పత్తిపాకలో ఆకతాయిల వీరంగం.. పంచాయతీ ఆఫీస్ తాళం ధ్వంసం!
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామపంచాయతీ కార్యాలయ తాళాన్ని ధ్వంసం చేశారు. అనంతరం చోరీకి యత్నించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీ మహమ్మద్ వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ సిబ్బంది విధులకు హాజరై పంచాయతీ కార్యాలయాన్ని శుభ్రం చేసే క్రమంలో కార్యాలయ గది తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి అలీ మహమ్మద్‌కు తెలిపారు. ఆయన హుటాహుటిన కార్యాలయానికి […]
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గ్రామపంచాయతీ కార్యాలయ తాళాన్ని ధ్వంసం చేశారు. అనంతరం చోరీకి యత్నించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలీ మహమ్మద్ వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ సిబ్బంది విధులకు హాజరై పంచాయతీ కార్యాలయాన్ని శుభ్రం చేసే క్రమంలో కార్యాలయ గది తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి అలీ మహమ్మద్‌కు తెలిపారు. ఆయన హుటాహుటిన కార్యాలయానికి చేరుకొని పరిశీలించగా, తాళం ధ్వంసం అయ్యి ఉంది. ఈ విషయమై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో పలు కీలక పత్రాలతో పాటు బతుకమ్మ చీరలు ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
దొంగలా..? ఆకతాయిలా..?
గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పత్తిపాక గ్రామ పంచాయతీ కార్యాలయ డోర్ తాళం పగులగొట్టడం పత్తిపాక గ్రామంలో సంచలనంగా మారింది. ఇంతకు కార్యాలయ భవన తాళం పగలగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో పత్తిపాక గ్రామంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత నెలరోజుల క్రితం సైతం గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి కొంత నగదు తీసికెళ్లినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో గ్రామంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని సెంట్రల్ లైటింగ్స్ పగలగొట్టడం, ట్రాక్టర్‌ల తాళాలు దొంగలించడం, గ్రామంలోని కొన్ని సెంటర్ల వద్ద అడ్డాలు వేసి మద్యం సేవిస్తూ.. వచ్చిపోయే వారికి ఇబ్బంది సైతం కలిగిస్తున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఈ ఆకతాయిలు కేవలం మద్యం మాత్రమే కాకుండా గంజాయిని సైతం సేవిస్తూ.. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గ్రామ పంచాయతీ కార్యాలయ తాళం ధ్వంసం ఆకతాయిల పనా..? దొంగల పనా..? అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.