తొలిరోజు ప్రైవేటు ల్యాబ్‌లలో రెండున్నర వేల టెస్టులు
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రైవేటు ల్యాబ్‌లతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తొలిరోజైన మంగళవారం సుమారు రెండున్నర వేల టెస్టులు జరిగాయి. బుధవారం నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌లలో ఎన్ని టెస్టులు చేశారు, ఎవరెవరికి చేశారు, రిపోర్టుల్లో వచ్చిన ఫలితం ఏంటి, వారికి ఉన్న లక్షణాలు ఏంటి తదితర వివరాలన్నింటినీ ప్రతీరోజు ప్రభుత్వానికి తెలియజేసేందుకు […]
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రైవేటు ల్యాబ్‌లతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుబంధంగా ఉన్న ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తొలిరోజైన మంగళవారం సుమారు రెండున్నర వేల టెస్టులు జరిగాయి. బుధవారం నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌లలో ఎన్ని టెస్టులు చేశారు, ఎవరెవరికి చేశారు, రిపోర్టుల్లో వచ్చిన ఫలితం ఏంటి, వారికి ఉన్న లక్షణాలు ఏంటి తదితర వివరాలన్నింటినీ ప్రతీరోజు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలుగా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఒక పోర్టల్‌ను సిద్ధం చేసినా తొలి రోజు ఆ వివరాలేవీ అందలేదు. సాంకేతికపరమైన సమస్యలను ప్రైవేటు ల్యాబ్‌లు ప్రస్తావించాయని, బుధవారం నుంచి పకడ్బందీగా అమలవుతుందని ఆ అధికారి తెలిపారు. ఏయే ల్యాబ్‌లో ఎన్ని టెస్టులు జరిగాయో వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన ఆ అధికారి ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన పేషెంట్ల వివరాలను సేకరిస్తున్నామని, వారితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వ్యక్తుల వివరాల ఆధారంగా వైద్యారోగ్య సిబ్బంది తదుపరి కార్యాచరణ మొదలుపెడతారని తెలిపారు.
నేటి నుంచి ప్రభుత్వ పరీక్షలు
కరోనా నిర్ధారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనుకున్న పరీక్షలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. మొత్తం పది ప్రభుత్వ ల్యాబ్‌లు ఉన్నప్పటికీ వరంగల్, ఆదిలాబాద్ రిమ్స్ మినహా మిగిలినవన్నీ హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. కరోనా టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకున్న ఈ ల్యాబ్‌లలో ఎవరెవరికి పరీక్షలు చేయాలనేదానిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఆ అధికారి తెలిపారు. రానున్న వారం పది రోజుల్లో యాభై వేల టెస్టులు చేసిన తర్వాత వచ్చే ఫలితాలకు అనుగుణంగా ఇంకా ఎన్ని టెస్టులు జరపాల్సిన అవసరం ఉంటుందో స్పష్టత వస్తుందని తెలిపారు. యాభై వేల టెస్టులతోనే సరిపెట్టాలన్న ఆలోచన లేదని, కరోనా వైరస్ ప్రమాదం ఉన్న అందరికీ చేస్తామని ఆ అధికారి పేర్కొన్నారు.