ఆలోచన లేని ఆర్భాటం.. వరంగల్‌లో ఆగని రోడ్డు విధ్వంసం
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహానగరంలో మొక్కలు నాటే కార్యక్రమం పేరిట రోడ్డు విధ్వంసం జరుగుతోంది. మొక్కలు నాటడానికి పట్టణంలో స్థలాలే కరువయ్యాయన్న చందంగా రూ.2కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో కాజీపేట ఫాతిమా నుంచి ఫారెస్ట్ కార్యాలయం వరకు నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ సర్వనాశనం ఉదంతాన్ని ‘దిశ’ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత జరిగిన ఎంపీ పసునూరి అధ్యక్షతన జరిగిన దిశా కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ కూడా అధికారులపై మండిపడ్డారు. […]
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహానగరంలో మొక్కలు నాటే కార్యక్రమం పేరిట రోడ్డు విధ్వంసం జరుగుతోంది. మొక్కలు నాటడానికి పట్టణంలో స్థలాలే కరువయ్యాయన్న చందంగా రూ.2కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో కాజీపేట ఫాతిమా నుంచి ఫారెస్ట్ కార్యాలయం వరకు నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ సర్వనాశనం ఉదంతాన్ని ‘దిశ’ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత జరిగిన ఎంపీ పసునూరి అధ్యక్షతన జరిగిన దిశా కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ కూడా అధికారులపై మండిపడ్డారు. స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన రోడ్లను తవ్వే ముందు కనీస సమాచారం ఇవ్వరా..? అంటూ మండిపడ్డారు. అయితే రెండు మూడు రోజులు ఎన్ హెచ్‌ను ఆనుకుని చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రేటర్ అధికారులు మళ్లీ చేపట్టడం గమనార్హం.
ఎవరి మెప్పుకోసమో అన్నట్లుగా…
ఎవరి మెప్పుకోసమో అన్నట్లుగా రోడ్డును ధ్వంసం చేసి మరీ వరంగల్ పట్టణంలోని కీలక ప్రజాప్రతినిధులు చేస్తున్న ఈ హరిత కార్యక్రమాన్ని మాత్రం జనాలు హర్షించడం లేదు. ఇప్పటికే రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. ఫుట్‌పాత్‌లను స్థానిక కార్పోరేటర్లు సొంత జాగలన్న విధంగా అనుచరుల వ్యాపారాలకు అప్పగించేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయా శాఖల నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే గ్రేటర్ వరంగల్ అధికారులు ఇష్టానుసారంగా జాతీయ రహదారిని తవ్వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులే ముందుడి అడ్డగోలుగా రోడ్డును తవ్వే కార్యక్రమం చేపట్టినప్పుడు తాము మాత్రం ఏం చేస్తాం చెప్పండంటూ ఫిర్యాదు చేస్తున్న ప్రజానీకానికి అధికారులు సమాధానం చెబుతున్నారంట.
కంకర మధ్యలో మొక్కలు బతుకుతాయా..?
ఇంత విధ్వంసం చేసి మరీ మొక్కలు నాటే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తుండటం గమనార్హం. రోడ్ల పక్కన మొక్కలు నాటేందుకు తీసిన గుంతలు మూరెడుకు మించి లోతు ఉండటం లేదు. వాస్తవానికి ఎన్ హెచ్ రోడ్డు నిర్మాణంలో దాదాపు మీటర్ లోతు వరకు కంకర ఉంటుంది. కంకర మధ్య మొక్కలు ఎలా మొలుస్తాయంటూ వరంగల్ నగర జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఆర్భాటం తప్ప ఆలోచన ఉండదా..? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ప్రధాన రహదారిపై జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం ప్రజాప్రతినిధుల పనితీరుకు, శ్రద్ధకు నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు.