రాష్ట్రంలో ప్రభుత్వానికి తెలియని మరో కొత్త సమస్య.. ఇప్పుడెలా..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా కట్టడిపై దృష్టి సారించగా ఆదివాసీ, గిరిజన గూడేల్లో సీజనల్ జ్వరాలు వెలుగులోకి రావడంలేదు. కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తూ జ్వరాలకు మాత్రలతో సరిపెడుతోంది. అయితే ఏ కారణంగా జ్వరం వచ్చిందో నర్సులు, ఏఎన్ఎంలు, ‘ఆశా‘ వర్కర్లు నిశితంగా దృష్టి పెట్టడంలేదు. కేవలం ప్రజల నుంచి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో మాత్రమే అడిగి తెలుసుకుంటూ రికార్డుల్లో నమోదు చేసుకుంటున్న […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా కట్టడిపై దృష్టి సారించగా ఆదివాసీ, గిరిజన గూడేల్లో సీజనల్ జ్వరాలు వెలుగులోకి రావడంలేదు. కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తూ జ్వరాలకు మాత్రలతో సరిపెడుతోంది. అయితే ఏ కారణంగా జ్వరం వచ్చిందో నర్సులు, ఏఎన్ఎంలు, ‘ఆశా‘ వర్కర్లు నిశితంగా దృష్టి పెట్టడంలేదు. కేవలం ప్రజల నుంచి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో మాత్రమే అడిగి తెలుసుకుంటూ రికార్డుల్లో నమోదు చేసుకుంటున్న వైద్యారోగ్య బృందాలు సీజనల్ జ్వరాలను పట్టించుకోలేదు. వైద్య బృందాలు ఇచ్చిన మాత్రలను వాడుతూ ఉన్నా జ్వరం తగ్గకపోవడంతో స్వంతంగా సమీపంలోని మండల కేంద్రాలకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత టైఫాయిడ్ నిర్ధారణ అవుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్, పదర, ఈగలపెంట, దోమలపెంట తదితర మండలాల్లో గిరిజనులు, ఆదివాసీలు నివసించే మారుమూల గ్రామాలు, గూడేల్లో ఈ కేసులు బైటపడుతున్నాయి. ప్రభుత్వ వైద్య బృందాలు గుర్తించకపోయినప్పటికీ రోజుల తరబడి జ్వరం తగ్గకపోవడంతో బాధితులే స్వచ్ఛందంగా ప్రైవేటు లాబ్‌లకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ వైద్య బృందాలు కరోనా మీదన దృష్టి పెట్టడంతో జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలకు మాత్రమే మందులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నాలుగైదు రోజుల పాటు జ్వరం మాత్రలు వాడినా అనారోగ్యం తగ్గడంలేదు. ప్రజలు వైద్య బృందాలను సంప్రదించడానికి మార్గాలు లేవు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు సైతం మరో రౌండ్ సర్వే నిర్వహించేంతవరకు సీజనల్ జ్వరాల సంగతి వెలుగులోకి రావడంలేదు.
మిషన్ భగీరధ నీళ్ళు రాని గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఏటూరునాగారం, కాటారం తదితర ప్రాంతాల్లో కూడా ఇదే తరహా సమస్య ఉంది. నిజానికి సీజన్ మారుతున్నప్పుడల్లా వైద్య బృందాలు గ్రామాల్లో సర్వే నిర్వహించి తీవ్రతకు తగిన విధమైన చర్యలు చేపట్టడం ఆనవాయితీ. ఈసారి కూడా గ్రామాల్లో ఈ బృందాలు తిరుగుతున్నప్పటికీ కేవలం కరోనాపై మాత్రమే దృష్టి పెట్టడంతో మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వారి గమనంలోకి వెళ్ళడంలేదు. మారుమూల గ్రామాలు కావడం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో తట్టుకుని నిలబడగలుగుతున్నారు. కానీ ప్రైవేటు లాబ్‌కు వెళ్ళిన తర్వాత అది టైఫాయిడ్ జ్వరం అని నిర్ధారణ కావడంతో గ్రామాల్లోని ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఈ టైఫాయిడ్ జ్వరాలేవీ ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడంలేదు.
దీంతో ఏయే జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో ఎంత మందికి టైఫాయిడ్ లాంటి సీజనల్ జ్వరాలు ఉన్నాయనేది ప్రభుత్వం అంచనా వేయలేకపోతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రజారోగ్య వ్యవస్థ ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉండడం, ప్రజలు వైద్య చికిత్సలు పొందడానికి అనేక పరిమితులు ఏర్పడడం కూడా సీజనల్ జ్వరాలు ఉనికిలోకి రాకపోవడానికి ఒక కారణంగా మారింది. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు గ్రామాల్లో తిరుగుతున్నప్పటికీ నీటి ద్వారా సంక్రమించే జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోవడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.