భాగ్యనగరం బాగయ్యేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో మెరుగైన రవాణా సదుపాయాల పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సమావేశాలు, చర్చలు, ప్రతిపాదనలు, ఆదేశాలు చకచకా జరిగిపోతున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. సమావేశాల నుంచి వచ్చిన అధికారులు డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందిస్తున్నామని ప్రకటించడం, టెండర్ల ప్రక్రియ చేపట్టడంతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం(ఈబీఆర్‌టీఎస్), మెట్రో రైలు విస్తరణ, సైకిల్ ట్రాక్, పాదచారుల పథకాలు వంటివి […]
దిశ, తెలంగాణ బ్యూరో: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో మెరుగైన రవాణా సదుపాయాల పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సమావేశాలు, చర్చలు, ప్రతిపాదనలు, ఆదేశాలు చకచకా జరిగిపోతున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. సమావేశాల నుంచి వచ్చిన అధికారులు డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందిస్తున్నామని ప్రకటించడం, టెండర్ల ప్రక్రియ చేపట్టడంతోనే సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం(ఈబీఆర్‌టీఎస్), మెట్రో రైలు విస్తరణ, సైకిల్ ట్రాక్, పాదచారుల పథకాలు వంటివి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
కార్యరూపం దాల్చని పథకాలు..
హైదరాబాద్ మహానగరంలో మెరుగైన రవాణా సదుపాయాల రూపకల్పన కోసం ప్రత్యేకంగా సమగ్ర రవాణా అధ్యయనం (కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టు స్టడీ-సీటీఎస్)ను చేయించారు. లీ అసోసియేట్స్ సంస్థ సీటీఎస్ చేపట్టి శరవేగంగా విస్తరిస్తున్న సిటీలో మెరుగైన రవాణా సదుపాయాల అవసరాన్ని తాత్కాలిక, మాధ్యమిక, దీర్ఘకాలిక పథకాలను ప్రతిపాదించింది. అందులో ప్రధానమైనవి బీఆర్‌టీఎస్, ఎంఆర్‌టీఎస్, నాన్ మోటరైజ్డ్ వెహికిల్స్ వినియోగం, పాదచారులకు సౌలభ్యం వంటివి ఉన్నాయి. బస్ రవాణా 42%, రైలు బేస్డ్ ఎంఎంటీఎస్ 1.5 %, త్రీసీటర్, 7 సీటర్ ఆటోల వ్యవస్థ 8 %, ప్రైవేట్ వాహనాలు 48.5 శాతంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని సీటీఎస్ వెల్లడించింది.
ఈబీఆర్‌టీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతంలో నిర్వహించిన ఓ ప్రత్యేక సమావేశంలో అధికారులను ఆదేశించారని అధికారులే వెల్లడించారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా అది కార్యరూపందాల్చడం లేదు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ నుంచి హైటెక్ సిటీ ప్రాంతానికి ఈబీఆర్‌టీఎస్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ప్రతిపాదనల్లోనే నానుతోంది.
మెట్రో 162 కి.మీ.లు, బీఆర్టీఎస్ 57కి.మీ.లు.
ప్రయాణికుల సౌలభ్యం కోసం పురపాలక శాఖ ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి జేఎన్‌టీయూ-గచ్చిబౌలి ప్రాంతానికి 18 కి.మీ.లుగా ఎలివేటెడ్ బస్ పథకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి అర కిలోమీటరుకు ఒక స్టేషన్ ఉండాలని సుమారు ₹2,400 కోట్లు అంచనా వ్యయంగా ప్రతి కిలోమీటర్ కు ₹140 కోట్లుగా పేర్కొన్నది. ఇది హైటెక్ మెట్రో స్టేషన్, హైటెక్స్, మైండ్ స్పేస్, గచ్చిబౌలి వరకు ప్రతిపాదించారు. రెండు లేదా మూడు బస్సులు జాయింట్ గా ప్రయాణిస్తూ ఉంటాయి. సీటీఎస్ నివేదిక ప్రకారం బీఆర్‌టీఎస్ 2011నాటికి కనీసం 57 కి.మీ.లు వరకు అమలులో ఉండాల్సింది. ఈబీఆర్టీఎస్ మార్గం మెట్రో స్టేషన్లను కూడా కలుస్తుంది. 2011 నాటికి మెట్రో రైలు 162 కి.మీ.లుగా ఉండాలని సీటీఎస్ ప్రతిపాదించగా మెట్రో రెండో దశను విస్తరిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.
అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కోకాపేట్ లేదా నార్సింగి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం దాకా ప్రత్యేకంగా మెట్రో రైలును ప్రతిపాదించింది. అందుకు సుమారు ₹1,600 కోట్లు అంచనా వేసింది. ఈ మార్గాన్ని హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీలు సహకారాన్ని అందిస్తాయని 2018లో అధికారులు ప్రకటించారు. అది నేటికీ ప్రకటనల దశలోనే ఉంది. నాన్ మోటరైజ్డ్ వెహికిల్ సిస్టంలో భాగంగా సైకిల్ ట్రాక్స్ ను 31 కి.మీ.లు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. 2 రైలు టెర్మినల్స్, 9 ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్ ను నిర్మించాలనేది సీటీఎస్ నివేదిక వెల్లడించింది. అందులో భాగంగానే మియాపూర్‌లో ఐసీబీటీని ప్రతిపాదించినా ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు.