కరోనా టెస్టులు మరింత పెరగాలి

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కరోనా నిర్ధారణ పరీక్షలను మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని, దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు వీలైనంత ఎక్కువ సంఖ్యలో టెస్టింగ్ కిట్లను సమకూర్చుకుని సన్నద్ధం కావాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఒక సంయుక్త లేఖలో సూచించారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలూ స్వల్ప, మధ్యాకాలిక వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. టెస్టుల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య రంగాల్లో […]

Update: 2020-07-21 11:49 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కరోనా నిర్ధారణ పరీక్షలను మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయని, దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు వీలైనంత ఎక్కువ సంఖ్యలో టెస్టింగ్ కిట్లను సమకూర్చుకుని సన్నద్ధం కావాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఒక సంయుక్త లేఖలో సూచించారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలూ స్వల్ప, మధ్యాకాలిక వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. టెస్టుల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య రంగాల్లో మరిన్ని ల్యాబ్‌లను సమకూర్చుకోవడంతో పాటు మిషన్లను, కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పకడ్బందీ వ్యూహాన్ని రచించిందని, ఇందుకు రాష్ట్రాలు-కేంద్రం మధ్య పటిష్ట సమన్వయం అవసరమని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వాల స్థాయిలో మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐసీఏఆర్, డీబీటీ, డీఎస్‌టీ, డీఎస్ఐఆర్ లాంటి వివిధ శాఖలు, విభాగాల మధ్య కూడా సమన్వయం ఉండాలన్నారు.

స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ వైద్య విద్య, పరిశోధనా కేంద్రాల దగ్గర ఉన్న ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాలను తాత్కాలికంగా సమకూర్చుకోవాలని, వీటిని జిల్లా ఆసుపత్రుల్లోనూ, టెస్టింగ్ ల్యాబ్‌లలోనూ వినియోగించాలని, ఈ ప్రకారం ప్రతీ రాష్ట్రం దగ్గర అదనపు యంత్రాలు ఉన్నట్లవుతుందని ఈ లేఖలో వారిద్దరూ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రాలన్నీ నిర్దిష్ట రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలని, దానికి తగినట్లుగా మానవ వనరులను కూడా సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా 281 ప్రభుత్వ వైద్య కళాశాలలకు మెడికల్ కౌన్సిల్ అనుమతి ఉందని, ఇందులో 263 కళాశాలల్లో టెస్టింగ్ సౌకర్యాలు చేసుకోడానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. మిగిలిన 12 ప్రభుత్వ కళాశాలల్లో సైతం టెస్టింగ్ చేసుకోడానికి త్వరలోనే అనుమతి వస్తుందని, అప్పటికల్లా రెండు చొప్పున ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాలను సమకూర్చుకుని, సిబ్బందికి శిక్షణ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. దేశంలోని మరో 261 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయని, ఇందులో 76 కళాశాలలకు ఐసీఎంఆర్ కరోనా టెస్టులు చేసుకోడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, మరో 185 కళాశాలలు రెండు చొప్పున ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయడానికి యంత్రాలను సమకూర్చుకున్నవెంటనే అనుమతి మంజూరవుతుందని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రతీరోజు సగటున 48వేల ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు అదనంగా చేసే సౌకర్యం కలుగుతుందన్నారు. ఈలోపు రాష్ట్రాలు ఎలాగూ యాంటీజెన్ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నందున అందుకు అవసరమైన కిట్లను ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ నుంచి సమకూర్చుకోవచ్చని, ధర కూడా తక్కువగానే ఉంటుందన్నారు.

ఇక మధ్యకాలిక వ్యూహంలో భాగంగా ప్రతీ ప్రభుత్వ ల్యాబ్‌లో రెండు ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాలు ఉండేలా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేయాలని, దీనితో పాటు ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ యంత్రాన్ని కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన 123 ప్రభుత్వ ల్యాబ్‌లలో ఒక్కో ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాలు మాత్రమే ఉన్నాయని, అదనంగా ప్రతీదాంట్లో ఒక్కో యంత్రాన్ని కొనుగోలు చేయాల్సిందేనని, దీనివల్ల అదనంగా 29,520 టెస్టులు ప్రతీరోజూ చేసే వీలు కలుగుతుందని వివరించారు. ఈ రెండు వ్యూహాలను ఏ షెడ్యూలు ప్రకారం నిర్వహించాలో కూడా రాష్ట్రాలకు విడిగా మరో సర్క్యులర్ రూపంలో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్‌లు పంపించాయి. ప్రస్తుతం ఈ జాగ్రత్తలు తీసుకోవడం, వ్యూహాలు రూపొందించుకోవడం తక్షణావసరంగా ముందుకొచ్చిందని పేర్కొన్నారు. అప్పుడే కొవిడ్‌పై చేసే యుద్ధంలో పైచేయి సాధించగలమని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆ లేఖలో వీరిద్దరూ స్పష్టం చేశారు.

Tags:    

Similar News