వాహ్.. ఆటపాటలతో రికవరీ సొంతం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా బాధితుల సౌకర్యార్థం ప్రభుత్వం జిల్లాలోని పలు చోట్ల ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇళ్లలో ఉండి చికిత్స పొందే అవకాశం లేని చా లా మంది బాధితులు అందులో చేరుతున్నారు. వేర్వేరు ప్రాంతాలనుంచి వస్తున్న వారిలో మానసిక ఒత్తిడిని దూరం చేసి, మనోధైర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆటపాటలతో ఉపశమనం కలిగించేందుకు ఐసొలేషన్ సెంటర్లలో క్రీడా వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల నిర్ణయంతో బాధితులు త్వరగా రికవరీ అయ్యే […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా బాధితుల సౌకర్యార్థం ప్రభుత్వం జిల్లాలోని పలు చోట్ల ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇళ్లలో ఉండి చికిత్స పొందే అవకాశం లేని చా లా మంది బాధితులు అందులో చేరుతున్నారు. వేర్వేరు ప్రాంతాలనుంచి వస్తున్న వారిలో మానసిక ఒత్తిడిని దూరం చేసి, మనోధైర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆటపాటలతో ఉపశమనం కలిగించేందుకు ఐసొలేషన్ సెంటర్లలో క్రీడా వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల నిర్ణయంతో బాధితులు త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
వేగంగా రికవరీ కోసం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, వాంకిడి, ఆదిలాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ ఐసొలేషన్ కేంద్రాలను నిర్వహిస్తున్నది. ఒక్కో కేంద్రంలో 40 నుంచి 150 మంది దాకా కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నా రు. వీరికి అక్కడే మెరుగైన చికిత్సతో పాటు భోజన వసతి కూడా అందిస్తున్నారు. అయితే రోజంతా గదుల్లోనే ఉండడం వల్ల వారు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి దూరమైన వారు సకాలంలో కోలుకుంటున్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ బాధితులకు ప్రతి రోజు ఆటపాటలతో ఉపశమనం కలిగించాలని ఆలోచించి దీనిని అమలు చేస్తున్నారు. దీంతో కరోనా బాధితులు వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
క్రీడా పరికరాలు అందజేత
కొవిడ్ బాధితులకు వైద్యంతోపాటు శారీరక వ్యాయామం కోసం వైద్య ఆరోగ్య శాఖ క్రీడా పరికరాలను అందజేసింది. నిర్మల్ కలెక్టర్ ము షారఫ్ అలీ ఆదేశాల మేరకు కొవిడ్ నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ప్ర స్తుతం నిర్మల్ జిల్లా ఐసొలేషన్ కేంద్రంలో కిట్లు అందజేశారు. ఇందులో 55 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, వారికి రెండు క్రికెట్ కిట్లు, రెండు క్యారం బోర్డులు, నాలుగు షటిల్ కిట్లు, పిల్లల కోసం మరో రెండు షటిల్ బ్యా డ్మింటన్ కిట్లు, రింగ్ బాల్, ఎయిర్ బాల్ తదితర పరికరాలను అందజేశారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆడే సమయాన్ని కూడా ఖరారు చేశారు. బాధితులు మనోధైర్యంతో కరోనాను జయించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మానసిక ఒత్తిడి తగ్గి త్వరగా కోలుకుంటారు: డాక్టర్ కార్తీక్, కొవిడ్ నియంత్రణ నిర్మల్ జిల్లా అధికారి
ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న బాధితులు తొందరగా కోలుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. సెంటర్లలో ఉంటున్న వారికి మెరుగైన చికిత్స అందివ్వడంతోపాటు సరైన పోషకాహారం ఇస్తున్నాం. వీటికి తోడు నిరంతరం క్రీడల్లో పాల్గొన్నట్లయితే వారిలో మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యంతో తొందరగా కోలుకుంటారు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.