలా నివారించడమా అనేదానిపై ఆలోచనలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్న సమీక్షా సమావేశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. పదిహేను రోజులకు సరిపడేలా 30 లక్షల డోసులు ఇవ్వాల్సిందిగా ప్రధాన కార్యదర్శి పది రోజుల క్రితం కేంద్రాన్ని కోరితే ఇప్పటివరకు పది లక్షలు మాత్రమే వచ్చాయి. సరైన నిల్వలు లేని కారణంగా శ్రీరామనవమి రోజున, శనివారం వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. రాష్ట్రంలో 18-44 ఏజ్ గ్రూపు జనాభా సుమారు 2.62 కోట్ల మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. వీరికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఐదు కోట్ల డోసులు అవసరం. కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా తయారీ సంస్థల నుంచి సమకూర్చుకోవడం కష్టంగా మారింది.

రోజుకు పాతిక లక్షలే ఉత్పత్తి

దేశంలో ప్రస్తుతం పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థలు మాత్రమే టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం సంస్థ నెలకు ఆరు కోట్లు, భారత్ బయోటెక్ కోటి డోసులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం మాత్రమే ఉంది. రోజుకు సగటున ఈ రెండు సంస్థలూ కలిపి గరిష్టంగా పాతిక లక్షలకంటే ఎక్కువ డోసులను తయారుచేయలేకపోతున్నాయి. అలా ఉత్పత్తి అయిన డోసుల్లో సగం కేంద్ర ప్రభుత్వానికి కేటాయించాల్సి ఉంది. మిగిలిన సగాన్ని అన్ని రాష్ట్రాలకూ, ప్రైవేటు ఆస్పత్రులకూ విక్రయిస్తాయి. ఆ ప్రకారం ఒక్కో రాష్ట్రానికి ఒక రోజుకు నేరుగా లక్ష కంటే ఎక్కువ డోసులు అందే అవకాశం లేదు. కేంద్రం నుంచి అదనంగా మరో లక్ష డోసులు వస్తాయని అనుకున్నా మొత్తం కలిపి రెండు లక్షలు దాటవు. ఇప్పుడే తెలంగాణలో గరిష్టంగా రెండు లక్షల డోసుల పంపిణీ జరుగుతోంది.

ఇక 18-44 ఏజ్ గ్రూపువారికీ ఇవ్వడానికి తగిన నిల్వలు ఉండవని వైద్యారోగ్య శాఖ ఆందోళన పడుతోంది. కేంద్ర ప్రభుత్వం మే నెల 1వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో బుధవారం నుంచి ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు కూడా షురూ కానున్నాయి. ఆ ప్రకారం టీకా కేంద్రాల దగ్గరకు వచ్చే రద్దీని నివారించడం కష్టసాధ్యమేనని వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పోలీసులు సైతం నియంత్రించడానికి తిప్పలు పడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. సీరం, బయోటెక్ సంస్థలు సైతం ఉత్పత్తి సామర్థ్యాన్ని మే నెల చివరి నుంచి సెప్టెంబరు దాకా దశలవారీగా పెంచనున్నట్లు పేర్కొన్నాయి. అక్టోబరు నుంచి ఉత్పత్తి రెట్టింపు చేయనున్నట్లు సీరం సంస్థ సీఈఓ పూనావాలా చెప్పినందున అప్పటిదాకా దేశవ్యాప్తంగా టీకాలకు కొరత తప్పదని బలంగా అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి సమీక్షపైనే ఆశలన్నీ

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగానే టీకాలను ఇవ్వనున్నామని, మే నెల 1వ తేదీ నుంచి మొదలయ్యే 18-44 ఏజ్ గ్రూపువారికి కూడా ప్రభుత్వమే రూ. 2,500 కోట్లు వెచ్చించి ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. దానికి అనుగుణంగా తగిన మార్గదర్శకాలను, ఆ ఏజ్ గ్రూపువారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవలంబించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు మూడు రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడ జరిగే చర్చల అనంతరం అధికారికంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియపై స్పష్టత వస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. టీకా కేంద్రాల సంఖ్యను పెంచడం, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, టీకాలను తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయడం, అన్ని జిల్లాలకు రవాణా చేయడం.. ఇలాంటి అన్ని అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుందని, ఏర్పాట్లు కూడా ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News