అన్‌లాక్-3 మార్గదర్శకాల విడుదల
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 24గంటలూ ప్రజల కదలికలు, వాహనాల రాకపోకలకు వీలు కల్పించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తదితరాలు మాత్రం ఆగస్టు 31 వరకు మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఎంటర్‌టెయిన్‌మెంట్ కేంద్రాలు, పబ్‌లు, క్లబ్‌లు, బార్లు తదితరాలు కూడా తదుపరి మార్గదర్శకాలు వచ్చేవరకు మూసివేసే ఉంటాయని పేర్కొంది. కొన్ని పరిమితులతో ఆగస్టు 5నుంచి యోగా కేంద్రాలు, జిమ్‌లు […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశవ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 24గంటలూ ప్రజల కదలికలు, వాహనాల రాకపోకలకు వీలు కల్పించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తదితరాలు మాత్రం ఆగస్టు 31 వరకు మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఎంటర్‌టెయిన్‌మెంట్ కేంద్రాలు, పబ్‌లు, క్లబ్‌లు, బార్లు తదితరాలు కూడా తదుపరి మార్గదర్శకాలు వచ్చేవరకు మూసివేసే ఉంటాయని పేర్కొంది. కొన్ని పరిమితులతో ఆగస్టు 5నుంచి యోగా కేంద్రాలు, జిమ్‌లు పనిచేయవచ్చునని పేర్కొంది. అయితే వీటి పనితీరుకు సంబంధించి త్వరలోనే కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ నిర్దిష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం విడుదల చేసిన అన్‌లాక్-3 మార్గదర్శకాల్లో పై అంశాలను పేర్కొంది. మెట్రో రైళ్ళు, విదేశీ విమాన సర్వీసులు, రాజకీయ సభలు-సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలు, జనం ఎక్కువగా హాజరయ్యే కార్యక్రమాలు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జరగరాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్‌లాక్-3 మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
పంద్రాగస్టు వేడుకలను పరిమితమైన ఆంక్షల నడుమ జరుపుకోవాలని ఆయన ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతీ ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని, దేశ రాజధాని మొదలు పంచాయితీ కార్యాలయం వరకు పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు సైతం పరిమితుల నడుమ సోషల్ డిస్టెన్స్ నిబంధన మేరకు జరగాలని సూచించారు. కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసరాలు, నిత్యవసరాలకు మినహా సాధారణ ప్రజల కదలికలు ఉండవని, ఆగస్టు 31వ తేదీ వరకు ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు.
ఆన్‌లైన్ తరగతులను ప్రోత్సహించాలి
అన్‌లాక్-3 మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థలు మూసివేసే ఉంటాయి కాబట్టి ఈ కాలంలో ఆన్‌లైన్ తరగతులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని కేంద్ర హోం కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ తరగతులను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నందున వాటికి అన్‌లాక్-3 ప్రకారం మరింత వెసులుబాటు లభించినట్లయింది.
కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ అమలు
అన్‌లాక్-3 మార్గదర్శకాలు విడుదలైనప్పటికీ కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం ఇప్పటివరకూ అమలవుతున్న ఆంక్షలే ఇకపైన కూడా కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు జిల్లా కలెక్టర్ కంటైన్‌మెంట్ జోన్ల ప్రకటన, ఎత్తివేత లాంటి నిర్ణయాలు తీసుకోవచ్చునని, అయితే వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలుచేయాల్సిందేనని కేంద్ర హోం కార్యదర్శి స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ నిర్ధారణ అయిన పేషెంట్ల ప్రైమరీ కాంటాక్టులను ట్రేస్ చేయాల్సిందేనని, ఇంటింటి సర్వే జరుపుతూ వైరస్ వ్యాప్తిపై నిఘా కొనసాగాల్సిందేనని, అవసరమైనప్పుడు ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బంది చొరవ తీసుకుంటాయన్నారు. కొన్ని సందర్భాల్లో కంటైన్‌మెంట్ జోన్లకు వెలుపల ఉన్న బఫర్ జోన్లలో సైతం వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందని, ఇలాంటిచోట్ల కూడా ఆంక్షలను అమలుచేయాలన్నారు.
అంతర్ రాష్ట్ర రాకపోకలకు ఆంక్షలు లేవు
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలో జిల్లాల మధ్య తిరుగుతున్నట్లుగానే వాహనాల రాకపోకలు కొనసాగుతాయని, సరుకు రవాణాకు కూడా ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర హోం కార్యదర్శి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికీ చిక్కుకుపోయి ఉన్న వలస కార్మికులను సొంతూళ్ళకు తరలించడానికి ‘శ్రామిక్ ఎక్స్‌ప్రెస్’ రైలు సర్వీసులు, విదేశాల్లో చిక్కుకుపోయినవారిని తీసుకొచ్చేందుకు ‘వందే భారత్’ విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు. పదేళ్ళ లోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ళ వయసు దాటిన వృద్ధులు వీలైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇంటి గడప దాటి బైటకు వచ్చే ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాల్సిందేనని, అరడుగుల సోషల్ డిస్టెన్స్ నిబందనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.